ఉత్తర ప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై అఖిలేశ్‌కు, పార్టీలో యితర నాయకులకు ఘర్షణ వుందన్న సంగతి అందరికీ తెలుసు. తమ పార్టీ నేరపూరిత రాజకీయాలకు పేరుబడింది కాబట్టి నేరచరిత్ర వున్నవాళ్లను పక్కకు నెట్టేసి, అభివృద్ధి అనే నినాదంపై ఓట్లడుగుదామని అఖిలేశ్ వాదన. అవేమీ చెల్లవు, యిక్కడంతా కుల, మతరాజకీయాలే, నేరచరిత్ర వున్నా ఓటర్లు పట్టించుకోరు అని ములాయం, అతని సోదరుడు శివలాల్, యితర సీనియర్ల వాదన.
విభేదాలు యిటీవల రచ్చకెక్కి చివరకు రాజీ కుదుర్చుకున్నారు. అయితే పాతతరం వారు అఖిలేశ్‌కు బుద్ధిగరపడానికే నిశ్చయించుకున్నారని నిన్న తేలిపోయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో శివపాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో 14 మంది పార్టీ అభ్యర్థులను మార్చేశాడు – పార్టీ రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు చైర్మన్ అయిన అఖిలేశ్‌కు మాటమాత్రం చెప్పకుండా! మార్చివేసినవారిలో అఖిలేశ్‌కు సన్నిహితులు కొందరున్నారు. కొత్తగా టిక్కెట్లు పుచ్చుకున్న ఏడుగురిలో అమన్మణి త్రిపాఠి సంగతి చూస్తే నేరస్తుల పట్ల పార్టీ వైఖరి తేటతెల్లమౌతుంది.
యుపి కాబినెట్లో మంత్రిగా చేసిన అమర్మణి త్రిపాఠి తన భార్య మధుమతి తో కలిసి తన ప్రియురాలు కలిసి మధుమితా శుక్లాను హత్య చేసిన కేసులో జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. అతని కొడుకే యీ అమన్. ఇతను ప్లాను వేసి 2015లో తన భార్య సారాను చంపించాడన్న ఆరోపణపై సిబిఐ విచారణ ఎదుర్కుంటున్నాడు. దానికి తోడు కిడ్నాపుల కేసులు కూడా వున్నాయి. అలాటివాడికి టిక్కెట్టిచ్చి 'నేరస్తులకు మా పార్టీలో చోటుండదు' అని చెప్పుకుంటున్న అఖిలేశ్‌ను వెక్కిరించినట్లయింది.
అంతకు ముందు సెప్టెంబరు 19 న అఖిలేశ్‌కు సన్నిహితులైన 7గురు పార్టీ నాయకులను శివపాల్ పదవుల నుంచి తొలగించాడు. వారిలో యిద్దరు ఎమ్మెల్సీలు. ములాయం సింగ్ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, సమాజ్‌వాదీ యువజన్ సభ రాష్ట్ర అధిపతి, సమాజ్‌వాదీ ఛాత్ర సభ రాష్ట్ర అధిపతి తక్కినవారు. దాంతో వారు, వారి అనుయాయులు పార్టీ నుంచి రాజీనామా చేయసాగారు. పార్టీ విడిచి వెళ్లవద్దని అఖిలేశ్ వారికి నచ్చచెప్పుతున్నాడు. 'మా నాన్న సంతోషం గురించి నేనేదైనా చేస్తాను. కానీ బయటివారి జోక్యాన్ని సహించను' అన్నాడు. బయటివారంటే అమర్ సింగ్ అని అందరికీ తెలుసు. అతనూ, యుపి చీఫ్ సెక్రటరీ సింఘాల్, యితర ఉన్నతాధికారులు కలిసి రూ.12,000 కోట్ల సమాజ్‌వాదీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టును అమర్ సింగ్‌కు కావలసిన కాంట్రాక్టరుకు అప్పగిద్దామని ప్రయత్నించారని, ములాయం కుటుంబీకులను కూడా ఒప్పించారని విన్నాకనే అఖిలేశ్ మండిపడ్డాడు. అతని దగ్గర ఆడియో సాక్ష్యం కూడా వుందట. పైగా చీఫ్ సెక్రటరీ సింఘాల్ అమర్ సింగ్ పార్టీలో కూర్చుని తనను ఎగతాళి చేస్తూ జోకులు వేశాడని వినగానే అతన్ని బదిలీ చేసేశాడు. శివపాల్ నుంచి పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటుని తను తీసేసుకున్నాడు. వీటన్నిటినీ శివపాల్ విమర్శిస్తున్నాడు. 'మా అందరి కష్టంతో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న అఖిలేశ్ ఒంటెత్తు పోకడలు పోకూడదు. మా సలహాలు వినాలి.' అంటున్నాడు. దీనికి ములాయం మద్దతుంది.
