ఒలింపిక్స్‌లో సరైన జోడీలు పంపలేకపోయామంటూ టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ చేసిన వ్యాఖ్యలకు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చాలా దారుణమైన కౌంటర్ వేసింది. అలా ఇలా కాదు, లియాండర్ పేస్‌ని ఏకంగా 'విష పురుగు'గా అభివర్ణించింది సానియా మీర్జా. డైరెక్ట్‌గా కాదండోయ్, పేరు ప్రస్తావించకుండానే.!
'సమస్యలు సృష్టించే వ్యక్తులతో ఆడకపోవడమే అతి పెద్ద విజయం..' అని సానియా వ్యాఖ్యానించడాన్ని బట్టే, సానియా – పేస్ మధ్య 'ఆధిపత్య పోరు' ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి అంచనాలూ లేకుండా వెళ్ళి బ్యాడ్మింటన్‌లో సలచలనాలు సృష్టించింది పీవీ సింధు. సానియా మీర్జా అలా కాదు, స్టార్ స్టేటస్‌తో రియో ఒలింపిక్స్ వెళ్ళి, ఉత్త చేతులతో తిరిగొచ్చింది.
టెన్నిస్కి సంబంధించి గత ఒలింపిక్స్‌లోనూ, ఇప్పుడూ అనేక వివాదాలు నడిచాయి. మరీ ముఖ్యంగా డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విషయంలో ఆటగాళ్ళ మధ్య తీవ్రమైన విభేదాలు తెరపైకొచ్చాయి. 'మేం దేశం కోసం ఆడుతున్నాం..' అన్న ఆలోచన లేకుండా, వ్యక్తిగత విభేదాలతో భారత పరువుని అంతర్జాతీయ వేదికలపై ఆటగాళ్ళు తీసేశారన్నది నిర్వివాదాంశం. చేసింది చాలదన్నట్లు, ఇదిగో.. ఇప్పుడిలా 'విష పరుగు' లాంటి స్టేట్మెంట్లు. తాము దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నామన్న విషయం ఆటగాళ్ళు మర్చిపోతే మాటలు ఇలాగే వస్తాయ్ మరి.