'ప్రో కబడ్డీ' మొదటి సీజన్‌లోనే తుస్సుమంటుందనుకున్నారంతా. కానీ, నిర్వాహకులు సాహసం చేశారు. సంప్రదాయ క్రీడ కబడ్డీని, దేశ ప్రజల్లోకి చొప్పించాలనీ, వారి మన్ననలు పొందాలనీ విశ్వ ప్రయత్నాలు చేశారు. వారి కష్టం ఫలించింది. సీజన్ సీజన్‌కీ దుమ్ము రేపింది. కబడ్డీ అంటే, ఇప్పుడు క్రికెట్‌తో సమానంగా పాపులారిటీ పొందిన క్రీడ. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఇది నిజం. అనూహ్యంగా కబడ్డీకి పాపులారిటీ పెరిగింది. ఇంకా పెరగాల్సిన అవసరం వుంది కూడా.!
క్రికెట్ అంటే ఇదివరకు ప్యాషన్. ఇప్పుడు అది జస్ట్ ఓ మనీ గేమ్‌లా మారిపోయింది. క్రికెట్ మీద కన్నా 'బ్రాండ్ అంబాసిడింగ్'పై క్రికెటర్లకు యావ పెరిగిపోయింది. ఏ క్రికెటర్ ఆదాయం ఎంత.? అనే చర్చ జోరుగా సాగుతున్న రోజులివి. క్రికెట్ చుట్టూ పెద్ద మాఫియానే నడుస్తోంది. ఆ మాఫియాకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆజ్యం పోసింది. ఇప్పుడు దేశంలో క్రికెట్ ఓ వివాదాస్పద క్రీడగా మారిపోయింది. ఏమో, భవిష్యత్తులో కబడ్డీకి కూడా ఆ 'క్యాన్సర్' సోకినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
టీ20 కంటే తక్కువ టైమ్‌లోనే కబడ్డీ మ్యాచ్‌ని చూసేయొచ్చు. ఇదీ కబడ్డీ స్పెషాలిటీ. ప్రో కబడ్డీ – ఐపీఎల్ తరహాలోనిదే. ప్రపంచ కప్ ఇప్పుడు జరుగుతోంది. టైటిల్ ఫేవరెట్ మాత్రం మన భారత జట్టే. కానీ, దురదృష్టవశాత్తూ తొలి మ్యాచ్‌ని చేజార్చుకుంది. గెలిస్తే బావుండేది.. ఓటమి కూడా విజయానికి తొలి మెట్టే కదా.. అని భారత కబడ్డీ జట్టుకి మద్దతుగా నిలుస్తున్నారు అభిమానులు.
బుల్లితెరపై చాలా ఛానల్స్‌లో లైవ్ ప్రసారాలతో వరల్డ్ కప్ కబడ్డీ హల్‌చల్ చేస్తోంది. టీఆర్పీ రేటింగులు కూడా అదిరే స్థాయిలో వున్నాయట తొలి మ్యాచ్‌కి. ప్రో కబడ్డీ అయితే బీభత్సమైన టీఆర్పీ రేటింగుల్ని సాధించేసింది. వరల్డ్ కప్ పోటీలు నిన్ననే ప్రారంభమయ్యాయి. కొరియా శుభారంభం చేసింది.. అది కూడా టైటిల్ ఫేవరెట్ భారత జట్టు మీద. గెలుపోటముల సంగతి తర్వాత. కబడ్డీ సంప్రదాయ గేమ్. ఇది మన భారతదేశానికి చెందిన సంప్రదాయ క్రీడ. పల్లెల్లో కబడ్డీ గురించి తెలియనివారుండరు. దేహదారుడ్యం, దానికి తోడు మైండ్ గేమ్, మెరుపు వేగం, ఖచ్చితమైన వ్యూహాలు.. ఇవన్నీ కలగలిస్తేనే కబడ్డీ.
క్రికెట్‌ని కాదని ఇంకో గేమ్ వైపు భారత క్రీడాభిమానులు దృష్టి సారిస్తారని బహుశా ఎవరూ కలలో కూడా ఊహించి వుండరు. కానీ, ఇప్పుడు కబడ్డీ దేశాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. అయినాసరే, క్రికెట్‌తో పోల్చితే కబడ్డీకి అభిమానులు ప్రస్తుతానికి తక్కువే. భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా క్రికెట్‌ని, కబడ్డీ ఫాలోయింగ్ పరంగా వెనక్కి నెట్టేస్తుందన్నది నిర్వివాదాంశం.