''రోమన్ హాలీడే'' సినిమాలో హీరోయిన్ బ్రిటన్ యువరాణి. రోమ్‌కు అధికార పర్యటనపై వస్తుంది. తనను పలకరించడానికి వచ్చిన వందలాది అతిథులను పలకరించడాలు, రాచరికపు కట్టుబాట్లు, వీటితో విసుగుపుట్టి, అస్వస్థురాలవుతుంది. నిద్ర పట్టకపోతే వైద్యుడు వచ్చి మత్తు యింజక్షన్ యిచ్చి వెళతాడు. మత్తు ఆవహించగా ఆమె అర్ధరాత్రి నైట్‌డ్రస్‌తో తనకిచ్చిన రాజప్రాసాదం నుండి బయటకు వచ్చి వీధుల్లో తిరుగుతూ ఓ చోటకి వచ్చి తూలుతూ వుంటుంది. అమెరికన్ పత్రికకు రోమ్‌లో రిపోర్టరుగా పనిచేసే హీరో ఆమెను చూసి ఎవరో అమ్మాయి మందు కొట్టి వీధిలో పడింది అనుకుని అయ్యోపాపమని తనతో పాటు టాక్సీ ఎక్కించి, తన ఫ్లాటు దగ్గర తను దిగిపోయి, ఆ అమ్మాయిని యింటి దగ్గర దింపేయమని టాక్సీవాడికి డబ్బివ్వబోతాడు. అతను నేను తీసుకెళ్లను, యిక్కడే దింపేసి పోతానని గొడవ చేస్తాడు. గత్యంతరం లేని హీరో ఆమెను తన ఫ్లాటుకి తీసుకుని వస్తాడు. ఆమె మత్తులో ఏదేదో వాగుతుంది. ఇతని మంచమెక్కి పడుక్కుంటుంది. ఇదెక్కడి తద్దినంరా అని తిట్టుకుంటూనే ఆ రాత్రికి ఆశ్రయం యిస్తాడు, తెల్లారగానే తరిమివేద్దామనుకుంటాడు. పొద్దున్న లేచి పేపరు కొనుక్కుని వచ్చి చూస్తే ఫ్రంట్ పేజీలో బ్రిటన్ యువరాణి ఫోటోలుంటాయి. ఎక్కడో చూసినట్లుందే అనుకుంటూ తన పక్క మీద నిద్ర పోతున్న అమ్మాయికేసి చూస్తే అదే మొహం! ఉలిక్కిపడతాడు….
**********
వానెస్సా రాడెల్ అనే ఆమె 42 ఏళ్ల ఫిలిప్పైన్ వనిత. రాజకీయ ఆశ్రయం కోరుతూ హాంగ్‌కాంగ్‌లో నివసిస్తున్న 11 వేల మంది శరణార్థుల్లో ఆమె ఒకతె. వాళ్లు తమ దేశంలో పనిచేయడానికి హాంగ్‌కాంగ్ ప్రభుత్వం అనుమతించదు కానీ నెలనెలా కొంత స్టయిపెండు యిస్తూంటుంది. అది వారి ఖర్చులకు సరిపోదు. హాంగ్‌కాంగ్‌లో అతి పేద లొకాలిటీలలో అతి చిన్న ఎపార్టుమెంటు బ్లాకులలో నివసిస్తూ బతుకు బండిని నెట్టుకొస్తూ వుంటారు. తమ కెలాగైనా ఆశ్రయం కల్పించి వర్క్ పెర్మిట్ యిప్పించమని ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకోవడానికి లాయర్లను పెట్టుకుంటూ వుంటారు. ఈ రాడెల్‌కు లాయర్లు రాబర్ట్ టిబ్బో, జోనాథన్ మ్యాన్. 2013 జూన్‌లో ఓ రోజు ఆమె తలుపు చప్పుడైంది. తెరిచి చూస్తే వాళ్లిద్దరితో బాటు యింకో 30 ఏళ్ల కుర్రాడున్నాడు. 