వర్షాలు పడడం వల్ల కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలు చల్లబడడం కాదు, రెండు రాష్ట్రాల రాజకీయ వాతావరణం కూడా చల్లబడిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్, భాజపా, తెరాస హడావుడి ఆ మధ్య కాస్త కనిపించింది.
భాజపాలో ఇన్ సైడ్ అసంతృప్తి వ్యవహారం, కాంగ్రెస్ లో కుమ్ములాటలు, తెరాసలో ఉత్సాహం అన్నీ ఇప్పుడు కాస్త చల్లారిపోయాయి. ఎన్నికలు జస్ట్ కొన్ని నెలల దూరంలో వున్నా తెలంగాణలో పెద్దగా హడావుడి అయితే లేదు. గమ్మత్తేమిటంటే తెలంగాణలో వర్షాలు మిగిల్చిన నష్టాన్ని కానీ, జనాల అవస్థలు కానీ మీడియా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలంగాణలో మీడియా మౌన వ్రతం పాటిస్తూ, ఆంధ్రలో మాత్రం చెలరేగిపోతోంది.
ఆంధ్ర విషయానికి వస్తే అక్కడ కూడా రాజకీయం చప్పగా చల్లారింది. పవన్ తూగో..పగో పర్యటన ముగిసింది మళ్లీ నెలాఖరుకు పాలకొల్లు పర్యటన వుంది. అప్పటి వరకు సైలంట్ నే. లోకేష్ యాత్ర మరీ తెలుగుదేశం అనుకుల మీడియా లోపలి పేజీలకు పరిమితం అయిపోయింది. జగన్ తన పంపిణీ కార్యక్రమాలు, బటన్ నొక్కడం తాను కొనసాగిస్తున్నారు. మీడియా మాత్రం నిత్యం ఆయాస పడుతూనే వుంది. జగన్ మీద నెగిటివ్ జనాల్లో ఎలా పెంచాలా అని కిందా మీదా పడుతూనే వుంది. పేజీలకు పేజీలు నెగిటివ్ వార్తలు వండి వార్చడం అంటే కష్టమే. అందుకే ఆఖరికి ఫేక్ వార్తల ప్రచురణకు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా దిగజారిపోయింది.
ఒకప్పటి నుంచి పాటిస్తున్న డామ్ ఓల్డ్ స్ట్రాటజీ ఏమిటంటే విశాఖలో ఏదో అయిపోతోందని విజయవాడ ఎడిషన్ లో చాటడం, విజయవాడలో ఏదో జరిగిపోతోంది విశాఖ ఎడిషన్ లో చాటడం. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఈ పాత డ్రామాలు చెల్లడం లేదు. విశాఖలో ఏం జరుగుతోందో విశాఖ వాసులకు క్లారిటీ వుంది. సేమ్ టు సేమ్ విజయవాడలో కూడా. అన్నింటికి మించి మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా సోషల్ మీడియానే పల్లెల్లోకి ఎక్కువగా వెళ్తోంది. అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా చెల్లని కాసుగా మారుతోంది.
అందుకే ఎంత ఎగసం దోసే ప్రయత్నం చేసినా, రాజకీయ హడావుడి అయితే పెద్దగా కనిపించడం లేదు. పైగా వర్షాలు పడుతుండడం, పొలం పనులు మొదలు అవుతుండడంతో జనం ఇటు దృష్టి పెట్టడం లేదు. మరొక్క నెల ఆగితే పండగల సీజన్ మొదలవుతుంది. అప్పుడు జనం అంతా ఇక అటు దృష్టి పెడతారు. రాజకీయాలు ఇంకా చల్లారుతాయి. అందులోనూ ఆంధ్రలో తొందరపడి ముందే కూసాయి ప్రతిపక్ష రాజకీయ కోయిలలు. ఇప్పట్లో ఎన్నికలు రావు అని అర్థం అయింది.
ఇక ఎన్నాళ్లని పాడిందే పాడతారు. అందుకే కాస్త గ్యాప్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.