Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: హైపర్‌

రివ్యూ: హైపర్‌
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
తారాగణం: రామ్‌, రాశి ఖన్నా, సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళి శర్మ, సుమన్‌, జయప్రకాష్‌రెడ్డి, ప్రభాస్‌ శ్రీను, తులసి, పోసాని కృష్ణమురళి, ప్రియ తదితరులు
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: జిబ్రాన్‌
కూర్పు: గౌతరరాజు
ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీనాథ్‌ ఆచంట, అనిల్‌ సుంకర
కథ, కథనం, దర్శకత్వం: సంతోష్‌ శ్రీనివాస్‌
విడుదల తేదీ: సెప్టెంబరు 30, 2016

'నేను శైలజ'లో పక్కింటి కుర్రాడి తరహా లవబుల్‌ క్యారెక్టర్‌లో కనిపించిన రామ్‌ 'హైపర్‌'లో యాక్షన్‌ హీరో అవతారమెత్తాడు. 'కందిరీగ'తో బాగా నవ్వించిన సంతోష్‌ శ్రీనివాస్‌ రెండో సినిమాతో 'రభస' చేశాడు. ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే తపనతోనో ఏమో తనలోని 'హైపర్‌' అంతా ఈ సినిమాలో చూపించాడు. వినాయక్‌, బోయపాటి శ్రీను, తమిళ దర్శకుడు హరి తదితర మాస్‌ దర్శకులంతా 'పూనకం' మోడ్‌లో ఉండి సినిమా తీస్తే ఎలాగుంటుందో ఇందులో సంతోష్‌ శ్రీనివాస్‌ శైలి అలా అనిపిస్తుంది. టైటిల్‌కి తగ్గట్టే అన్నీ ఓవర్‌గా ఉండాలని అనుకున్నాడో, లేక ఇంత ఓవర్‌ చేస్తే తప్ప టార్గెట్‌ ఆడియన్స్‌ కనక్ట్‌ అవరని అభిప్రాయపడ్డాడో కానీ రామ్‌, రావు రమేష్‌లాంటి యాక్టర్లు కూడా ఒక్కో సందర్భంలో ఓవర్‌ ది టాప్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఊగిపోయారు. 

సినిమా మొదలైన తీరు సరదాగానే ఉన్నా, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు సాదాసీదాగా ఉన్నప్పటికీ అన్నీ నేల మీదే సాము చేస్తాయి కనుక ప్రథమార్ధం వరకు పెద్దగా కంప్లయింట్‌ చేయడానికి ఏమీ ఉండదు. ఇంటర్వెల్‌ సీన్‌లో ఒక్కసారిగా రామ్‌తో 'సింహాద్రి'లో ఎన్టీఆర్‌ మాదిరిగా శివాలెత్తించారు. టూమచ్‌ అనిపించే డైలాగులు, అవసరానికి మించిన ఎమోషన్లు 'ప ప ప పాప్‌కార్న్‌ బ్రేక్‌' తీసుకోవాల్సిందే అనిపిస్తాయి. మామూలుగా విలన్‌ పాత్రలని అండర్‌ ప్లే చేస్తూ, తాపీగా డైలాగులు చెప్తూనే ఫుల్‌ ఎఫెక్ట్‌ తీసుకొచ్చే రావు రమేష్‌ ఇందులో ఇంట్రడక్షన్‌ సీన్‌నుంచే ఓవర్‌ ప్లే చేయడం కనిపిస్తుంది. తన విలన్‌ అలా ఉండాలని దర్శకుడు కోరుకోవడం వల్ల అలా జరిగిందో, లేక రావు రమేష్‌ స్వయంగా ట్రై చేసిన వేరియేషనో కానీ అతను చేసిన మిగతా విలన్‌ పాత్రల మాదిరిగా ఇదంత మెప్పించలేదు. 

