అమెరికా రాజకీయాలు: అక్కడా ‘హిందూ’ కార్డు.!

అమెరికాకి కాబోయే అధ్యక్షుడిని తానేనని చెప్పుకుంటున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ వున్నపళంగా 'హిందువులకు మిత్రుడు' అయిపోయాడు. 'నేనుగనుక అమెరికా అధ్యక్షుడిని అయితే హిందువులకి, భారతీయులకు ఎంతో గౌరవమిస్తాను..' అంటూ ప్రకటించేశాడాయన. ట్రంప్‌కి ముస్లింలకీ…

అమెరికాకి కాబోయే అధ్యక్షుడిని తానేనని చెప్పుకుంటున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ వున్నపళంగా 'హిందువులకు మిత్రుడు' అయిపోయాడు. 'నేనుగనుక అమెరికా అధ్యక్షుడిని అయితే హిందువులకి, భారతీయులకు ఎంతో గౌరవమిస్తాను..' అంటూ ప్రకటించేశాడాయన. ట్రంప్‌కి ముస్లింలకీ అస్సలేమాత్రం పడదన్న భావన ఇప్పటికే క్రియేట్‌ అయ్యింది. ముస్లింలందర్నీ టెర్రరిస్టులుగానే భావిస్తున్నాడు ట్రంప్‌. 'అందర్నీ అని కాదుగానీ, మెజార్టీ..' అంటూ ఆయన ఇప్పటికే వివాదాల్లోకి ఎక్కేశాడు.. ముస్లింల ఆగ్రహాన్ని చవిచూస్తున్నాడు కూడా. 

మన దేశంలో అయితే కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట రాజకీయాలు నడుస్తుంటాయి. బీజేపీపై 'హిందూ ముద్ర' వేసి రాజకీయ లబ్ది పొందుతుంటాయి వివిధ రాజకీయ పార్టీలు. ఆ 'హిందూ' కార్డుని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేక, 'తాము అందరి వాళ్ళమని' అన్పించుకోలేక బీజేపీ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. బీజేపీలో మెజార్టీ 'హిందుత్వ' భావనతో వుండే నేతలే కన్పిస్తారనుకోండి.. అది వేరే విషయం. సకల మతాల సమ్మేళనం అయిన భారతదేశంలో ఈ మత రాజకీయాలు మామూలే. 

కానీ, అమెరికాలో ఈ మత రాజకీయాల్ని మనం ఊహించలేం. పైగా, భారతీయులు అమెరికన్ల ఉద్యోగాల్ని కొల్లగొడ్తున్నారంటూ ఓ ఏడుపు ఏడ్చేసిన ట్రంప్‌, ఇప్పుడిలా హిందువులపైనా, భారతీయులపైనా ఎనలేని మమకారం ప్రదర్శించేడం ఆశ్చర్యకరమైన విషయమే. తనకు మోడీ చాలా ఇష్టమైన స్నేహితుడని, తాను అమెరికా అధ్యక్షుడినయ్యాక భారత్‌ – అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు ఇప్పుడున్నదానికన్నా చాలా చాలా బలోపేతమవుతాయని ట్రంప్‌ చెబుతున్నాడు.

అమెరికాలో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువే. వారి మద్దతు తనకు అవసరమని ట్రంప్‌ ఇప్పుడిప్పుడే గుర్తించినట్లున్నాడు. మెజార్టీ భారతీయులు హిల్లరీ వైపు దృష్టి సారిస్తున్నారనే అంచనాల నడుమ, ట్రంప్‌ ఇప్పుడు 'భారతీయ, హిందూ' కార్డుల్ని తెరపైకి తీసుకురావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?