టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఇప్పించుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఆయనకు గవర్నర్ పదవి వస్తుందని చెప్పడమే తప్ప ఇప్పటివరకు ఆ ఆశ నెరవేరలేదు. కాని…ఆయన కోరిక వచ్చే నెలలో (నవంబరు) తీరబోతున్నట్లు సమాచారం. ఆయన్ని అరుణాచల్ ప్రదేశ్‌కు గవర్నరుగా పంపుతారని బీజేపీ వర్గాల నుంచి సమాచారం వచ్చిందట….! ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.
ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి సమాచారం అనేకసార్లు వచ్చింది. గవర్నర్ పదవి వచ్చేసినట్లేనని సమాచారం రావడం, ఆ తరువాత ఎలాంటి కబురూ కాకరకాయ లేకపోవడం షరా మామూలుగా మారింది. మోత్కుపల్లి గవర్నర్ అయిపోయినట్లేనని చంద్రబాబు కూడా పలుమార్లు చెప్పారు. ఆయన ఆ మాట అన్న తరువాత కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మోత్కుపల్లిని వచ్చే నెలలోనే అరుణాచల్ ప్రదేశ్‌కు గవర్నరుగా పంపాలని కేంద్రం భావిస్తోందని, ఇందుకు సానుకూల సంకేతాలు ఇచ్చిందని బీజేపీ వర్గాల సమాచారం.
ఇది కార్యరూపం దాలిస్తే మోత్కుపల్లి హ్యాపీగా ఫీలవుతారు. డిప్రెషన్ నుంచి బయటపడతారు. మోత్కుపల్లికి హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయాననే బాధ చంద్రబాబుకూ పోతుంది.
ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పానని, ఫలానా వాళ్లను రాష్ట్రపతిని చేశానని, ఫలాన వాళ్లను ప్రధానిని చేశానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ఒక్క గవర్నర్ పోస్టు సాధించడం కోసం సుదీర్ఘకాలంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడటం ప్రధాని మోదీ దగ్గర ఆయన 'పలుకుబడి' ఏమిటో తెలియచేస్తోంది. గవర్నర్ పోస్టు ఇస్తే మోత్కుపల్లికి సంతోషం. కరెక్టే. అంతకంటే ముఖ్యమైన విషయం మోత్కుపల్లి వద్ద, ఇంకా చెప్పాలంటే తెలంగాణ టీడీపీలో చంద్రబాబు పరువు నిలబడుతుంది.
కేంద్రం ప్రత్యేక హోదా ఎగ్గొట్టి 'ప్రత్యేక సాయం' చేస్తుండటాన్ని చంద్రబాబు పైకి హర్షిస్తున్నప్పటికీ రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు ఈమధ్య కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా అందులో బీజేపీకి మొండిచేయి చూపారు. దీంతో కమలం నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే బాబు అడిగిన గవర్నర్ పోస్టు ఇవ్వడమే మార్గమని కేంద్రం భావించిందట…! మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు సహాయమంత్రి పదవి ఇస్తామని కేంద్రం ప్రతిపాదించినా 'అదేమి అక్కర్లేదు. గవర్నర్ పోస్టు ఇవ్వండి' అని చంద్రబాబు వేడుకోవడంతో కేంద్రం 'సరే' అందట.
మొన్నీమధ్య హైదరాబాదులో అసెంబ్లీ సమావేశాల తరువాత (ఉమ్మడి రాజధానిలో చివరి సమావేశాలు) తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన బాబు వారికి అనేక విషయాలపై దిశానిర్దేశం చేశాక ''సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ అవుతున్నారంటే బలహీన వర్గాల అభ్యున్నతికి టీడీపీ తీసుకున్న చొరవే కారణం''..అని చెప్పారు.
బాబు మాటలను బట్టి మోత్కుపల్లికి గవర్నర్ పోస్టు ఖాయమైందని తెలంగాణ టీడీపీ నాయకులు సంతోషించారు. కాని ఆ తరువాత ఏ సమాచారమూ లేదు. మళ్లీ ఇప్పుడు సానుకూల సంకేతాలొస్తున్నాయని చెబుతున్నారు. బాబు చెప్పినప్పుడు ఏ రాష్ట్రానికి గవర్నరుగా నియమిస్తారనేది తెలియలేదు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అంటున్నారు.
ఈ దళిత నేతకు గవర్నర్ పోస్టుపై చంద్రబాబు చాలా ఆశ కల్పించారు. ఒక దశలో అంతా నిర్ణయమైపోయినట్లే మాట్లాడారు. కాని అనేక పరిణామాల కారణంగా వర్కవుట్ అవలేదు. తమిళనాడు గవర్నరుగా రోశయ్య దిగిపోయిన తరువాత కూడా మోత్కుపల్లి ప్రస్తావన లేకపోవడంతో ఆయన చాలా నిరాశ చెందారు. తన సన్నిహితుల వద్ద కూడా చెప్పుకొని బాధపడ్డారట. ఒకప్పుడు టీడీపీలో మోత్కుపల్లి ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు.
టీఆర్‌ఎస్, కేసీఆర్ మీద ఒంటి కాలిపై లేచేవారు. కాని గవర్నర్ పదవి జాప్యంతో నిరాశపడిపోయారు. దాదాపు ఆశలు వదిలేసుకున్నారు. గవర్నరు పదవి రాకపోయినా రాజ్యసభ సీటు ఇప్పించమని తిరుపతి మహానాడులో వేడుకున్నారు. తాను చంద్రబాబుకు హనుమంతుడి వంటి భక్తుడినని, తన జీవితం టీడీపీకే అంకితమని అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన మినీ మహానాడులోనూ తెలంగాణకు ఒక్క రాజ్యసభ సీటు ఇవ్వాలని పార్టీ నాయకులు తీర్మానం చేశారు. కాని అది సాధ్యమయ్యేలా లేదని లోకేష్ చావు కబురు చల్లగా వినిపించాడు. ఇక అప్పటినుంచి గవర్నర్ పదవి అందని ద్రాక్షపండులా ఊరిస్తూ వచ్చింది.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో ఎంతవరకైనా వెళతానని, అవసరమైతే తెగదెంపులు చేసుకుంటానని ఒక దశలో బాబు బీరాలు పలికినప్పుడు నర్సింహులు పని అయిపోయిందనుకున్నారు. కాని ఇప్పుడు మళ్లీ శుభవార్త వినవస్తోంది.