సెకండ్‌ హాఫ్‌ మొదలైన దగ్గర్నుంచి ఇక హీరో, విలన్‌ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతోనే సరిపోతుంది. హీరో ఏమో ఖాళీగా తిరిగే మధ్య తరగతి యువకుడు. విలన్‌ ఏమో పెద్ద మినిష్టరు. ఇద్దరి మధ్య అంతటి అంతరమున్నా కానీ హీరోని విలన్‌ ఏమీ చేయలేడు. కనీసం అతడిని ఏదైనా చేద్దామని కూడా ఎక్కడా ట్రై చేయడు. హీరో కాబట్టి ఎలాగైనా తనే గెలుస్తాడు కాబట్టి ఎందుకొచ్చిన దండగ ప్రయాస అనుకున్నాడో ఏమో అంత మినిష్టర్‌ అయి ఉండీ, హీరో చెల్లెలి పెళ్లి చెడగొట్టడం, అతను అమితంగా ప్రేమించే నాన్నతో ఛీ కొట్టించడం, ఇంకాస్త బలంగా తలచుకుంటే వాళ్ల అమ్మని లారీతో గుద్దించడం లాంటివి చేస్తాడు. ఒక మినిష్టర్‌ తలచుకుంటే ఒక సామాన్యుడిని ఏం చేయగలడు? సంతోష్‌ శ్రీనివాస్‌జీ... రిఫరెన్స్‌ కోసమైనా 'ఒకే ఒక్కడు' ఒక్కసారి చూసుండాల్సింది. 

పోనీ కమర్షియల్‌ సినిమానే కదా, లాజిక్కులు మనకెందుకులెమ్మని వదిలేద్దామని అనుకుంటే, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీద దృష్టి పెట్టకుండా సడన్‌గా మెసేజ్‌ ఇచ్చే పనిలో బిజీ అయ్యాడు దర్శకుడు. గవర్నమెంట్‌ ఆఫీస్‌లో ఒక ఉద్యోగి సిన్సియర్‌గా ఉంటే సమాజానికి ఎంత హెల్ప్‌ అవుతుంది అనేది దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశం. సంతోషం. ఇదే విషయాన్ని పదే పది నిమిషాల్లో చాలా సింపుల్‌గా, స్ట్రయికింగ్‌గా, ఎంతో ఎఫెక్టివ్‌గా 'జనతా గ్యారేజ్‌'లో ఒక సీన్‌లో చెప్పేసాడు కొరటాల శివ. ఆ పాయింట్‌ మీద సినిమా అంతా తీసిన సంతోష్‌ శ్రీనివాస్‌ ఆ మెసేజ్‌ని మాత్రం ఎఫెక్టివ్‌గా ఇవ్వలేకపోయాడు. సినిమా అంతటా ఒక మూడ్‌ మెయింటైన్‌ చేయడంలోను అతను కథకుడిగా విఫలమయ్యాడు. ఫస్ట్‌ హాఫ్‌ సరదాగా సాగితే, అటుపై యాక్షన్‌లోకి దిగి లౌడ్‌గా తయారవుతుంది. ఒక టైమ్‌లో అసలు ఇందులో ఒక హీరోయిన్‌ ఉందనే విషయం ఉందనే సంగతి కూడా గుర్తు రానంతగా ఎపిసోడ్ల వారీగా స్క్రీన్‌ప్లే రన్‌ అవుతుంది. హీరో, విలన్‌ ఛాలెంజ్‌ల పర్వం అయిపోయిన తర్వాత సందేశాల పర్వం మొదలవుతుంది. 

Watch Hyper Movie Public Talk

తిమ్మిని బమ్మి చేసి చూపించడానికి, ఇది కొత్త కథే అనిపించడానికి దర్శకుడు చాలానే కష్టపడ్డాడు. తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకు పాయింట్‌ బాగానే వర్కవుట్‌ అయింది. ఈ పాయింట్‌ మీదే కథంతా నడుస్తుంది. ఆయన చూసి లక్షణంగా ఉందని ముచ్చట పడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఆమెని వెతుక్కుంటూ వెళ్లడంతో లవ్‌ ట్రాక్‌కి బీజం పడుతుంది. ఆ తర్వాత రౌడీ అయిన మురళీ శర్మతో రామ్‌ పరిచయం, అటుపై అతనితో కలిసి తనకి తెలీకుండానే తన తండ్రికి హాని చేయడానికి స్కెచ్‌ వేయడం లాంటివి వినోదాత్మకంగా, ఎక్సయిటింగ్‌గా అనిపిస్తాయి. ఫస్ట్‌ హాఫ్‌లో రైటర్‌గా రాణించిన సంతోష్‌ శ్రీనివాస్‌ అదే ఫామ్‌ సెకండ్‌ హాఫ్‌లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఒక్కసారి హీరో, విలన్‌ కాన్‌ఫ్రంటేషన్‌ స్టార్ట్‌ అయ్యాక అడపా దడపా కొన్ని సీన్లు మినహా ఏదీ ఆకట్టుకోలేదు. విలన్‌ని మీడియా సాయంతో హీరో కార్నర్‌ చేయడం నితిన్‌ 'ఆటాడిస్తా' చిత్రాన్ని తలపిస్తుంది. 

