చైనాకి చెక్‌ పెట్టడం సాధ్యమేనా.?

చైనా కంప్యూటర్‌.. చైనా బొమ్మలు.. చైనా క్రాకర్స్‌.. చైనా బైక్స్‌.. చైనా టైర్లు.. చైనా మొబైల్స్‌.. ఆఖరికి చైనా రైస్‌.. చైనా గుడ్లు కూడా.! ప్రపంచంలోని మిగతా దేశాల సంగతేమోగానీ, చైనా ప్రోడక్ట్స్‌ని వినియోగించడంలో…

చైనా కంప్యూటర్‌.. చైనా బొమ్మలు.. చైనా క్రాకర్స్‌.. చైనా బైక్స్‌.. చైనా టైర్లు.. చైనా మొబైల్స్‌.. ఆఖరికి చైనా రైస్‌.. చైనా గుడ్లు కూడా.! ప్రపంచంలోని మిగతా దేశాల సంగతేమోగానీ, చైనా ప్రోడక్ట్స్‌ని వినియోగించడంలో భారతదేశం మాత్రం సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. చైనా ఉత్పత్తులంటేనే చాలా చీప్‌గా దొరికేసేవి. చైనా మొబైల్‌ వాడితే ప్రమాదం.. ఆ విషయం తెలిసీ వాడేస్తాం. చైనా టపాసులు పేల్చితే, ఆరోగ్యానికి కారణం.. అయినా వాడేస్తున్నాం.. వాడేస్తూనే వుంటాం. 

భారత్‌ – పాక్‌ మధ్య యుద్ధ మేఘాల నేపథ్యంలో, చైనా ఉత్పత్తులపై నిషేధం అన్న అంశం తెరపైకి వచ్చింది. చైనా, పాకిస్తాన్‌కి మద్దతివ్వడం, అదే సమయంలో బ్రహ్మపుత్రా నదిపై చైనా పెత్తనం.. వీటితోపాటు ఎన్‌ఎస్‌జి గ్రూపులో భారత్‌కి చోటు లేకుండా చైనా అడ్డుపడ్తుండడం వంటి కారణాలతో, భారతదేశంలో చైనా పట్ల రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతోంది. కానీ, ఆ వ్యతిరేకత చైనా ఉత్పత్తుల విషయంలో వుంటుందా.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

సోషల్‌ మీడియా వేదికగా చైనా ఉత్పత్తులపై పెద్ద చర్చే జరుగుతోంది. పత్రికలు, న్యూస్‌ ఛానళ్ళు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చైనా ఉత్పత్తులపై కథనాలతో విరుచుకుపడ్తున్నాయి. గతంలో సందర్భాలు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. మేకిన్‌ ఇండియా నినాదంతో భారతదేశం దూసుకెళ్తోంది. ఈ పరిస్థితుల్లో చైనా అనే కాదు, ప్రపంచంలో ఏ ఇతర దేశానికి ప్రోడక్ట్‌ని వాడే విషయంలో అయినాసరే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే. విదేశీ వస్తు బహిష్కరణ కాదిక్కడ.. స్వదేశీ వస్తువులకు ప్రోత్సాహం అవసరం. 

పది వేలు పెట్టి బ్రాండెడ్‌ మొబైల్‌ కొనుగోలు చేసే బదులు.. మార్కెట్‌లో రెండు వేలకే దొరికే చైనా మొబైల్‌ని కొనేయడం తేలిక. చైనా మొబైల్‌తో పోల్చితే కాస్త ధర ఎక్కువైనా, ఇండియాలో తయారయ్యే మొబైల్‌ ఫోన్స్‌కి ఆదరణ పెరగాలి. వాటి ధర, విదేశీ బ్రాండెడ్‌ మొబైల్స్‌తో పోల్చితే కాస్త తక్కువే వుంటుంది. విదేశీ బ్రాండెడ్‌నీ, చైనా డూప్లికేట్లనీ వాడేకన్నా.. స్వదేశీ వస్తువుల్ని ఉపయోగించడం మేలు కదా.! 

చైనా వస్తువుల్ని నిషేధించాలనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే, అది ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాల్ని చెడగొడ్తుంది. అదే మన దేశంలోనే ఆ చైనా వస్తువుల, విదేశీ వస్తువుల వాడకంపై అవగాహన పెరిగి, స్వదేశీ నినాదం జోరందుకుంటే.. చైనాతోనే కాదు, ఏ దేశంతోనూ విబేదాలు తలెత్తేందుకు అవకాశముండదు. అన్నిటికన్నా మిన్నగా, ఆరోగ్యానికి హాని కల్గించే చైనా ఉత్పత్తుల విషయంలో విద్యాధికులు, అప్రమత్తంగా వుండాలి.. మిగతావారికి అవగాహన కల్పించేలా వుండాలి. 

ఎలక్ట్రానిక్‌ పరికరాల సంగతి పక్కన పెడితే చైనా రైస్‌, చైనా ఎగ్స్‌.. దేశంలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. బీ అవేర్‌ ఆఫ్‌ చైనా గూడ్స్‌.!