అవినీతి కేసుల్లో శిక్షను అనుభవించి, భారీ ఫైన్ ను సైతం చెల్లించి ఇటీవలే జైలు నుంచి విడుదల అయిన శశికళతో కమలం పార్టీ జట్టు కట్టనుందనే టాక్ వినిపిస్తోంది తమిళనాడు నుంచి. అన్నాడీఎంకే ప్రస్తుత నాయకత్వం ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనలేదు అని నమ్ముతున్న బీజేపీ.. ఈ నాయకత్వానికి శశికళ కూడా తోడయితేనే మంచిదనే లెక్కలు వేస్తోందట.
ఇప్పటికే బీజేపీ ముఖ్యనేతలతో శశికళ అనుచరుడు టీటీవీ దినకరన్ సమావేశాలు కూడా జరిగాయని.. అయితే బీజేపీ గుర్తు మీదే శశికళ బ్యాచ్ పోటీ చేయాలనే షరతు ఒకటీ పెండింగ్ అని వార్తలు వస్తున్నాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉంటుంది. ఈ ఇదే కూటమిలో శశికళ అనుచరులు కమ్ టీటీవీ దినకరన్ అభ్యర్థులు పోటీ చేస్తారు.. అయితే వాళ్లంతా బీజేపీ గుర్తు మీద పోటీ చేయాలనేది కమలం పార్టీ షరతు అట!
ఇలా శశికళ వర్గానికి తన ముద్రను ఇవ్వడానికి బీజేపీ కండీషన్ పెట్టి మరీ సమ్మతిస్తోందట. అయితే బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తే.. ఎన్నికల తర్వాత వారంతా జారిపోతారనేది శశికళ- దినకరన్ లకు తెలియనిది ఏమీ కాదు! తనే దగ్గరుండి సీఎం సీట్లో కూర్చోబెడితే పళనిస్వామి ఎలా చేజారిపోయాడో శశికళకు అనుభవమే. అందుకే బీజేపీ ప్రతిపాదన పట్ల వారు అంత సానుకూలంగా లేరని తెలుస్తోంది.
అయితే.. ప్రస్తుత అన్నాడీఎంకే నాయకత్వంతో ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయో బీజేపీకి స్పష్టత ఉండనే ఉండినట్టుంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలప్పుడు ఈ గ్యాంగ్ చిత్తు చిత్తు అయ్యింది. డీఎంకే కూటమి స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే క్లీన్ స్వీప్ చేసినా పెద్ద ఆశ్చర్యం లేదు. ఇందుకే శశికళను కూడా కలుపుకుపోవాలనే బీజేపీ గట్టిగా భావిస్తోందట!
ఇక అవినీతి, బంధుప్రీతి.. ఇలాంటి వాటన్నింటికీ బీజేపీ వ్యతిరేకం కదా! అలాంటి పార్టీ శశికళతో చేతులు కలపడం ఏమిటి? అంటూ ఎవ్వరూ అడగరాదు! బీజేపీతో చేతులు కలిపితే, కమలం పార్టీతో కలిసి మునకేస్తే.. అంతా దేశభక్తులే కదా!