2012లో శివలాల్ తన అన్నగారితో చెప్పాడట – 'నువ్వు యిప్పుడే అఖిలేశ్‌ను ముఖ్యమంత్రి చేయకు. నువ్వే ముఖ్యమంత్రిగా వుండి 2014 వరకు పాలించు. అప్పుడు జరిగే పార్లమెంటు ఎన్నికలలో నువ్వు పోటీ చేసి, ఢిల్లీకి వెళ్లి ప్రధాని అయిపో. అప్పుడు అఖిలేశ్‌ను సిఎంగా చేసినా ఫర్వాలేదు.' అని. 'అతని మాట విని వుంటే నేనీ పాటికి ప్రధానిని అయిపోయేవాణ్ని. అఖిలేశ్‌ను సిఎం చేయడం చేశాం, అతను చెప్పినవాళ్లకు టిక్కెట్లిచ్చాం. దానివలన మాకు 2014లో 5 సీట్లు మాత్రమే వచ్చాయి' అని ములాయం బహిరంగంగా బాధపడ్డాడు. 2014లో మోదీ హవా దేశమంతా వీచిందని అందరికీ తెలుసు. తను ప్రధాని అయ్యేవాణ్నని ములాయం ఎలా అనుకుంటున్నాడో అతనికే తెలియాలి. అఖిలేశ్ అమర్ సింగ్‌ను దూరం పెట్టడం, అతను ఫోను చేసినా తీయకపోవడం ములాయంకు నచ్చటం లేదు. 'కేంద్రప్రభుత్వం నాపై సిబిఐ కేసు పెట్టి జైలుకి పంపాలని చూస్తోంది. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచింది అమర్ సింగే. అతనికి మనం యిచ్చిన రాజ్యసభ సీటు చాలా చిన్నది.' అంటాడు. తన తండ్రి ఆలోచనా ధోరణితో విసిగిపోయిన అఖిలేశ్ తండ్రికి దూరంగా జరుగుతున్నాడు. అతను యిన్నాళ్లూ తన అధికారిక నివాసంలో ఆఫీసు మాత్రం పెట్టుకుని తండ్రి యింట్లోనే భార్యాబిడ్డలతో వుంటున్నాడు. ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులందరికీ బంగళాలు కేటాయించింది. తనకు కేటాయించిన భవన నిర్మాణం యింకా పూర్తి కాకపోవడంతో అఖిలేశ్ తండ్రి యింట్లోనే వున్నాడు. ఇప్పుడు ఆ యిల్లు పూర్తయింది కాబట్టి అక్కడకు వెళ్లిపోతానంటున్నాడు.
యుపిలో రాజకీయ పరిస్థితి క్లిష్టంగానే వుంది. అవినీతి, బంధుప్రీతి, నేరాల పెరుగుదల, మతఘర్షణల గురించి చర్చిస్తూనే కులాల సమీకరణ కూడా జరుగుతోంది. బ్రాహ్మణుల ఓట్ల కోసం అందరూ ప్రయత్నిస్తున్నారు. జనాభాలో 13% వున్న వీరు 20 పార్లమెంటు స్థానాల్లో కీలకమైన ఓటు బ్యాంకు. ఉత్తర యుపిలో చాలా నియోజకవర్గాలలో ఫలితాన్ని ప్రభావితం చేయగలరు. యుపిలో బ్రాహ్మణ ఓటర్లతో వున్న చిక్కేమిటంటే వాళ్లు ఏ పార్టీని అంటిపెట్టుకుని వుండరు. యాదవులైతే ఎస్పీకి, దళితులైతే బియస్పీకి వేస్తారన్న అంచనా వుంటుంది. చాలా ఏళ్ల పాటు బ్రాహ్మణులు, రాజపుత్రులతో బాటు కాంగ్రెసుకే ఓటేసేవారు. ప్రతి కాబినెట్లో 8 నుంచి 10 మంది దాకా బ్రాహ్మణ మంత్రులుండేవారు. కొంతకాలానికి బిసి ఓట్ల కోసం కాంగ్రెసు వీరి ప్రాధాన్యత తగ్గించి, వారికి టిక్కెట్లిచ్చింది. అయినా బిసిలు ఎస్పీ వైపే మొగ్గారు. 2012 ఎన్నికలలో బ్రాహ్మణ అభ్యర్థులకు బిజెపి 80, బియస్పీ 74 టిక్కెట్లివ్వగా ఎస్పీ 45 యివ్వగా, కాంగ్రెసు 43తో సరిపెట్టింది. కాంగ్రెసు తమని నిర్లక్ష్యం చేస్తోందని బ్రాహ్మణులు అనుకుని దూరమయ్యారు. ప్రతి ఎన్నికకూ పార్టీని మార్చేస్తున్నారు కాబట్టి యీసారి వారిని ఆకట్టుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నించి చూస్తున్నాయి. వారి జనాభా 20% వున్న ప్రాంతాల్లో అన్ని పార్టీలు బ్రాహ్మణ సమ్మేళనాలు పెడుతున్నారు.
