ఉన్నట్టుండి ఒక గట్టి స్టేట్ మెంట్ ఇచ్చింది సమంత. ఒకవైపు వివాహానికి సంబంధించిన వార్తల్లో నిలుస్తున్న ఈ భామ.. ‘తనకు దక్షిణాదిన మీనింగ్ ఫుల్ రోల్స్ లభించడం లేదు..’ అనే సింది. అందుకే కొత్తగా ఏ సినిమాకూ సంతకం చేయలేదని సమంత సెలవిచ్చింది.
బహుశా చైతూతో పెళ్లి కి సన్నద్ధం అవుతూ.. వివాహం తర్వాత సినిమాలకు పుల్ స్టాప్ పెట్టే యోచనలో సమంత కొత్త సినిమాలకు సైన్ చేయలేదని అనుకుంటున్న తరుణంలో, అది కాదు.. అర్థవంతమైన పాత్రలు రాకపోవడం వల్లనే కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు.. అని సమంత చెప్పుకొచ్చింది.
సమంత ఆవేదన అర్థం చేసుకోదగినదే కానీ.. ఇంతకీ ‘మీనింగ్ ఫుల్ పాత్రలు’ అనేదానికి ఇక్కడ నిర్వచనం ఏమిటో మాత్రం సామాన్యులకు అర్థం కాదు. “ఇన్ని రోజులకూ మంచి మంచి పాత్రలు చేశా.. ఇప్పుడు మాత్రం మీనింగ్ ఫుల్ పాత్రలు రావడం లేదు..’ అని సమంత అంటోంది. మరి ఇన్ని రోజులూ ఆమె చేసిన అంత అర్థవంతమైన పాత్రలు ఏవో.. ఇప్పుడు వాటికి ఉన్న ఫలంగా ఎందుకు కరువొచ్చిందో అర్థం కావడం లేదు.
ఏ నందితా దాసో.. మరో ఆర్ట్ ఫిల్మ్ ల హీరోయినో “అర్థవంతమైన పాత్రలు లభించడం లేదు, అందుకే సినిమాలు చేయడం లేదు..’’ అంటే అది వినడానికి బాగుంటుంది. సగటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండిన సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ.. గ్లామరస్ గా కనిపించడం తప్ప ఇక మరే ప్రాధాన్యత లేని పాత్రలు చేస్తూ వస్తున్న సమంత ఉన్నట్టుండి “మీనింగ్ ఫుల్’’ పాత్రలు అంటూ కొత్త పల్లవి అందుకోవడం విశేషమే. బహుశా.. వివాహం నేపథ్యంలో సమంత దృష్టికోణం మొత్తం మారిందా ఏంటి?