'ఇతను మీ యింట్లో కొన్ని రోజులు దాక్కుంటాడు. సాయం చెయ్యి' అని లాయర్లడిగారు. ఆ అబ్బాయి పేరు కూడా చెప్పారు కానీ ఆమెకు అది తలకెక్కలేదు. చూడబోతే అమెరికన్‌లా వున్నాడు. లాయర్లు అడిగాక కాదనడం ఎలా? సరే, లోపలకి రమ్మనమంది. ఆ రాత్రి అతను ఆమె బెడ్‌రూములో పడుక్కున్నాడు. ఏడాది వయసున్న తన కూతురితో ఆమె మిగిలిన మరో గదిలో పడుక్కుంది. పగలైనా, రాత్రయినా అతను కంప్యూటరు మీద పని చేసుకుంటూన్నట్లు గమనించింది. మనకెందుకులే అనుకుంది. మర్నాడు పొద్దున్న అతను ''ద సౌత్ చైనా మార్నింగ్ పోస్టు'' పేపరు తెచ్చిపెట్టగలరా?'' అని అడిగాడు. హాంగ్‌కాంగ్‌లో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక అది. బయటకు వెళ్లి పేపరు కొంది. ఫ్రంట్ పేజీలోనే అతని ఫోటో. అతనెవరో, అతను చేసిన ఘనకార్యమేమిటో, ప్రపంచంలో కల్లా శక్తివంతమైన అమెరికా ప్రభుత్వం అతని కోసం ఎలా వెతుకుతోందో దానిలో రాసి వుంది. ''ఓ మై గాడ్, అన్‌బిలీవబుల్, ఇంత మోస్ట్ వాంటెడ్ మాన్ మా యింట్లోనా? నా చేతి తిండి తింటూనా!?'' అనుకుంది ఆమె తన భాషలో.
***********
ఇంగ్లీషులో అండర్‌గ్రౌండ్ వెళ్లాడంటారు, తెలుగులో అజ్ఞాతవాసంలో గడిపాడంటారు. తెలుగుపదమే సరైన పరిస్థితిని సూచిస్తుంది. అ-జ్ఞాతం – తెలియబడకుండా గడపడం! కమ్యూనిస్టులను వేటాడే రోజుల నాటి సంగతి గుర్తు చేసుకుంటూ ఒకాయన చెప్పారు – అది ఏడెనిమిది వాటాలున్న పెద్ద యిల్లట. పెద్ద పెరడు, నుయ్యి, నూతి దగ్గర ఆడవాళ్లు బట్టలు ఉతుక్కోవడం, మగవాళ్లు స్నానాలు చేయడం, పెరట్లో నానారకాల మొక్కలు, ఆ పక్కనే మల్లె పందిరి.. యిలాటి యింట్లో యీయన ఒక వాటాలో అద్దె కుండేవారు. వాళ్ల పక్కింటి వాటాలో ఉండే ఆయన ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. పలకరించినా ముభావంగా వుండేవాడు. ఇంట్లో ఆయన గొంతూ వినబడేది కాదు. ఎప్పుడు చూసినా మల్లె పందిరి కింద కూర్చుని చేతిలో ఓ పుస్తకం పెట్టుకుని చదువుకుంటూ వుండేవాడు. పొద్దస్తమానం ఆయన పెరట్లోనే అలా కూర్చుంటే నూతి దగ్గర మసలే ఆడవాళ్లకు చికాగ్గా వుండేది. అలా అని ఆయన ఎవరికేసీ చూసేవాడు కాదు. 'వెళ్లి యిది పద్ధతి కాదని చెప్పండి' అని వీళ్లావిడ పోరితే 'పెద్దమనిషిలా వున్నాడు, ఏమని ఫిర్యాదు చేయమంటావు?' అని యీయన అనేవాడట. ఆయన పేరూ, వూరూ కూడా తెలియదు. కొన్ని నెలలు యిలా గడిచాక ఆయన వాటా ఖాళీ చేసి వెళ్లిపోయాక తెలిసిందట – ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోంచి తప్పించుకుని పారిపోయిన ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకుడు మహీధర రామమోహనరావుగారి (''రథచక్రాలు'') తమ్ముడు జగన్మోహనరావు అని. ఆయనా కమ్యూనిస్టే, అరెస్టు వారంటుంది, ఎవరి దృష్టిలో పడకుండా అలా అజ్ఞాతంగా గడుపుతున్నాడు అని. జగన్మోహనరావు గారు 'విశ్వసాహిత్యమాల' అనే సంస్థ పెట్టి అనేక రష్యన్ నవలలు అనువాదం చేసి, తమ్ముడు కృష్ణమోహనరావు (''అవంతీ ప్రెస్'') అచ్చాఫీసులో దొంగతనంగా అచ్చువేసి పంపిణీ చేసేవారు.