సతీశ్ మిశ్రా అనే బ్రాహ్మణ రాజకీయవేత్త సలహాతో బ్రాహ్మణ ఓట్ల విలువను మాయావతి 2007లో గుర్తించింది. అప్పటిదాకా ''తిలక్, తరాజూ, ఔర్ తల్వార్ (బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియు చిహ్నాలైన తిలకం, త్రాసు, కత్తి) – ఇన్కో మారో జూతే చార్ (వీళ్లను చెప్పులతో నాలుగు దెబ్బలు కొట్టు – చెప్పులు అనడంలో దళిత చిహ్నం గోచరిస్తుంది)'' అనే నినాదంతో పైకి వచ్చిన బియస్పీ హఠాత్తుగా బ్రాహ్మణులతో పొత్తు పెట్టుకుని 89 స్థానాలు వాళ్లకు కేటాయించింది. కానీ 206 సీట్లతో గెలిచాక వాళ్లను నిర్లక్ష్యం చేసింది. తమపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు అన్యాయంగా బనాయించిందని వారు ఫిర్యాదు చేశారు. తమను మోసం చేసిందన్న భావనతో వున్న బ్రాహ్మణులకు 2012లో 74 స్థానాలిచ్చింది. 19% బ్రాహ్మణులు మాత్రమే ఓటేశారు. ఇతర కారణాలు కూడా కలిసి, బియస్పీకి మొత్తం 80 సీట్లు మాత్రమే వచ్చాయి. దళిత, బ్రాహ్మణ, ముస్లింల (డిబిఎం) జనాభా కలిపితే 49% కాబట్టి 2014 పార్లమెంటు ఎన్నికలలో వాళ్ల ఓట్లు పడితే చాలు గెలవవచ్చని ఆశిస్తూ దళితుల కంటె ఎక్కువగా బ్రాహ్మణులకు 21, ముస్లిములకు 17 సీట్లు యిచ్చింది. అయినా మోదీ హవాలో అన్ని లెక్కలూ కొట్టుకుపోయాయి. 2017 ఎన్నికలలో కూడా ''బ్రాహ్మణ్ శంఖ్ బజాయేగా, హాథీ బఢ్తా జాయేగా'' (బ్రాహ్మణుడు శంఖం పూరిస్తాడు, ఏనుగు (బియస్పీ ఎన్నికల గుర్తు) ముందుకుముందుకు సాగుతుంది) అనే నినాదం అందుకుంది. బ్రాహ్మణ్ భాయిచారా (సోదరత్వ) సమితి అని పెట్టి సమావేశాలు నిర్వహించి యీసారి 80 సీట్లిస్తానని చెప్త్తోంది.
