దేశవ్యాప్తంగా 'అవినీతి'పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులది ఒకటే మాట, 'పెద్ద పెద్ద పచ్చనోట్లు'.. అదేనండీ వెయ్యి రూపాయలు, ఐదొందల రూపాయల నోట్లను నిషేధించాలని. లక్ష రూపాయలు తీసుకెళ్ళాలంటే, వెయ్యిరూపాయల నోట్ల కట్ట ఒకటి జేబులో పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు. ఇదే, అవినీతికి మూల కారణం.. అన్నట్లుగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు. కొంతవరకు అవినీతి ఇది కూడా కారణం కావొచ్చుగానీ, పూర్తిగా ఇదే కారణమని చెబితే ఎలా.?
పైగా, అందుగలడిందులేడని సందేహమువలదు.. అన్న చందాన తయారయ్యింది అవినీతి. ఒక్కమాటలో చెప్పాలంటే, అవినీతి పాదరసంలా మారిపోయింది. ఏ క్షణాన ఎలా మారిపోయి, ఎలా మాయమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. అంతలా అవినీతిని సర్వాంతర్యామిలా మార్చేశారు రాజకీయ నాయకులు. చాలావరకు అవినీతి కేసులు, చోటా మోటా ఉద్యోగులపైనే నమోదవుతుంటాయి. చాలా కేసుల్లో ఉద్యోగులు, తమ ఉద్యోగాల్ని పోగొట్టుకోవాల్సి వస్తోంది కూడా.
కానీ, రాజకీయ నాయకులపై నమోదయ్యే అవినీతి కేసుల మాటేమిటి.? అవినీతి కేసులో ఇరుక్కుంటే, ఆ ఉద్యోగి బతుకు ఛిద్రమైపోతుంది. అదే, రాజకీయ నాయకుడు అవినీతి కేసులో ఇరుక్కుంటే, పాపులారిటీ పెరుగుతుంది. దేశవ్యాప్తంగా అవినీతిపరులైన రాజకీయ నాయకుల లెక్క తీయడం కన్నా, అవినీతికి దూరంగా వున్న నేతల లెక్కలు తీయడం చాలా తేలిక. అవినీతికి పాల్పడని రాజకీయ నాయకులను వేళ్ళమీద లెక్కపెట్టేయొచ్చు.
వందల కోట్లు, వేల కోట్ల అవినీతి ఈ వెయ్యి రూపాయల నోట్లు, ఐదొందల రూపాయల నోట్లతో జరగదన్నది జగమెరిగిన సత్యం. 'నీకిది.. నాకది..' బాగోతాలే అవినీతి వ్యవహారాల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఏడాదిలో, దేశవ్యాప్తంగా సాధారణ ఉద్యోగులు అవినీతికి పాల్పడటం ద్వారా చెలామణీ అయ్యే సొమ్ము.. ఒక్క రోజులో జరిగే ఒక్క రాజకీయ కుంభకోణం కన్నా తక్కువేనని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
టూజీ స్పెక్ట్రమ్ కుంభకోణం, కోల్ గేట్ స్కామ్.. ఇవేవీ నోట్ల కట్టలతో జరిగిన కుంభకోణాలు కావు. దేశాన్ని టెక్నాలజీతో పరుగులు పెట్టేస్తామని చెబుతుంటారుగానీ, అవినీతిని రూపుమాపే విషయంలో మాత్రం, రాజకీయ నాయకుల ఆలోచనలు, ఇదిగో.. పచ్చ నోట్ల చుట్టూ.. ఇంత సిల్లీగా తిరుగుతోంటే, నవ్వు రాకుండా వుంటుందా.?