Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఇజం

సినిమా రివ్యూ: ఇజం

రివ్యూ: ఇజం
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌
తారాగణం: నందమూరి కళ్యాణ్‌రామ్‌, జగపతిబాబు, అదితి ఆర్య, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, అలీ, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్‌ తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: జునైద్‌ సిద్ధికి
ఛాయాగ్రహణం: ముఖేశ్‌ జి.
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
విడుదల తేదీ: అక్టోబరు 21, 2016

'బిజినెస్‌మేన్‌'లో మహేష్‌బాబు ఏం చేస్తాడు? మాఫియా డాన్‌ కావాలనే కోరికతో ముంబయి వెళ్లి అక్కడ కమీషనర్‌ కూతురిని ప్రేమిస్తున్నానంటూ ఆమెకి దగ్గరవుతాడు. 'ఇజం'లో కళ్యాణ్‌రామ్‌ కూడా ఇంచుమించు అదే చేస్తాడు. ఒక మాఫియా డాన్‌ ఆట కట్టించడానికి, అతని గుట్టు కనిపెట్టడానికి అతని కూతురికి దగ్గరవుతాడు. 

లక్షల కోట్ల నల్ల ధనాన్ని పరాయి దేశంలోని బ్యాంకుల్లో దాచుకుని భారతదేశం వెనకబడిపోవడానికి కారణమైన రాజకీయ నాయకులు, వ్యాపారస్తులని కొట్టి, వాళ్లు దాచిపెట్టిన డబ్బుని దేశంలోని అందరికీ పంచేయాలని ప్లాన్‌ చేస్తాడు జర్నలిస్ట్‌ అయిన హీరో. ఇదీ సింపుల్‌గా ఇజం కథ. పకడ్బందీ స్క్రీన్‌ప్లే రాసుకుంటే కట్టిపడేసే స్టఫ్‌ ఉన్న ప్లాట్‌. కానీ పూరి ఈ కథని కూడా తన అన్ని చిత్రాల మాదిరిగానే ట్రీట్‌ చేయడంతో 'ఇజం' కూడా పూరి ఇటీవల తీస్తోన్న చాలా సినిమాల మాదిరిగా సాదాసీదాగా తయారైంది. 

చిన్నప్పుడు హీరోలోని రెబల్‌ నిద్ర లేవడం దగ్గర్నుంచి, చివరిగా బడా బాబుల బ్యాంక్‌ అకౌంట్లని హ్యాక్‌ చేయడం వరకు ఎక్కడా వహ్వా అనిపించే స్ట్రయికింగ్‌ సీన్‌ లేదు. ఏ దశలోను తర్వాతేం జరుగుతుందనే ఉత్కంఠ లేదు. ఏ క్షణంలోను కదిలించే ఎమోషన్‌ లేదు. జస్ట్‌ అలా తెరపై సన్నివేశాలు ఒకదాని వెంట ఒకటిగా పర్పస్‌ లేకుండా సాగిపోతుంటాయి. పాత్రలు దర్శకుడు చెప్పినట్టు యాంత్రికంగా చేసుకుంటూ పోతుంటాయి. 

శంకర్‌ సినిమాల్లో కనిపించే మాదిరి వెయిట్‌ ఉన్న సోషల్‌ కాజ్‌ని కథాంశంగా పూరి ఎంచుకున్నాడు. కానీ సహజత్వానికి దూరంగా ఒక సగటు కమర్షియల్‌ సినిమాగా తీర్చిదిద్దాడు. హీరో పెట్టుకున్న లక్ష్యం చిన్నదేం కాదు. దానిని చేరుకోవడం అంత సులభం కాదు. కానీ 'బిజినెస్‌మేన్‌'లో మహేష్‌ ఎలాగైతే సింపుల్‌గా అలా అలా డాన్‌ అయిపోతాడో, ఇక్కడా హీరో తను పెట్టుకున్న టార్గెట్‌ చులాగ్గా చేరిపోతాడు. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న డాన్‌తో పెట్టుకుంటున్నాడనే ఉత్కంఠ కూడా ఏమీ ఉండదు. ఆ డాన్‌ (జగపతిబాబు) ఏమో బీచ్‌లో కూర్చుని హీరోతో (కళ్యాణ్‌రామ్‌) కలిసి బీడీలు తాగుతుంటాడు. అంత సెక్యూరిటీ ఉన్న తన ఇంట్లోకి ఒకడు ఈజీగా వచ్చి తన ల్యాప్‌టాప్‌ పట్టుకుపోయినా, నడి సముద్రంలోకి దూకి తన కూతురు తన ఎదురుగానే పారిపోయినా అతనితో పాటు అతని అనుచరులూ ఏం చేయలేరు. 