ఇంతలో బియస్పీకి చెందిన బ్రజేశ్ పాఠక్ అనే బ్రాహ్మణ నాయకుణ్ని బిజెపి లాక్కుంది. దాంతో ఉలిక్కిపడిన మాయావతి బియస్పీ దళిత నాయకుడు సంజయ్ భారతి జూన్‌లో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్టింగులు పెడితే అతన్ని పార్టీలోంచి తీసేసింది. సతీశ్ మిశ్రాకు మూడోసారి రాజ్యసభ సభ్యుడిగా చేసింది. ప్రస్తుతం డిబిఎం ఫార్ములానే మాయావతి నమ్ముకుంది. మాయావతి దళితుల్లో 55% వున్న జాతవ్ కులానికి చెందినది. 2014 పార్లమెంటు ఎన్నికలలో వారు తప్ప తక్కిన దళితులు మోదీకి ఓటేశారు. అందువలన 19.6% ఓట్లు వచ్చినా ఒక్క సీటు కూడా రాలేదు. ఇప్పుడు మోదీ అభ్యర్థి కాదు కాబట్టి మాయావతి ఆశలు పెట్టుకుంటోంది. బిజెపి విషయానికి వస్తే అది బియస్పీతో కలిసి 1995, 1997, 2002-03ల్లో కలిసి పోటీ చేసింది. ప్రతీసారి బియస్పీయే లాభపడింది. బియస్పీ ఎదిగిన కొద్దీ బిజెపి మరింత దిగాలు పడింది. 1996లో 174 అసెంబ్లీ సీట్లున్న ఆ పార్టీ 2002 నాటికి 88 తెచ్చుకుంది. 2007లో బిస్పీ అధికారంలోకి వచ్చినపుడు 51 సీట్లు మాత్రమే తెచ్చుకుంది. పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే 1996లో 52 వుంటే, 2004కి 10 వచ్చాయి. 2009కి మరీ దిగజారింది. కానీ 2014 వచ్చేసరికి మోదీ ప్రభంజనంతో 42% ఓట్లతో 71 సీట్లు గెలిచింది. ఇప్పుడు ఆ వూపు తగ్గినా జాతవేతర దళితులను ఆకర్షించడానికి బిజెపి యత్నిస్తోంది.
కాంగ్రెసు నిర్లక్ష్యం చేశాక బిజెపి బ్రాహ్మణులను అక్కున చేర్చుకుంది. గత ఎన్నికలలో బ్రాహ్మణులకు 80 సీట్లు యిచ్చి వారి ఓట్లలో 38% (2007లో కంటె 6% తక్కువ) గెలుచుకుంది. ఈ మధ్య దాకా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా వున్న లక్ష్మీకాంత్ బాజపాయ్ బ్రాహ్మణుడే. అయితే ఏప్రిల్ నెలలోనే కేశవ్ ప్రసాద్ మౌర్యా అనే బిసి నాయకుణ్ని అధ్యక్షుడిగా చేశారు. ఇటీవలి కాలంలో బిజెపి దళితులలో కొన్ని వర్గాలను, (మోదీ బిసి అనే అంశాన్ని గుర్తు చేస్తూ) బిసిలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ క్రమంలో తమను కొంచెం వెనక్కిపెడుతోందని బ్రాహ్మణుల అనుమానం. ఆ అనుమాన్ని ఎన్‌క్యాష్ చేసుకోవాలని కాంగ్రెసు యత్నం. అందుకే బ్రాహ్మణుల యింటి కోడలైన షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. స్వయంగా బ్రాహ్మణుడైన కాంగ్రెసు ఎన్నికల సలహాదారు ప్రశాంత కిశోర్ (అతన్ని పికె అని పిలుస్తున్నారు) యుపి ఫలితాలను పూర్తిగా శాస్త్రీయ అధ్యయనం చేసి బ్రాహ్మణులను వెనక్కి తెచ్చుకుంటే కాంగ్రెసుకు ఓ మాదిరిగానైనా సీట్లు వస్తాయని తేల్చాడు. 2009 పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెసుకు బ్రాహ్మణులు ఓటేసినపుడు 80లో 21 సీట్లు వచ్చాయి. 2014 వచ్చేసరికి వాళ్లు బిజెపివైపు పూర్తిగా తిరిగిపోవడంతో కాంగ్రెసుకు రెండు సీట్లే దక్కాయి. అందుకే యీ సారి అసెంబ్లీ ఎన్నికలలో అందరి కంటె ఎక్కువగా కనీసం 100-125 సీట్లు బ్రాహ్మణులకు యివ్వాలని ప్రతిపాదిస్తున్నాడు. అంతేకాదు, రాహుల్ రోడ్ షో మొదటి విడత దేవరియా, గోరఖ్‌పూర్, గాజీపూర్, ఆజమ్గఢ్ వంటి తూర్పు యుపి ప్రాంతాలలో సాగేట్లు ప్లాను చేశాడు. అంతేకాదు, 26 ఏళ్లగా నెహ్రూ వంశీకులు వెళ్లడం మానేసిన అయోధ్యకు పంపాడు. అయోధ్య, వారణాశి, అలహాబాద్ బ్రాహ్మణులకు కంచుకోటలు.
