ఏపీ బీజేపీలో కొత్త చీఫ్ వచ్చారు. ఆమె పూర్వాశ్రమం కాంగ్రెస్. అంతకు ముందు ఆమె తండ్రి టీడీపీని స్థాపించిన ఎన్టీయార్. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు అందులో కీలకంగా పనిచేసారు. ఆ విధంగా ఆమెకు టీడీపీ ప్రత్యర్ధి పార్టీ అవుతుందా అన్నది పక్కన పెడితే సాఫ్ట్ కార్నర్ తో ఆమె ఉన్నారని విమర్శలు వైసీపీ నుంచి వస్తున్నాయి.
దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి చంద్రబాబుని కానీ టీడీపీని కానీ ఒక్క మాట కూడా అనకుండా వైసీపీ మీదనే విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు. ఆమె ఏపీలో తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారు అని ఘాటు విమర్శ చేశారు వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్.
విశాఖ వచ్చిన పురంధేశ్వరి జగన్ సర్కార్ మీద మండిపడుతూ ఎన్నో విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు అన్నీ వైసీపీ నేతల జేబుల్లోకి పోతున్నాయని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి కౌంటర్ ఇస్తూ గుడివాడ ఏపీ బీజేపీ కోసం కాకుండా పురంధేశ్వరి చంద్రబాబు కోసమే పనిచేస్తున్నట్లుగా ఉందని కౌంటర్ ఇచ్చారు.
మాటి మాటికీ కేంద్రం ఏపీకి నిధులు ఇస్తోంది అని పురంధేశ్వరి అంటున్నారు కానీ ఆ నిధులు ఎక్కడివి, ఏపీ ప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా తిరిగి వారికి ఇస్తున్నది అది కూడా రాజ్యాంగ బద్ధంగానే వస్తున్నది తప్ప మరేమీ కాదు కదా అని హాట్ కామెంట్స్ చేశారు.
కేవలం ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు తప్ప చేసిన మంచి పురంధేశ్వరికి కనిపించడంలేదా అని గుడివాడ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పధకాలు ఏపీలో అమలు అవుతున్నాయని, అలాగే ఇచ్చిన హామీలు తుచ తప్పకుండా అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని గుడివాడ పేర్కొన్నారు.