రామ్‌ ఎప్పటిలానే కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. తను ఇంతవరకు ఇంతటి మాస్‌ పాత్ర ట్రై చేయకపోయినా బాగానే మౌల్డ్‌ అయ్యాడు. కానీ పక్కింటి 'హరి' స్థాయిలో ఇలా ఆకట్టుకోలేకపోయాడనేది ఒప్పుకోవాలి. మరీ ఇంతటి మాస్‌ పాత్రలని ఎన్టీఆర్‌, ప్రభాస్‌లాంటి వాళ్లే వద్దనుకుంటోన్న దశలో రామ్‌ ఇంత హెవీ యాక్షన్‌కి దిగనక్కర్లేదేమో. రావు రమేష్‌ ఓవర్‌ ప్లే చేసినప్పటికీ కొన్ని సీన్లలో తన హావభావాలు, డైలాగ్‌ డెలివరీతోనే మార్కులు కొట్టేసాడు. సత్యరాజ్‌ మరో ఉదాత్తమైన పాత్రలో తన స్క్రీన్‌ ప్రెజెన్స్‌, నటనతో ఆకట్టుకున్నాడు. రాశి ఖన్నా క్యారెక్టర్‌ జులాయిలో ఇలియానాని తలపిస్తుంది. మురళీ శర్మ, ప్రభాస్‌ శ్రీను, జయప్రకాష్‌రెడ్డి, సయాజీ షిండే తమవంతు సహకారం అందించారు. 

కమర్షియల్‌ సినిమా సక్సెస్‌కి, రిపీట్‌ వేల్యూకి కీలకమైన పాటలు ఇందులో పూర్తిగా మిస్సింగ్‌. జిబ్రాన్‌ పాటలన్నీ సిగరెట్‌ బ్రేక్స్‌కి ఉపయోగపడతాయి. సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ సాదాసీదాగా ఉంది. కాన్‌ఫ్రంటేషన్‌ సీన్లలో అవసరానికి మించి జూమ్‌ ఇన్‌, జూమ్‌ అవుట్లు, ప్యాన్‌ షాట్లు సీన్‌ ఇంపాక్ట్‌ని ఎలివేట్‌ చేయలేకపోయాయి. అబ్బూరి రవి సంభాషణలు బాగున్నాయి. క్వాలిటీ పరంగా నిర్మాతలు రాజీ పడలేదు. సంతోష్‌ శ్రీనివాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బాగా హ్యాండిల్‌ చేసినా, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో అదుపు తప్పాడు. ద్వితీయార్ధాన్ని కూడా వీలయినంత వినోదాత్మకంగా మలచినట్టయితే బాగుండేది. 

దర్శకుడు చెప్పాలనుకునే పాయింట్‌ ఏంటనేది అర్థమవుతున్నప్పుడు ప్రత్యేకించి సందేశం ఇవ్వడానికి ప్రయత్నించకుండా ఉండాల్సింది. దాని వల్ల ఓవరాల్‌ ఇంపాక్టే మారిపోయింది. మాస్‌ మసాలా కోరుకునే ప్రేక్షకులకి టైమ్‌పాస్‌ అయిపోతుందేమో కానీ ఇలాంటి రొటీన్‌ చిత్రాలతో విసిగిపోయిన వారి సహనాన్ని 'హైపర్‌' సెకండ్‌ హాఫ్‌ పరీక్షిస్తుంది. ఈ యావరేజ్‌ స్టఫ్‌తో సెలవుల సీజన్‌ని హైపర్‌ ఎంతవరకు క్యాష్‌ చేసుకుంటుందో చూడాలి.

బోటమ్‌ లైన్‌: మసాలా ఎక్కువైంది!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?