ప్రశాంత్ కిశోర్ ప్లానింగ్‌తో బాటు పార్టీ నిర్మాణాన్ని కూడా పర్యవేక్షిస్తున్నాడు. సీనియర్ నాయకులకు కూడా పాఠాలు నేర్పుతున్నాడు. లఖ్‌నవ్‌లో రాహుల్ గాంధీ కార్యక్రమం ఏర్పాటు చేసినపుడు ప్రతి అసెంబ్లీ సెగ్గెంటు నుంచి 15 మంది చొప్పున రావాలని శాసించి అమలు చేశాడు. గతంలో అయితే కొందరు లీడర్లు తమ అనుయాయులతో సభాస్థలిని నింపేసేవారు. ప్రశాంత్ ముఖ్యంగా గ్రామీణ ఓటర్లపై దృష్టి పెట్టాడు. మన దగ్గర లాగానే ఋణమాఫీ ఆఫర్ చేస్తున్నాడు. 'కర్జ్ మాఫ్, బిజిలీ బిల్ హాఫ్, సమర్థన్ మూల్యా కా కరో హిసాబ్' (అప్పులు మాఫీ, కరంటు బిల్లు సగానికి సగం మాఫీ, మద్దతు ధర పెంచుతాం) అని కాంగ్రెసు నినాదం. తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి వేలాది కిసాన్ మాంగ్ (డిమాండ్) పత్రాలు వూరూరా పంచుతున్నారు. ఆ పత్రాల్లో రైతులు తమ పేరు, విలాసం, టెలిఫోన్ నెంబరు, బ్యాంకులకు బాకీ పడిన అప్పు వివరాలు రాసి యివ్వాలి. తక్కిన మాట ఎలా వున్నా ఓటర్ల ఫోన్ నెంబర్లు పార్టీ చేతికి చిక్కినట్లే. ఎన్నికల టైములో ప్రచారమంతా సెల్ఫోన్ల ద్వారా చేసుకోవడానికి అనువుగా వుంటుంది. గతంలో అయితే యివి పార్టీ ఆఫీసుల్లో పడి వుండడమో, పార్టీ బలంగా వున్న చోట పంచడమో జరిగేది. కానీ ప్రశాంత్ కిశోర్ సోనియా గాంధీ బొమ్మ స్టిక్కర్ అంటించిన యీ పత్రాలను 901 బ్లాకుల్లో యింటియింటికీ చేరేట్లు చేయగలిగాడట. ప్రతీ ఎన్నికల బూతు నుంచి అయిదుగురు వాలంటీర్లను ఎంపిక చేసి, విజయావకాశాలున్న అభ్యర్థుల పేర్లు చెప్పమంటున్నాడు.రాహుల్ చేత కిసాన్ యాత్ర చేయించినప్పుడు రాహుల్ తమ యుపిఏ హయాంలో రైతులకు ఏమేమి చేసిందో ఏకరువు పెట్టి, ప్రస్తుత దుర్భర పరిస్థితిని ఎత్తి చూపించాడు.
''నిజానికి ప్రశాంత్ చేస్తున్న పనులు అసాధ్యమైనవేమీ కావు. మేమే చేసి వుండవచ్చు. కానీ ఒకరితో మరొకరం కొట్టుకు ఛస్తూ ఏమీ చేయడం మానేశాం. అందువలననే బయటి వ్యక్తి వచ్చి చెప్పవలసి వస్తోంది. బిజెపి విషయంలో అమిత్ షా వచ్చి అందరిలో కదలిక తెచ్చాడు. ప్రశాంత్ పడుతున్న కష్టం వలన 2017 కల్లా ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో చెప్పలేం. 2012లో వచ్చిన 28 సీట్ల కంటె ఎక్కువైతే కచ్చితంగా వస్తాయి. అయితే పార్టీ వ్యవస్థ బాగుపడి, 2019 పార్లమెంటు ఎన్నికల నాటికి పోరాడే స్థితికి వస్తాం.'' అన్నాడు ఓ కాంగ్రెసు నాయకుడు.
