'పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరిని కోరుకోవడంలేదు.. కేంద్రంతోనూ అదే వైఖరి కొనసాగిస్తున్నాం..'
– ఇదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజాగా నేడు చేసిన వ్యాఖ్యల సారాంవం.
హైద్రాబాద్ నుంచి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్ని, సచివాలయంతో సహా ఖాళీ చేసేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే సచివాలయాన్ని తమకు అప్పగించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ నరసింహన్‌ని కోరింది. ఈ వ్యవహారంపై గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో విజయవాడలో చర్చలు జరిపారు. అయితే, చంద్రబాబు ఈ విషయంపై ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు.
'క్యాబినెట్‌లో చర్చిస్తాం.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం..' అని చెప్పిన చంద్రబాబు, పొరుగు రాష్ట్రంతో ఘర్షణ వాతావరణం కోరుకోవడంలేదని చెప్పడం వరకూ బాగానే వుంది. కేంద్రంతోనూ ఘర్షణ వాతావరణాన్ని కోరుకోవడంలేదని చెప్పడం వరకూ ఓకే. కానీ, ప్రత్యేక హోదా విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయనీ, తాము మాత్రం కేంద్రంతో సర్దుకుపోతున్నామనీ చంద్రబాబు చెప్పడమే వివాదాస్పదమవుతోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వంతో చంద్రబాబు సర్దుకుపోయారు. దానికి ఫలితమే, ఓటుకు నోటు కేసు నత్తనడకన సాగడం. ఇక, కేంద్రంతో ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రాజీ పడ్డమాట వాస్తవం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతున్నారు. 'నేను ఏ విషయంలోనూ రాజీ పడబోను..' అని చెప్పే చంద్రబాబే, 'కేంద్రంతో సర్దుకుపోయాం' అని చెప్పడమేంటట.?
ప్రత్యేక హోదా రానిదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందబోదని ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మన్మోహన్ సర్కార్, ఆంధ్రప్రదేశ్‌కి ఐదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ప్రకటిస్తే, కాదు కాదు పదేళ్ళు అవసరమని బీజేపీ నినదించింది. తాము అధికారంలోకి వచ్చాక పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చింది. కాదు కాదు, పదిహేనేళ్ళు కావాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేసేశారు.
ఏమయ్యింది.? ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు.. ప్రత్యేక సాయం పేరుతో ఆంధ్రప్రదేశ్ బొచ్చెలో కేంద్రం బిచ్చమేసింది. ఆ బిచ్చమేదీ.? అనడిగితే, వస్తుంది ఆగండి.. ఈలోగా ప్రాణాలు పోతాయా.? అన్నట్లు ప్రశ్నిస్తోంది అటు కేంద్రం, ఇటు రాష్ట్రం. చంద్రబాబు సర్దుకుపోవాల్సిందే తప్ప.. ఎందుకంటే, ఓటుకు నోటు కేసు తీవ్రత అలాంటిది. కానీ, రాష్ట్ర ప్రజలకు ఏం ఖర్మ.? పార్లమెంటు సాక్షిగా దక్కిన హక్కుని సాధించుకోవాలి కదా.!