మనం తెలుసుకోదగిన దేమిటంటే చట్టం నుంచి తప్పించుకుని తిరిగేవారు గొయ్యి తవ్వుకుని దాక్కోరు, సినిమాల్లో చూపించినట్లు మారువేషాల్లో తిరగరు. సామాన్యుల్లా, మనలో కలిసిపోయి తిరుగుతారు. అంతేకాదు, కొంతకాలానికి నిషేధం ఎత్తివేశాక, కేసులు కొట్టివేశాక వాళ్లు బహిరంగంగా తిరిగినా, అజ్ఞాతవాస కాలంలో తమకు ఆశ్రయం యిచ్చినవారి ఆనుపానులు చెప్పి యిబ్బందుల్లోకి నెట్టరు. ఎమర్జన్సీ రోజుల్లో జైలుపాలై అనారోగ్యంతో మరణించిన స్నేహలతా రెడ్డి ఉదంతం గుర్తు తెచ్చుకోండి. కెవి రెడ్డి గారి ''జయంతి ఫిల్మ్‌స్'' భాగస్వామిగా తెలుగు సినిమాల నిర్మాతగా, కవిగా వన్నె కెక్కిన పట్టాభిగారి భార్య స్నేహలత. ఇద్దరూ కలిసి గిరీశ్ కర్నాడ్‌తో ''సంస్కార'' తీసి కొత్త తరహా సినిమాలకు బాట వేశారు. ఎమర్జన్సీలో జార్జి ఫెర్నాండెజ్‌పై కేసు పెట్టి అతని కోసం చాలా తీవ్రంగా గాలించారు, వెంటాడారు, వేటాడారు. అతనికి డిఎంకె ప్రభుత్వం తమిళనాడులో ఆశ్రయం యిచ్చింది. ఇందిర అక్కడ రాష్ట్రపతి పాలన విధించడంతో ఫెర్నాండెజ్ కర్ణాటక పారిపోయి, సాటి సోషలిస్టు అయిన స్నేహలత ఆశ్రయం కోరాడు. ఆమె యిచ్చింది. కొద్ది రోజులుండి వేరే చోటకి వెళ్లిపోయాడు. కానీ స్నేహలత యింట్లో వున్నాడన్న సంగతి తెలిసి పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. పట్టాభి పలుకుబడి, వాళ్ల కూతురు నందిని నిరసన ప్రదర్శనలు ఏవీ పని చేయలేదు. చివరకు ఆమె ఆరోగ్యం పూర్తిగా ధ్వంసమయ్యాక విడిచి పెట్టారు. జైలు నుంచి బయటకు వస్తూనే ఆమె చనిపోయింది. అందువలన చట్టం నుంచి పారిపోతున్నవారికి ఆశ్రయం యిచ్చేవారు అప్పుడే కాదు, తర్వాత కూడా యిక్కట్ల పాలవుతారు.