ఇలా అన్ని పార్టీలు తమతమ బలాల్ని పెంచుకోవడానికి చూస్తూ ఉమ్మడి శత్రువైన ఎస్పీని ఎండగడుతున్నాయి. గత ఎన్నికల్లో 19% బ్రాహ్మణ ఓట్లు పడడంతో, బిసిల ఓట్లు కూడా కలవడంతో ఎస్పీ తరఫున నిలబడిన 45 మంది బ్రాహ్మణుల్లో 21 మంది గెలిచారు. తమ గెలుపుకు కారణమని గ్రహించిన ముఖ్యమంత్రి అఖిలేశ్ నాలుగేళ్లగా చాలా బ్రాహ్మణ సమావేశాలు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. బ్రాహ్మణశక్తిని చాటిన పరశురాముడి జయంతిని యీ ఏడాది నుంచి పబ్లిక్ హాలిడేగా ప్రకటించాడు. బ్రాహ్మణులపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు విత్‌డ్రా చేస్తానంటున్నాడు. ఇలాటి సమయంలో ములాయం తన పార్టీ ప్రతిష్ఠ తనే తీసుకుంటున్నాడని చెప్పాలి. ప్రజాపతి అనే మంత్రిని అతను వెనకేసుకుని రావడంతోనే అవినీతిపరుల పట్ల ఎస్పీ ఎంత వుదారంగా చాటి చెప్పినట్లయింది.
ఒబిసి వర్గానికి చెందిన గాయత్రీ ప్రసాద్ ప్రజాపతి బహుజన్ క్రాంతి దళ్ అనే పార్టీ అభ్యర్థిగా 1993లో పోటీ చేస్తే 1526 ఓట్లు వచ్చాయి. తర్వాత ఎస్పీలో చేరి 1996లో, 2002లో పోటీ చేసినా ఘోరంగా ఓడిపోయాడు. 2007లో అతనికి టిక్కెట్టు యివ్వలేదు. ఆ తర్వాత అడ్డమార్గాల్లో బాగా సంపాదించి 2012 వచ్చేసరికి అమేఠీలో టిక్కెట్టు సంపాదించాడు. తన కాంగ్రెసు ప్రత్యర్థి సంజయ్ సింగ్ భార్య అమితా సింగ్‌పై డబ్బు విరజిమ్మి గెలిచాడంటారు. గెలవగానే శివపాల్ వద్ద యిరిగేషన్ శాఖలో సహాయమంత్రిగా చేరాడు. తర్వాత తన రియల్ ఎస్టేటు బిజినెస్‌లో భాగస్వామి ఐన ములాయం రెండో భార్య కొడుకు ప్రతీక్ యాదవ్ సిఫార్సుతో మైనింగ్ శాఖకు మంత్రి అయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు కాబినెట్ హోదా దక్కించుకున్నాడు. అతనిపై ఎంతోమంది కేసులు పెట్టారు. కానీ అతను వాళ్లను బెదిరించి విత్‌డ్రా చేయించాడట. అమితాబ్ ఠాకూర్ అనే ఐపియస్ అధికారి, సామాజిక కార్యకర్త ఐన అతని భార్య నూతన్లు యితనిపై కేసు పెడితే సాక్షాత్తూ ములాయమే ఫోన్ చేసి బెదిరించాడట. ఆ విషయం వాళ్లే బయటకు చెప్పారు. తన ఆస్తి కాజేశాడని అమేఠీలో ఒక వితంతువు 2014లో ప్రజాపతికి వ్యతిరేకంగా లఖ్‌నవ్‌లో ధర్నా చేసింది. అతనిపై లోకాయుక్త దర్యాప్తు నడుస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ విచారణకు హైకోర్టు అనుమతి యిచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో అఖిలేశ్ అతన్ని తీసేస్తే ములాయం పట్టుబట్టి అతన్ని వెనక్కి రప్పించాడు. శాఖ మార్చారంతే. ఇప్పుడు ప్రభుత్వం తరఫున హైకోర్టు తీర్పును సవాలు చేస్తున్నారు. పార్టీ యిమేజి మారుద్దామని చూస్తున్న అఖిలేశ్ నోరు మూయించి యివన్నీ జరిపిస్తున్న ఎస్పీకి ప్రజలు బుద్ధి చెప్తారో లేదో ఎన్నికల తీర్పే చెపుతుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2016)