జనరల్ పీటర్ కాస్గ్రోవ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా గవర్నరు జనరల్. 2000 నుండి 2002 వరకు ఆస్ట్రేలియన్ ఆర్మీకు చీఫ్‌గా వుండి, 2002 నుంచి 2005 వరకు డిఫెన్స్ ఫోర్స్‌కు చీఫ్‌గా వున్నారు. జనరల్ హోదాకు ఎదిగారు. ఆయన జనరల్‌గా వుండగా తన మిలటరీ హెడ్‌క్వార్టర్సుకి ఒక బాయ్ స్కౌట్ ట్రూపు వచ్చి కొన్నాళ్లు తర్ఫీదు పొందడానికి అనుమతించారు. అలా అనుమతించడాన్ని పొరపాటుగా చిత్రీకరించదలచింది ఎబిసి రేడియోకు చెందిన ఒక మహిళా జర్నలిస్టు. ఒక లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో ఆమె మైకు తీసుకుని జనరల్‌ను ఇంటర్వ్యూ చేయసాగింది.
''జనరల్, మీరు ఆ స్కౌటు కుర్రవాళ్లకు ఏం నేర్పబోతున్నారు?'' అని అడిగిందామె.
''కొండలెక్కడం, విలువిద్య, తుపాకీతో పేల్చడం వగైరా నేర్పిస్తాం.'' సమాధానమిచ్చాడు జనరల్.
''తక్కినవాటి మాట సరే కానీ తుపాకీని ఎలా పేల్చాలో నేర్పించడం బాధ్యతారాహిత్యం కాదంటారా?''
''అలా ఎందునుకుంటారు? మా సిబ్బంది పక్కనే వుంటాం. బాధ్యతతో వ్యవహరిస్తాం.'' అన్నాడు జనరల్ అమాయకంగా.
''అది కాదు, తుపాకీ వాడడమంటే ప్రమాదకరమైన పని కదా.''
''దాని గురించి భయపడవద్దు. తుపాకీ ముట్టుకునేముందు ఎలాటి క్రమశిక్షణతో వుండాలో పూర్తిగా నేర్పిస్తాం. ఎవరికీ ఏ అపాయం రాకుండా చూసుకుంటాం.'' ఓపిగ్గా చెప్పాడు జనరల్.
కానీ జనరల్‌ను యిరకాటంలో పెట్టడమే జర్నలిస్టు లక్ష్యం. ''వాళ్లకు ప్రస్తుతానికి ఏమవుతుందా అని కాదు, ఇవాళ మీరు నేర్పించిన యీ విద్యతో రాబోయే రోజుల్లో వాళ్లు ఎలా మారతారా అని నా భయం. ప్రమాదకరమైన హంతకులుగా మారే సాధనసంపత్తి వాళ్లకు మీరు సమకూరుస్తున్నారన్న మాట మీరు కాదనగలరా?'' అంటూ గొంతు పెంచింది.
జనరల్‌కి ఆమె ఉద్దేశం అర్థమైంది. ''చూడండి మేడమ్, ఒక వేశ్య కావడానికి తగిన సాధనసంపత్తి మీ దగ్గర వుంది. కానీ అలా మీరు అలా కాలేదు.. కదూ!?'' అన్నాడు.
దీనికి ఎలా బదులివ్వాలో తెలియక ఆ జర్నలిస్టు అవాక్కయిపోయిందని, యింటర్వ్యూలో 46 సెకన్ల విరామం వచ్చిందని కొందరంటారు. అబ్బే, యిదంతా కట్టుకథ, యిలా ఏమీ జరగలేదని మరి కొందరంటారు.
-ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2016)