అమెరికాలోపై అల్ ఖైదా దాడుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచ చరిత్రలోనే అతి క్రూరమైన తీవ్రవాద దాడిగా దాన్ని అభివర్ణిస్తారు. అత్యంత దారుణమైన ఘటన అది. అందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అగ్రరాజ్యం నిలువెల్లా వణికిన ఆ ఘటనలో అమాయకులెందరో చనిపోయారు. ఆ భయం ఇప్పటికీ అమెరికాని వెంటాడుతోంది. అగ్రరాజ్యానికి ఎదురే లేదు.. అని అమెరికన్లు చెప్పుకుంటోన్న తరుణంలో, అమెరికాని ఓ తీవ్రవాద సంస్థ గడగడలాడించిందన్న వాదనను అమెరికా తట్టుకోలేకపోయింది. కలుగులోంచి ఎలుకని బయటకు లాగి మరీ చంపింది.
మరి, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం విషయంలో భారత్ ఎందుకిలా చేయలేకపోతోంది.? పాకిస్తాన్‌లో తీవ్రవాదులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. అక్కడి నుంచే భారతదేశంలో విధ్వంసానికి స్కెచ్ వేస్తున్నారు. అమెరికాపై దాడి జరిగింది ఒక్కసారే. కానీ, భారత్‌పై ఆ దాడులు నిత్యం జరుగుతూనే వున్నాయి. ఒకటా.? రెండా.? దేశంలో పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న తీవ్రవాదం అడుగుజాడలు అన్నీ ఇన్నీ కావు. కానీ, భారత్ ఏమీ చేయలేకపోతోంది.
'నువ్వు నన్ను ఏమీ చేయలేవురా..' అని పాకిస్తాన్ వెక్కిరిస్తోంటే, భారత్ మాత్రం ఇంకా 'సంయమన' మంత్రాన్నే పాటిస్తోంది. అమెరికాపై అల్ ఖైదా కక్షగట్టింది. భారత్ విషయంలో అలా కాదు, భారత్‌పై కత్తిగట్టింది పాకిస్తాన్. తన యుద్ధ కాంక్షతో అమెరికా సమస్యల్ని కొనితెచ్చుకుంది. భారత్ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తోంది భారత్. పాకిస్తాన్ రెచ్చగొడుతున్నా, భారత్‌ది ఏమీ చేయలేని పరిస్థితి. దానికి కారణాలు అనేకం.
పొరుగుదేశంతో యుద్ధం చేయడం ద్వారా, దేశ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందోనన్న భయం భారత్‌లో వుంది. ఇది వాస్తవం. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. అక్కడే వస్తోంది సమస్య అంతా. అమెరికా, పాకిస్తాన్‌లో దాడులు చేసి మరీ అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ని మట్టుబెట్టగలిగింది. పాకిస్తాన్‌కి ఛాయిస్ లేదు, అమెరికాకి సహకరించాల్సిందే. ఎందుకంటే, అమెరికా మోచేతి నీళ్ళు తాగి జీవనం సాగిస్తోంది పాకిస్తాన్. అమెరికా ఇచ్చే ఆయుధాలు, చైనా ఇచ్చే ఆయుధాలే పాకిస్తాన్‌కి బలం. ఆ ఆయుధాలతో భారత్‌పై పోరాటం చేయాలన్నది పాకిస్తాన్ ప్లాన్.
పాకిస్తాన్‌తో నీటి ఒప్పందాల్ని రద్దు చేసుకోవాలన్నా, సర్జికల్ ఆపరేషన్ చేపట్టాలన్నా, ఇంకేదన్నా చెయ్యాలన్నా.. భారత్‌కి అనేక సమస్యలున్నాయి. అందుకే, భారతదేశ ప్రజలంతా పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాల్సిందేనని నినదిస్తున్నప్పటికీ, ఒకటికి వందసార్లు ఆలోచించాల్సి వస్తోంది. కానీ, ఎప్పుడో ఒకప్పుడు బుద్ధి చెప్పక తప్పదు. ఛస్తూ బతకడం.. అత్యంత దారుణమైన విషయం. కీడెంచి, మేలెంచాలి. అందుకే, ఈ సంయమనం. అది చేతకానితనం ఏమాత్రం కాబోదు.