సినిమా రివ్యూ: ఈడు గోల్డ్‌ ఎహే

రివ్యూ: ఈడు గోల్డ్‌ ఎహే రేటింగ్‌: 2/5 బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై.లి. తారాగణం: సునీల్‌, సుష్మ రాజ్‌, రిచా పనాయ్‌, పునీత్‌ ఇస్సార్‌, జయసుధ, అరవింద్‌కృష్ణ, నరేష్‌, శత్రు, షకలక శంకర్‌,…

రివ్యూ: ఈడు గోల్డ్‌ ఎహే
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై.లి.
తారాగణం: సునీల్‌, సుష్మ రాజ్‌, రిచా పనాయ్‌, పునీత్‌ ఇస్సార్‌, జయసుధ, అరవింద్‌కృష్ణ, నరేష్‌, శత్రు, షకలక శంకర్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, పృధ్వీ తదితరులు
సంగీతం: సాగర్‌ ఎం.శర్మ
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: దేవరాజ్‌
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల
విడుదల తేదీ: అక్టోబరు 7, 2016

సునీల్‌ కామెడీ సినిమాలు మానేసి కమర్షియల్‌ సినిమాలపై దృష్టి పెట్టాడనే విమర్శల నేపథ్యంలో అతను ఈసారి కామెడీ చేయడానికే ట్రై చేశాడు. అవును, ట్రై చేశాడంతే. 'ఈడు గోల్డ్‌ ఎహే'లో సునీల్‌ క్యారెక్టర్‌కి కామెడీ కవరేసి ఉంచినా లోపల సోకాల్డ్‌ కమర్షియల్‌ హీరో అలాగే ఉన్నాడు. అతడిని చూసి అమ్మాయిలు ఎగబడిపోతుంటారు, అతనికి కోపమొస్తే కండలు తిరిగిన రౌడీలు కూడా భయపడిపోతుంటారు. తన వాళ్ల జోలికొస్తే ఫైటేసుకుంటాడు, వీలున్నప్పుడల్లా ఇద్దరు హీరోయిన్లతో సాంగేసుకుంటాడు. కామెడీ అయినా గిలిగింతలు పెడితే మిగతా మసాలాల గురించి పెద్ద పట్టించుకోనక్కర్లేదు. కానీ ఆ కామెడీనే ఏదో మొక్కుబడిగా చేసేసి, మిగతా పనులన్నీ శ్రద్ధగా చేస్తే వీటిని ఎత్తి చూపక తప్పదు. 

కమర్షియల్‌ అంశాల జోలికి పోకుండా ఒక పూర్తి స్థాయి క్రైమ్‌ కామెడీగా మలచినట్టయితే 'ఈడు గోల్డ్‌ ఎహే' గోల్డ్‌ అనిపించుకున్నా, లేకున్నా కనీసం కాస్తయినా మెరిసి ఉండేది. కానీ ఒకే కథలోకి అన్ని అంశాలని ఇరికించే ప్రయత్నంలో ఇది దేనికీ కాని రేవడిగా మిగిలిపోయింది. సునీల్‌ సినిమానుంచి కామెడీ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు కాబట్టి కామెడీ కోసమని చాలా పాత్రల్ని సృష్టించారు. నాలుక తిరగని ప్రాస పదాలతో దండిగా డైలాగులు రాసుకున్నారు. అంత చేసినా కానీ నవ్వుకునే సందర్భం కోసం చాలా నస భరించాలి. 

కామెడీ ఏదో ట్రై చేసి ఫెయిలయ్యారని అనుకుందాం. సెంటిమెంట్‌ పర్వానికొస్తే, ఒక మధ్య వయసు స్త్రీని (జయసుధ) ఒక సందర్భంలో కాపాడతాడు సునీల్‌. ఆమె వెంటనే చనువుగా 'ఒరేయ్‌' అని పిలిచేస్తూ, అతడు అనాధ అని తెలియగానే, 'నువ్వే నా పెద్ద కొడుకు' అంటూ ఇంటికి తీసుకెళ్లిపోతుంది. ఆమె చిన్న కొడుకుని తమ్ముడూ అనేస్తూ ఆ కుటుంబాన్ని తనది అనేసుకుని అక్కడే ఉండిపోతాడతను. ఈ సీన్లని పద్ధతిగా రాసుకుంటే ఎలా ఉండేవో ఏమో కానీ, 'తెలుగు సినిమాల్లో ఇంతే' అన్నట్టు ఏదో 'ప్యారడీ సీన్స్‌' తరహాలో తీసి పారేసారు.

హీరోయిన్లయితే ఇది సునీల్‌ సినిమా కాబట్టి, అతనే హీరో కాబట్టి, తన వెంట పడడం తప్ప 'వేరే ఆప్షన్‌ ఏముంటుందిక' అన్నట్టు కారణాల్లేకుండా అతడిని గాఢంగా ప్రేమించేస్తుంటారు. విలన్‌ని చూపించిన ప్రతిసారీ అతనో భయంకరుడు అనే గుబులు పుట్టించడానికి తెగ సీన్లు రాసుకున్నారు. పునీత్‌ ఇస్సార్‌ తన వంతు చెయ్యేసి భయం పుట్టించడానికి ఓవరాక్షన్‌ చేసుకుంటూ పోయాడు. విలన్‌ని ఎంత భయంకరంగా చూపించినా చివరకి హీరో చేతుల్లో తన్నులు తినాల్సిందే అన్నప్పుడు ఈ బిల్డప్పులన్నీ ఒక కామెడీ సినిమాలో దేనికంటారు, టైమ్‌ దండక్కి కాకపోతే!

