ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈమధ్య ఓ మాటన్నారు. ఏమని? ఏపీలో ఏం జరిగితే దేశమంతా దాన్ని అనుసరిస్తుందని. చంద్రబాబు అతిశయోక్తిగా చేసుకునే ప్రచారాల్లో ఇదొకటి. ఇందులో వాస్తవం ఉందని అనుకోలేం. అయినా ఏపీలో ఇప్పటివరకు దేశమంతా అనుసరించాల్సిన గొప్ప పనులు ఏం జరిగాయి?
దేశం సంగతి పక్కన పెడితే తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకదాన్ని మరొకటి అనుసరిస్తుంటాయనడంలో కొంత వాస్తవం ఉంది. తెలంగాణలో ఓ కొత్త పని చేస్తే దాన్ని ఆంధ్రలోనూ చేయాలని ప్రజలు కోరుకుంటారు. అలాగే ఆంధ్రలో ఏదైనా వినూత్నమైన పని చేస్తే అది తెలంగాణలోనూ అమలైతే బాగుండనని భావిస్తారు.
ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు జీతాల పెంపు విషయంలో, కొన్ని పథకాల విషయంలో ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రం అనుసరించిన దాఖలాలున్నాయి. ఈమధ్య ఒలింపిక్స్ విజేత పీవీ సింధుకు నజరానాలు సమర్పించే విషయంలో, ఆమెను సొంతం చేసుకునే (నేటివిటీ) విషయంలో రెండు రాష్ట్రాలు ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడటం చూశాం. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న కొన్ని పథకాలను చంద్రబాబు అమలు చేస్తున్నారు. ఆంధ్రలోని పథకాల గురించి కేసీఆర్ ఆలోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో జిల్లాల విభజనపై ఆంధ్రలోనూ ప్రజల్లో, నాయకుల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ చెప్పినట్లు తెలంగాణ బంగారు తెలంగాణ ఎప్పుడవుతుందో చెప్పలేంగాని ఇప్పుడైతే 31 జిల్లాల తెలంగాణ అయింది. పరిపాలన సౌలభ్యం కోసమని కేసీఆర్ చెబుతున్నప్పటికీ దీనివెనక దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది ప్రతిపక్షాలు చెబుతున్న మాట.
పరిపాలన సౌలభ్యం తద్వారా ప్రజలకు ప్రయోజనాలు ఉండొచ్చు. కాదనం. ఈ విభజన ఎంతమేరకు ప్రయోజనం కలిగించిందో తెలుసుకోవడానికి ఏడాదో రెండేళ్లో పడుతుంది. తెలంగాణలో జిల్లాల విభజన జరిగింది కాబట్టి ఆంధ్రలోనూ జరుగుతుందా? కనీసం బాబు సర్కారు అలాంటి ఆలోచన ఏమైనా చేస్తుందా? అనే సందేహం కలగడం సహజం. జిల్లాల విభజన ప్రజల మేలు కోసమని కేసీఆర్ గట్టిగా చెబుతున్నారు కాబట్టి అలాంటి మేలు తమకూ జరగాలని ఏపీ ప్రజలు కోరుకోవడం తప్పు కాదు.
అందులోనూ కేసీఆర్ ఏ పని చేసినా, ఏ పథకం ప్రవేశపెట్టినా ముందు చూపుతో చేస్తారనే అభిప్రాయం ఏపీ ప్రజల్లోనూ ఉంది. అందుకే తెలంగాణ సర్కారు తీరును వారు నిశితంగా గమనిస్తూ ఉంటారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు గత ఏడాది ఆగస్టులో రాష్ట్రాన్ని 25 జిల్లాలుగా విభజించాలని కోరారు. రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా విభజించాలని అప్పట్లో హరిబాబు డిమాండ్ చేశారు. ఈయన చెప్పిన కారణం కూడా పరిపాలనా సౌలభ్యమే. అయితే ప్రత్యేక హోదా డిమాండ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే హరిబాబు ఈ జిల్లాల డిమాండ్ చేశారని విమర్శలొచ్చాయి.
తెలంగాణలో విభజనపై కసరత్తు సాగుతున్న, కొత్త జిల్లాల కోసం ఆందోళనలు సాగుతున్న సమయంలోనే ఆంధ్రలో జిల్లాల విభజనకు సంబంధించి కొందరు నాయకులు తమకు తోచిన ప్రతిపాదనలు చేశారు. ఒకవేళ జిల్లాలను విభజించాలనుకుంటే ఏవేవి కొత్త జిల్లాలు అయ్యేందుకు అవకాశముందో ఊహాగానాలు చేశారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లోనూ చర్చ జరిగింది.
ప్రస్తుతం 13 జిల్లాలతో ఉన్న రాష్ట్రాన్ని 24 లేదా 25 జిల్లాలతో ఏర్పాటు చేయొచ్చని కొందరు సూచించారు. ఒక్కో జిల్లాలో 20 లక్షల జనాభా ఉండేవిధంగా రాయలసీమలో నాలుగు, కోస్తాంధ్రలో ఎనిమిది కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవచ్చన్నారు. రాయలసీమలో తిరుపతి, నంద్యాల, ప్రొద్దుటూరు, హిందూపురంలను కొత్త జిల్లాలు చేయొచ్చన్నారు. కోస్తాంధ్రలో గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో జనాభా విపరీతంగా ఉంది కాబట్టి వాటిని విడగొడితే బాగుంటుందని కొందరు అభిప్రాయపడ్డారు.
తెనాలి, మాచర్ల, రాజమహేంద్రవరం, అమలాపురం, మార్కాపురం, కావలి….ఇలా ఎన్నెన్నో జిల్లాలుగా తెర మీదకు వచ్చాయి. అయితే 'రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు' అని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు. అందుకు కారణాలు చెప్పలేదు. ఈ విషయంలో తెలంగాణను అనుసరిస్తే అనేక తలనొప్పులు బాబును చుట్టుముడతాయి. ఇప్పటికే అనేక సమస్యలతో ఆయన తల బొప్పి కడుతోంది.
కుల, వర్గ, ప్రాంత రాజకీయాలకు నిలయమైన ఏపీలో జిల్లాల విభజన చేపడితే తెలంగాణను మించి అక్కడ సంకుల సమరం సాగుతుంది. నిజానికి ఆంధ్రలో కొన్ని జిల్లాలు విస్తీర్ణం, జనాభా రీత్యా చాలా పెద్దగా ఉన్నాయి. అలాంటివాటిపై ఆలోచించడం సమంజసమే. కాని ఇది ఇప్పట్లో అయ్యే పనికాదు. జిల్లాల విభజన కారణంగా తెలంగాణలో బ్రహ్మాండమైన ప్రయోజనం కలిగిందని భావిస్తే ఏపీ సర్కారూ భవిష్యత్తులో ఆలోచిస్తుందేమో…!