రికార్డు సమయంలో పట్టిసీమ ప్రాజెక్టుని పూర్తి చేశాం.. అని అప్పుడెప్పుడో ఆ ప్రాజెక్ట్‌ని జాతికి అంకితం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. బహుశా పట్టిసీమకు జరిగినన్ని ప్రారంభోత్సవాలు బహుశా దేశంలో ఇంకే ఇతర ప్రాజెక్టుకీ జరిగి వుండవేమో. అది ఉత్త ఎత్తి పోతల పథకం మాత్రమే. అంతకు ముందే కాలువల నిర్మాణం జరిగిపోయింది.. ఎత్తి పోతల ప్రాజెక్టుకి సంబంధించి 'మోటార్లు' బిగించే ప్రక్రియ కోసం.. నానా హంగామా చేశారు చంద్రబాబు.
సరే, దేశంలో నదుల అనుసంధానానికి తానే శ్రీకారం చుట్టానని చంద్రబాబు చెప్పుకుంటుంటారనుకోండి.. అది వేరే విషయం. పట్టిసీమతో రాయలసీమకు నీళ్ళు ఇస్తామని చెప్పిన చంద్రబాబు, పట్టిసీమ పేరుతో పుష్కరాల్ని మాత్రం ఘనంగా నిర్వహించేశారు. ఆ నీళ్ళే లేకపోతే, పుష్కరాల సంగతేంటి.? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
ఇక, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుని కూడా పట్టిసీమ తరహాలోనే పూర్తిచేసెయ్యాలనుకుంటున్నారు చంద్రబాబు. 2018 మే నెల నాటికి ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసెయ్యాలట. ఆగండాగండీ, వేల కోట్ల ఖర్చయ్యే ప్రాజెక్ట్.. రెండేళ్ళలో ఎలా పూర్తయిపోతుంది.. అన్నదే కదా మీ డౌట్.! దానికీ, చంద్రబాబు వద్ద ఓ ప్రత్యామ్నాయం వుంది.
ప్రాజెక్ట్ పూర్తయ్యిందా.? లేదా.? అన్నది కాదిక్కడ లాజిక్. ప్రాజెక్ట్ పూర్తి చేశామని చెప్పడమెలాగన్నదే లాజిక్. అది చంద్రబాబుకి బాగా తెలుసు. ఏముంది, ఏదో ఒక మాయ చేసి, ప్రాజెక్ట్‌ని జాతికి అంకితం చేసేస్తే, ఆ తర్వాత ఆ పేరు చెప్పి ఎడా పెడా పబ్లిసిటీ చేసేసుకోవచ్చు. వైఎస్ హయాంలో చాలావరకు కాలువల నిర్మాణం జరిగింది గనుక, నీటిని నిల్వ చేసి, ఆ నీటిని కాలువల ద్వారా తరలించేయడం ద్వారా ప్రాజెక్ట్‌లో మొదటి దశను పూర్తిచేసి, జాతికి అంకితం చేసెయ్యాలన్నది చంద్రబాబు వ్యూహం.
ముఖ్యమంత్రి పదవి కోసం చాలా కష్టపడాలి. పార్టీ పెట్టడమో, లేదంటే పార్టీ కోసం కష్టపడి పని చేయడమో.. ఇలా చాలా చాలానే తతంగం వుంటుంది. అవేవీ లేకుండానే, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ని వెన్నుపోటి పొడిచి, ముఖ్యమంత్రి పదవినీ, పార్టీ పగ్గాలు లాగేసుకున్న చంద్రబాబుకి, ఇలాంటి ఆలోచనలు కాక, ఇంకెలాంటి ఆలోచనలు వస్తాయట.?
కేంద్రం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి.. ఇది విభజన చట్టం చెబుతున్న విషయం. కానీ, చంద్రబాబు తానే ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తానంటున్నారు. పిల్లిమొగ్గలేసినా ఏం చేసినా.. పోలవరం ప్రాజెక్టు మూడు నాలుగేళ్ళలో పూర్తయ్యే ఛాన్సే లేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళయ్యింది, పోలవరం ప్రాజెక్టులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నానా కష్టాలూ పడితే, చిత్తశుద్ధితో పనిచేస్తే ఓ నాలుగైదేళ్ళలో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావొచ్చుగాక. కానీ, దానికి కేంద్రం పెద్దమనసుతో కావాల్సినన్ని నిధులు ఇవ్వాల్సి వుంటుంది.
అయితే, 2018 నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసినట్లుగా పబ్లిసిటీ చేసుకోకపోతే, 2019 ఎన్నికల్లో తమ పార్టీకి జనం పాతరేసేస్తారన్న భయం చంద్రబాబులో వుంది. అందుకే, కేంద్రం నిధులు ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో, కేంద్రాన్ని ఈ విషయంలో నిలదీసే ధైర్యం లేకపోవడంతో ఇదిగో.. ఇలా మళ్ళీ పోలవరం ప్రాజెక్టు విషయంలో అడ్డదార్లు తొక్కుతున్నారు చంద్రబాబు. కాపర్ డ్యామ్ అట, ఇంకేదోనట.. వెరసి, పోలవరం ప్రాజెక్టుని కూడా 'మమ' అన్పించేస్తారన్నమాట చంద్రబాబు. అదిరిందయ్యా చంద్రం.!