ఇంతకీ అసలు కథ ఏంటంటే, ఉద్యోగం కోసం హైదరాబాద్‌కి వచ్చిన బంగార్రాజు (సునీల్‌) ఒక కుటుంబానికి దగ్గరవుతాడు. మరోవైపు బెట్టింగ్‌ మాఫియా నడిపే మహాదేవ్‌ (పునీత్‌ ఇస్సార్‌) ఇంట్లో ఒక చోరీ జరుగుతుంది. ఆ చోరీ చేసిన వ్యక్తి అచ్చంగా బంగార్రాజులానే ఉండడంతో వాళ్లు అతని వెంట పడతారు. తనని ఆదరించిన కుటుంబం తన వల్ల కష్టాల్లో పడడంతో ఎలాగైనా ఈ సమస్యని చేధించే పనిలో పడతాడు బంగార్రాజు. 

సస్పెన్స్‌ మిళితమైన కథాంశానికి కామెడీ జోడించే ప్రయత్నం చేసినట్టయితే ఒక సక్రమమైన వినోదాత్మక చిత్రంగా ఇది రూపు దిద్దుకుని ఉండేదేమో. కానీ రొమాన్స్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌ అంటూ అన్నిటినీ కలిపేసి కమర్షియల్‌ కాక్‌టెయిల్‌ తయారు చేద్దామని చూస్తే, ఆ మిశ్రమం వికటించి గోల్డ్‌ అవుతుందనుకున్నది కాస్తా గోలగా తయారైంది. కామెడీ పేరుతో చేసిన చాలా ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అంతు లేకుండా సాగే ప్రాస డైలాగులు సహనాన్ని పరీక్షిస్తాయి. 

ఒక దశలో సునీల్‌ దీనికంటే ముందు చేసిన సినిమాలే బెటర్‌ కదా అనుకునేలా చేస్తుంది. బహుశా సునీల్‌ మిషన్‌ కూడా తన గత చిత్రం బాగుందని మనచేతే అనిపించడానికి ఒక్కో సినిమాకీ ఇంకాస్త విసిగిస్తున్నాడేమో అని కూడా అనుమానమొస్తుంది. సెన్సిబుల్‌ కామెడీ తీసే వీరు పోట్ల నుంచి ఇలాంటి నాన్సెన్సికల్‌ కామెడీ రావడమే చిత్రంగా తోస్తుంది. ప్లాట్‌ మంచిదే ఎంచుకున్నా కానీ స్క్రీన్‌ప్లేని అడ్డదిడ్డంగా రాసుకోవడంతో 'ఈడు గోల్డ్‌ ఎహే' ఎందుకూ కొరగాకుండా పోయింది. 

తను చేసే పాత్రల బ్యాక్‌గ్రౌండ్‌కి, వాటి తాలూకు స్థితిగతులకి సంబంధం లేకుండా ప్రతి చిత్రంలోను బ్రాండెడ్‌, డిజైనర్‌ బట్టలు వేసుకునే పద్ధతి సునీల్‌ ఇందులోను మానుకోలేదు. కామెడీతో టచ్‌ పోవడం వలనో ఏమో ఈసారి కామెడీ సీన్లలోను చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించాడు. నవ్వించడానికి అతను షకలక శంకర్‌, పృధ్వీల సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన కమెడియన్‌ ఇప్పుడు నవ్వించడానికే తంటాలు పడుతున్నాడన్నమాట. హీరోయిన్లు ఇద్దరూ 'సేవ్‌ క్లాత్‌… సేవ్‌ ఎన్విరాన్‌మెంట్‌' తరహా సిద్ధాంతమేదో పాటిస్తున్నట్టు సినిమా అంతటా పొదుపైన బట్టల్లో పాపం 'ఒళ్లు దాచుకోకుండా' పని చేసారు. 

మణిశర్మ తనయుడు సాగర్‌ మహతి చేసిన పాటల్లో ఒక్కటీ వినసొంపుగా లేదు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చేయడంలో మణిశర్మ కింగ్‌ అయితే, ఇతనికి కనీసం అందులో ఓనమాలైనా వచ్చా అనే అనుమానం వచ్చేలా దారుణమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చాడు. బడ్జెట్‌లో తీసినందువల్ల సినిమా అంతటా లో క్వాలిటీ తాండవిస్తుంది. ఒక బి గ్రేడ్‌ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. షార్ట్‌ ఫిలింస్‌కి కూడా క్వాలిటీ విజువల్స్‌ ఉండాలని తపిస్తోన్న రోజుల్లో ఇంతమంది పేరున్న ఆర్టిస్టులతో తీసిన సినిమాలో ఇలాంటి ప్రొడక్షన్‌ వేల్యూస్‌ ఏమిటో మరి. ఒక దానితో కాకపోతే మరొకదానితో 'మర్యాద రామన్న' ఇస్తాడని మనం ఎదురు చూస్తుంటే, సునీల్‌ ఏమో అంతకంతకీ నాసి రకం సినిమాలు చేస్తూ మర్యాద కోల్పోతున్నాడు. 

బాటమ్‌ లైన్‌: ఈ గోలేంటెహే!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri