ఎమ్బీయస్‌: అమెరికా వైపు మొగ్గిన బ్రెజిల్‌

భవిష్యత్తులో ఎదగడానికి చక్కటి అవకాశాలున్న దేశాల కూటమిగా పేరు తెచ్చుకున్న బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా)లో ఇండియాను అమెరికా యిటీవలి కాలంలో తన వైపు లాక్కుంది. బ్రెజిల్‌ను లాక్కోవడం కూడా…

భవిష్యత్తులో ఎదగడానికి చక్కటి అవకాశాలున్న దేశాల కూటమిగా పేరు తెచ్చుకున్న బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా)లో ఇండియాను అమెరికా యిటీవలి కాలంలో తన వైపు లాక్కుంది. బ్రెజిల్‌ను లాక్కోవడం కూడా ఆగస్టులో పూర్తయింది. బ్రెజిల్‌లో రగులుకున్న రాజకీయసంక్షోభం గురించి విపులంగా యీ కాలమ్‌లో మే నెలలో రాయడం జరిగింది. అమెరికా ప్రేరేపిత 1964 నాటి సైనికకుట్ర బాధితురాలిగా, వర్కర్స్‌ పార్టీ నాయకురాలిగా దిల్మా రూసెఫ్‌ అమెరికాకు వ్యతిరేకంగానే వ్యవహరించింది. ఇరవై ఏళ్ల సైనికపాలన తర్వాత ప్రజాస్వామ్య పార్టీలు పాలించసాగాయి. 30 పార్టీలు వుండడం చేత సంకీర్ణ ప్రభుత్వాలే గతి అయ్యాయి. 2002 నుంచి దిల్మా ప్రభుత్వపదవుల్లో వుంటూ వచ్చింది. 2010లో అధ్యక్షురాలిగా ఎన్నికై, 2014లో మళ్లీ ఎన్నికైంది. ఆమె పార్టీ పాలనలో 2003-13 మధ్య దారిద్య్రం 55%, అతిదారిద్య్రం 65% తగ్గాయి. నిరుద్యోగం చాలా మటుకు తగ్గిపోయింది. లాటిన్‌ అమెరికాలో తటస్థంగా వున్న లేదా వామపంథాకు మరలిన చాలా దేశాలకు సహాయంగా నిలుస్తూ లాటిన్‌ అమెరికా దేశాల మధ్య సఖ్యతకై ప్రయత్నిస్తూ వచ్చింది. లాటిన్‌ అమెరికన్‌ అండ్‌ కరిబియన్‌ స్టేట్స్‌ (సిఇఎల్‌ఏసి), యూనియన్‌ ఆఫ్‌ సౌత్‌ అమెరికన్‌ నేషన్స్‌ (యుఎన్‌ఏఎస్‌యుఆర్‌) వంటి సమాఖ్యలను రూపుదిద్దింది. అమెరికా సూచించిన 'ఫ్రీ ట్రేడ్‌ ఏరియా ఆఫ్‌ అమెరికా' ప్రతిపాదన ఓడిపోవడానికి కారకురాలైంది. బ్రిక్స్‌లో కూడా చురుకైన పాత్ర వహించింది. 

అయితే పెట్రోలు ధరలు పడిపోవడం మొదలుపెట్టిన నుంచి బ్రెజిల్‌కు కష్టాలు ఆరంభమయ్యాయి. ఆర్థికస్థితి దెబ్బ తినడంతో పొదుపు చర్యలు చేపట్టి వర్కర్ల ఆగ్రహానికి గురైంది దిల్మా. బ్రెజిల్‌ రాజకీయనాయకుల్లో చాలామంది అవినీతికి పాల్పడ్డారు. దిల్మా స్వయంగా అవినీతికి పాల్పడకపోయినా, సంకీర్ణప్రభుత్వంలో భాగస్వాములైన అవినీతిపరులపై చర్య తీసుకోవడానికి వెనకాడింది. చివరకు ధైర్యం చేసి వారిపై కేసులు పెట్టి విచారణ ప్రారంభించేసరికి వారంతా కలిసి దిల్మాను దించేశారు. ఆమెపై అవినీతి ఆరోపణలేవీ లేవని జులైలో ఫెడరల్‌ ప్రాసిక్యూటరు చెప్పినా చిన్న చిన్న కారణాలతో ఆగస్టు 31న సెనేట్‌లో ఆమెను అభిశంసించి, రెండున్నరేళ్లకు ముందే పదవి నుంచి తప్పించాలని తీర్మానం ప్రవేశపెడితే 61 మంది అనుకూలంగా, 20 మంది ప్రతికూలంగా ఓటేశారు. ఆమెకు వ్యతిరేకంగా, తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన వారిలో 60% మందిపై అవినీతి కేసులున్నాయి. దిల్మా స్థానంలో 7గురు సభ్యులున్న పార్టీ నాయకుడు  మైకేల్‌ టెమెర్‌ అధ్యక్షుడయ్యాడు. ఈ విధంగా 13 ఏళ్ల లెఫ్ట్‌ వింగ్‌ వర్కర్స్‌ పార్టీ పాలన ముగిసి, రైట్‌వింగ్‌, అమెరికా అనుకూల ప్రభుత్వం అడ్డదారిలో గద్దె కెక్కింది. 

