మెగా స్టార్ చిరంజీవి సినిమాకు హీరోయిన్ నే సమస్య అనుకుంటే, ఆఖరికి అయిటమ్ నెంబర్ కూడా అలాగే అయింది. హాట్ హీరోయిన్ కేథరిన్ థెరిస్సా చిరు సినిమాలో అయిటమ్ నెంబర్ అని వార్తలు వినవచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె కాదు..లక్ష్మీ రాయ్ అని వినిపిస్తోంది. నిజమెంతో తెలియదు కానీ, అప్పుడే ఈ మార్పిడి వ్యవహారంపై చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు మార్పిడి అయింది అన్నదే ఇంకా కన్ ఫర్మ్ కాలేదు కానీ, దాని వెనుక ఏదో రాజకీయం వుందని గుసగుస.
ఎందుకంటే కేథరిన్ థెరిస్సా బన్నీకి మంచి నేస్తం. కేథరిన్ ఓ ఢిఫరెంట్ హీరోయిన్ కూడా. ఆమె హంగు ఆర్భాటాలు, అన్నీ ఓ రేంజ్ లో వుంటాయి. సినిమాలు చేయాలని కానీ, బోలెడు చేసేయాలని కానీ హడావుడి ఆమెకు వున్నట్లు కనిపించదు. అలాంటిది అయిటమ్ సాంగ్ కు ఓకె అన్నది అంటేనే అనుమానం. ఇప్పుడు నో చెప్పిందని తెలిస్తే మరీ అనుమానం. నో చెప్పి వుంటుంది ఎందుకు అనుకోవాలి? వీళ్లే వద్దనుకుని వుండొచ్చు కదా? అంటే ఆ చాన్స్ తక్కువే. ఎందుకంటే కేథరిన్ కు వున్న క్రేజ్ లక్ష్మీ రాయ్ కు లేదు. అలాంటపుడు ఎందుకు వద్దనుకుంటారు?
మరి ఇంతకీ కేథరిన్ ఎందుకు నో అని వుంటుంది అనగానే ఇండస్ట్రీ సర్కిళ్లలో వేరే విధమైన గ్యాసిప్ వినిపిస్తోంది. బన్నీకి చరణ్ కు కనిపించని వైరం నడుస్తోంది అన్నదానిపై ఇటీవల చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ బ్యాక్ డ్రాప్ లోనే కేథరిన్ నో చెప్పడమో, మార్చడమో జరిగివుండొచ్చన్నది ఆ గ్యాసిప్ ల సారాంశం.
కేథరిన్ బన్నీతో రెండు సినిమాల్లో నటించింది. తొలి సినిమా ఫ్లాప్ అయినా రెండో సినిమాలో బన్నీ తనే ఆమెను కావాలని సెలెక్ట్ చేసుకుని అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.