విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు ఉపసంహరణ అన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రీవేటీకరణ తధ్యమని ఆ విధంగా ఆమె తేల్చారన్న మాట. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో స్థానిక ప్రజల భావోద్వేగాలను అర్ధం చేసుకున్నామని చెబుతున్న పురంధేశ్వరి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇవ్వలేకపోతున్నారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు తాము అండగా ఉంటామని, వారు మేలు కోరే విధంగా తాము కేంద్రానికి కొన్ని సూచనలను చేశామని పురంధేశ్వరి వెల్లడించారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయినా ప్రస్తుతం ఉద్యోగులు వారి ఉపాధికి ఇబ్బంది కలగకుండా మాత్రమే చూస్తామని ఆమె అంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో గత 900 రోజులుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన సాగుతోంది. ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాని మరే ఇతర ప్రతిపాదనలకు తాము ఒప్పుకునేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఏపీ బీజేపీ నాయకులు మాత్రం వారి మాటలను వినే పరిస్థితిలో లేరని అంటున్నారు.
పురంధేశ్వరి మాటలను బట్టి చూస్తూంటే ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుందని, దాన్ని ఆపలేమని అర్ధం వస్తోంది. అదే నిజమైతే విశాఖ సహా ఉత్తరాంధ్రాలో పార్టీని బలోపేతం చేస్తామని బీజేపీ చేస్తున్న యాత్రల వల్ల ఉపయోగం ఏమిటి అన్న ప్రశ్న వస్తోంది. స్టీల్ ప్లాంట్ సమస్య మీద సానుభూతి ఉంది అని చెబితే సరిపోతుందా చిన్నమ్మా ప్లాంట్ ని కనీసం సెయిల్ లో విలీనం చేసే విధంగా అయినా కేంద్రానికి సూచనలు ఇస్తే ఉత్తరాంధ్రా ప్రజలు ఏపీ బీజేపీని నమ్ముతారని అంటున్నారు.