ఈ పోటీ ఎవరికి ప్రయోజనం?

మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది. ఒకేసారి ఎక్కువ సినిమాలు విడుదలయితే ఓపెనింగ్స్ తగ్గిపోతాయి. ఈవారం ఒకటి రెండు కాదు అయిదు సినిమాలు విడుదలయ్యాయి. అందునా ఒక్క శుక్రవారం నాడే నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.…

మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది. ఒకేసారి ఎక్కువ సినిమాలు విడుదలయితే ఓపెనింగ్స్ తగ్గిపోతాయి. ఈవారం ఒకటి రెండు కాదు అయిదు సినిమాలు విడుదలయ్యాయి. అందునా ఒక్క శుక్రవారం నాడే నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ప్రకాష్ రాజ్ మన ఊరి రామాయణం సినిమాను పక్కన పెడితే మిగిలిన మూడు సినిమాలు ఇంతో అంతో బజ్ వున్నవే. వీటిలో ప్రేమమ్ కు బజ్ మరీ ఎక్కువ. ఆ తరువాత సునీల్ గోల్డ్. 

నైజాంలో ప్రేమమ్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. మల్టీ ఫ్లెక్స్ లు, అర్బన్ ఏరియా  హైదరాబాద్ వుండడంతో ప్రేమమ్ కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆంధ్రలో కూడా ప్రేమమ్ నే బెటర్ అనిపించుకుంది.   నైజాంలో గోల్డ్  డల్ అయింది. ఆంధ్ర, సీడెడ్ లో మాత్రం గోల్డ్ కాస్త ఓపెనింగ్స్  దక్కించుకుంది. కానీ ఇక్కడా ఫస్ట్ చాయిస్ ప్రేమమ్ నే వుంది.

ఇలా ఈ రెండు సినిమాలు ఓపెనింగ్స్ ను పంచేసుకోవడంతో అభినేత్రి పూర్తిగా వెనుకబడింది అని టాక్. మన ఊరి రామాయణం రెండు చోట్లా కలిపి వంద థియేటర్ల వరకు సంఫాదించగలిగినా, పెద్దగా ఫలితం లేకపోయింది. ఇక జాగ్వార్ మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది కానీ, రెండో రోజు ఈ సినిమాల తాకిడి వల్ల తగ్గింది.

ఇదే కనుక ఈవారం రెండు, తరువాత రెండు విడుదలయి వుంటే అన్నీ సేఫ్ ప్రాజెక్టులుగా మిగిలి వుండేవి. ఎందుకంటే మన ఊరి రామాయణం సినిమాను పక్కన పెడితే, మిగిలినవన్నీ పది నుంచి పాతిక కోట్ల మధ్య బడ్జెట్ తో రెడీ అయినవి. ఇలాంటి పోటీ వల్ల బయ్యర్లు ఇబ్బంది పడే ప్రమాదం వుంది.