ఇక హీరోయిన్‌తో ప్రేమ వ్యవహారం అయితే 'పోకిరి' దగ్గర్నుంచి చూస్తోన్న పూరీయణమే. కనిపిస్తే తాళి కట్టేస్తా అంటూ తిరిగే అతడిని ఆమె ప్రేమించేస్తుంది. తనని మోసం చేసాడని తెలిసినా కూడా అతని కోసం దేశాలు దాటి వచ్చేసి, 'నువ్వు లేకపోతే చచ్చిపోతా' అని ఆమె పరితపించిపోవాలంటే అంత ఘాటైన, గాఢమైన భావాలు పుట్టడానికి తగిన కారణాలుండాలి కదా? ఈ ప్రేమే లేని ప్రేమకథతోనే ప్రథమార్ధం గడిచిపోతుంది. ఇంటర్వెల్‌ తర్వాత విషయానికి రావడం వల్ల ఒకింత మెరుగనిపించినా కానీ పూరి దానిని కూడా చాలా సింపుల్‌గా తేల్చేసాడు. ఒక హ్యాకర్‌ సర్వర్స్‌లోకి ఎంటర్‌ అయిన తర్వాత కూడా అంత పెద్ద ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఏం చేయకుండా, బ్యాంక్‌లోని డబ్బంతా అతను హరించేసేదాకా వేడుక చూస్తుంటారు. హీరోకి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా మొత్తం పని జరిగిపోతుంది. కోర్టు సీన్‌లో సమాజాన్ని ఎండగడుతూ రాసిన సంభాషణల వరకు మెరుగనిపిస్తాయి. ఆ సీన్‌తో సినిమా ఎండ్‌ అయి ఉంటే బయటకి వచ్చేప్పుడు కొంచెం బెటర్‌ ఫీలింగ్‌ ఉండేదేమో. కానీ ఆ తర్వాత జగపతిబాబు క్యారెక్టర్‌ని మరీ బఫూన్‌ని చేసేసి, అవసరం లేని ఫైట్‌తో 'ఇజం' నీరసంగా ముగుస్తుంది. 

బిజినెస్‌మేన్‌లో ఒక సీరియస్‌ ప్లాట్‌ని ఇలాగే లాజిక్‌ లేకుండా, చాలా సాధారణ విషయమన్నట్టు తీసేసినా అది వర్కవుట్‌ అవడానికి మహేష్‌ స్టార్‌ వేల్యూ హెల్ప్‌ అయింది. కళ్యాణ్‌రామ్‌ సినిమాలో కాస్త వాస్తవికతని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. కానీ పూరి తన బ్రాండ్‌ స్క్రీన్‌ప్లేనే రాసేసి ఇజంని ఒక సగటు సినిమా చేసాడు. ఈ చిత్రంలో చెప్పుకోతగ్గ విషయం ఏమిటంటే, కళ్యాణ్‌రామ్‌ మేకోవర్‌. కేవలం ఆహార్య పరంగానే కాకుండా అతని నటనలో, కదలికల్లో, హావభావాల్లో చాలా మార్పులు కనిపిస్తాయి. ప్రతి హీరోకీ మేకోవర్‌ ఇచ్చే విషయంలో పూరి జగన్నాథ్‌ని మించిన దర్శకుడు లేడని ఒప్పుకోవాలి. అదితి ఆర్య ఏమంత ఆకట్టుకోలేదు. జగపతిబాబు కామెడీ విలన్‌ అయిపోయాడు. వెన్నెల కిషోర్‌, అలీ కామెడీ క్లిక్‌ అవలేదు. 

నిర్మాణ పరంగా రాజీ పడని కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రంపై భారీగా ఖర్చు పెట్టాడు. విజువల్స్‌ చాలా బాగున్నాయి. కెమెరా వర్క్‌ ఆకట్టుకుంటుంది. అనూప్‌ మ్యూజిక్‌ కూడా ఫర్వాలేదు. పూరి సినిమాల్లో ఉండే అద్భుతమైన పంచ్‌ డైలాగులు ఇందులో పూర్తిగా మిస్‌ అయ్యాయి. జర్నలిజం గొప్పతనం గురించి పూరి తన స్టయిల్లో తీసిన ఈ చిత్రానికి ఆకట్టుకునే కథనం ఉన్నట్టయితే ఒక స్పెషల్‌ సినిమా అయి ఉండేదేమో కానీ ఇప్పుడు మాత్రం పూరి తీసిన అనేక సినిమాల్లో ఇదీ ఒకటి అన్నట్టుగా మిగిలింది. 

బాటమ్‌ లైన్‌: పూరీ-ఇజం!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?