బ్రెజిల్‌ జనాభాలో 51% మంది శ్వేతేతర వర్ణులు. కానీ టెమెర్‌ కాబినెట్‌లో అందరూ వైట్సే, అందరూ మగవారే. వారిలో 15 మందిపై అవినీతి ఆరోపణలున్నాయి. టెమెర్‌పై కూడా మూడు మిలియన్‌ డాలర్ల లంచం తిన్నట్లు ఆరోపణలున్నాయి. రియో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం నాడు అతను హాజరయితే ప్రజలు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎందుకైనా మంచిదని క్లోజింగ్‌ సెరిమనీకి రాలేదు. ఇలాటి వాడి చేతిలోకి బ్రెజిల్‌ వెళ్లడానికి నిరసనగా వెనెజులా, బొలివియా, ఈక్వడార్‌ బ్రెజిల్‌ నుంచి తమ రాయబారులను వెనక్కి రప్పించుకున్నాయి. క్యూబా అధ్యక్షుడు  'దిల్మా అభిశంసన ఒక రకమైన కుట్రే' అని ప్రకటించాడు. ఐక్యరాజ్యసమితిలో బ్రెజిల్‌ యిన్నాళ్లూ తటస్థంగా లేదా వామపక్షంగా వుంటూ వచ్చింది. ఇప్పుడు దాని పంథా మారడంతో కినిసిన బొలీవియా, కోస్టా రీకా, క్యూబా, ఈక్వడార్‌, నికార్‌గువా ప్రతినిథులు సమితిలో టెమెర్‌ ప్రసంగించడానికి లేవగానే 'అడ్డదారిలో నాయకుడైన వాడి ఉపన్యాసం వినం' అంటూ బయటకు వెళ్లిపోయారు. అమెరికా మాత్రం టెమెర్‌ ప్రభుత్వాన్ని వెంటనే గుర్తించింది. దిల్మాను దింపివేయడం రాజ్యాంగబద్ధంగా వుందని వ్యాఖ్యానిస్తూ అమెరికా-బ్రెజిల్‌ మధ్య సంబంధాలు మరింత దృఢమవుతాయని ప్రకటించింది. ఒబామా హయాంలోనే హోండురాస్‌, పరాగువాలలో యిటువంటి పార్లమెంటరీ కుట్రలను ప్రోత్సహించడం జరిగింది. ప్రస్తుతం వెనెజులాలో కూడా అలాటి ప్రయత్నమే సాగుతోంది. 

ప్రస్తుతానికి బ్రెజిల్‌ ఆర్థికపరిస్థితి ఘోరంగా వుంది. గత ఏడాదే 34 లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. నిరుద్యోగుల శాతం 11.6%కి చేరింది. అక్టోబరులో జరిగిన స్థానిక ఎన్నికలలో ప్రజలు మొన్నటిదాకా పాలించిన వర్కర్స్‌ పార్టీపై తమ ఆగ్రహాన్ని చూపించారు. ఇలాటి పరిస్థితుల్లో టెమెర్‌ ప్రభుత్వం పెన్షన్లు చెల్లించలేదని, రిటైర్‌మెంట్‌ వయసును 54 నుంచి పెంచుతానని, ప్రభుత్వ సంస్థలను విదేశీ ప్రైవేటు సంస్థలకు అమ్ముతానని, తమ దేశంలో ఆయిలు, గ్యాస్‌ వెలికితీసేందుకు విదేశీ కంపెనీలను అనుమతిస్తానని ప్రకటించాడు. ఇవన్నీ అమెరికా అనుకూల విధానాలే. అమెరికాకు పడని చైనా, రష్యాలు సభ్యులుగా వున్న బ్రిక్స్‌ గురించి టెమెర్‌ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి ఒక్క ముక్కా మాట్లాడలేదు. ఇక బ్రిక్స్‌ భవిష్యత్తు ఎలా వుంటుందో చూడాలి.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2016) (ఫోటో – మైకేల్‌ టెమెర్‌)

[email protected]