నలుగురు కలిసి ఏది అంటే అది రైటయిపోయే రోజులు ఇవి. ప్రస్తుతం వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్త వైనం ఇలాగే వుంది. మలయాళంలో పెద్ద హిట్ అయిన ఒప్పం సినిమాను తెలుగులో నాగ్ చేస్తాడన్నది ఆ వార్త. ఒప్పం సినిమాలో మోహన్ లాల్ హీరో. సినిమా అంతా అంథుడిగానే కనిపిస్తాడు. మలయాళంలో థ్రిల్లర్లకు తయారుచేసే క్రిస్ప్ అండ్ టైట్ స్క్రీన్ ప్లేలు భలేగా వుంటాయి. అందుకే అక్కడ అవి సూపర్ హిట్ అయిపోతాయి.
ఇక ఒప్పం సంగతికి వస్తే, ఈ సినిమాను మొదటి నుంచీ నాగ్ క్లోజ్ గా ఫాలో అవుతున్న మాట వాస్తవం. నిర్మాత పివిపి కి అవసరం అయితే ఆ సినిమా రైట్స్ కూడా తీసుకోమని చెప్పిన మాట కూడా వాస్తవం. అయితే పూర్తి సినిమా వచ్చిన తరువాత, అది మలయాళంలో పెద్ద హిట్ అయిన తరువాత కూడా తెలుగులో తనను ఆ పాత్రలో జనం ఏక్సెప్ట్ చేస్తారా? మన నేటివిటీకి, మన ప్రేక్షకులకు ఆ సినిమా సరిపోతుందా? అని నాగ్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దాంతో పివిపి మరి ఆ సినిమాను వదిలేసారు.
ఇప్పుడు మోహన్ లాల్ తో కలిసి వేరే వాళ్లు ఆ సినిమాను కొన్నారు. సహజంగా ఇలాంటి ప్రయోగాలకు ఇష్టపడే సీనియర్ హీరోలు ఇద్దరే. ఒకరు నాగ్, రెండవది వెంకీ. వెంకీ ప్రస్తుతం మూడు సినిమాలు లైన్లో పెట్టుకుని బిజీగా వున్నారు. నాగ్ ఒకే సినిమా మీద వున్నారు. అది కూడా ఫినిష్ కావస్తోంది.
సో అందువల్ల నాగ్ అయితే బాగుంటుదన్నది రైట్స్ కొనుక్కున్న వారి ఆలోచన కావచ్చు. కానీ ఈలోగానే నాగ్ చేస్తున్నాడు..నాగ్ చేస్తున్నాడు..అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. వాస్తవానికి ఈ విషయమై నాగ్ ఏ నిర్ణయం తీసుకోలేదు. అసలు దాని మీద దృష్టి పెట్టలేదు అని తెలుస్తోంది.
కానీ మొత్తానికి ఈ వార్తలన్నీ కలిసి నాగ్ ను ఆలోచనలో పడేసి ఒప్పించేస్తాయేమో?