************
అది తెలిసి కూడా ఫిలిప్పీన్ వనిత రాడెల్ స్నోడెన్‌ను తన యింట్లో వుండనిచ్చింది. ఎడ్వర్డ్ స్నోడెన్ అప్పటికే అమెరికన్ ప్రభుత్వానికి చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ) రహస్యాలను, బ్రిటన్ జిసిఎచ్‌క్యూ రహస్యాలను బయటపెట్టి అమెరికా ప్రభుత్వాగ్రహానికి గురయ్యాడు. అతను కంప్యూటర్ స్పెషలిస్టు. డెల్‌లో పనిచేశాడు. అమెరికన్ గూఢచారి సంస్థ సిఐఏకు కూడా పనిచేశాడు. అవన్నీ చూసి ఎన్‌ఎస్‌ఏ కంప్యూటరు పనులు కాంట్రాక్టు తీసుకున్న హామిల్టన్ అనే అతను 2013లో అతన్ని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. టెలికమ్యూనికేషన్ కంపెనీల, యూరోప్‌లో ప్రభుత్వాల సహకారంతో ఎన్‌ఎస్‌ఏ ప్రపంచదేశాలన్నిటిపై ఎలా నిఘా వేస్తోందో తెలియడంతో స్నోడెన్ నిర్ఘాంతపోయాడు. ఇక్కడ ఘోరం జరగబోతోంది అని ముందే చెప్పేసే విజిల్ బ్లోయర్ (పారాహుషారీ)లా యీ రహస్యాలను లోకానికి వెల్లడించాలని నిశ్చయించుకున్నాడు. అలా చేసిన వాళ్లను అమెరికన్ ప్రభుత్వం 30 ఏళ్లకు తగ్గకుండా జైలులో పెడుతుందని, లేకపోతే చంపించివేస్తుందని, మరో విజిల్‌బ్లోయర్ సంవత్సరాలుగా ఏకాంతశిక్ష (సోలిటరీ కన్‌ఫైన్‌మెంట్) అనుభవిస్తున్నాడని తెలుసు.
అన్నిటికి సిద్ధపడే అమెరికన్ గడ్డను 2013 మే మూడోవారంలో వదిలిపెట్టి హాంగ్‌కాంగ్ చేరాడు. అక్కడ మీరా అనే ఫైవ్‌స్టార్ హోటల్లో వుంటూ ''గార్డియన్'', ''వాషింగ్టన్ పోస్టు'' పత్రికలకు చెందిన యిద్దరు జర్నలిస్టులను పిలిచి వారికి అన్ని వివరాలతో బాటు సాక్ష్యాధారాలు కూడా అందించాడు. వారు జూన్‌లో తమ కథనాలను అచ్చు వేయగానే తీవ్ర సంచలనం చెలరేగింది. ''డెర్ స్పయిగెల్'', ''న్యూయార్క్ టైమ్స్'' యింకా లోతుగా పరిశోధించి మరిన్ని కథనాలు వేశాయి. జూన్ 21 న అమెరికా ప్రభుత్వం స్నోడెన్‌పై గూఢచర్యం చట్టం, ప్రభుత్వ ఆస్తి చౌర్యం చట్టాల కింద కేసులు పెట్టింది. పట్టుకోవాలని విశ్వప్రయత్నం చేసింది. అమెరికా నుంచి తప్పించుకోవాలంటే దానికి శత్రువైన రష్యాలో ఆశ్రయం కోరడమే శరణ్యం అనుకున్నాడు స్నోడెన్. జూన్ 23 కల్లా రష్యా చేరాడు. రష్యా ఒక ఏడాది ఆశ్రయం యిస్తానంది. తర్వాత దాన్ని పొడిగిస్తూ పోయింది. ఇప్పటికీ మాస్కోలోనే వున్నాడు. రష్యా అంతా పర్యటిస్తున్నాడు. హాంగ్‌కాంగ్‌లో హోటల్లో నుంచి మాయమయ్యాక రష్యాకు చేరే లోపున అతను ఎక్కడ వున్నాడో ఎవరికీ తెలియదు.
స్నోడెన్‌పై ల్యూక్ హార్డింగ్ రాసిన ''ద స్నోడెన్ ఫైల్స్'', అనటోలీ కుచెరెనా రాసిన ''టైమ్ ఆఫ్ ఆక్టోపస్'' పుస్తకాల ఆధారంగా ఆలివర్ స్టోన్ అనే అతను స్నోడెన్‌పై ఇంగ్లీషు, జర్మన్ భాషల్లో పొలిటికల్ థ్రిల్లర్ సినిమా తీయడానికి నిశ్చయించుకున్నాడు. అతను స్నోడెన్ గురించి సమస్త వివరాలు కావాలని పట్టుబట్టాడు, ముఖ్యంగా అతను అజ్ఞాతంలోకి ఎలా వెళ్లిపోయాడో, అప్పుడేం జరిగిందో చెప్పాలన్నాడు. అజ్ఞాతంలో వున్నవారి వివరాలు బయటపెడితే తర్వాత వారికి చిక్కులు వస్తాయని స్నోడెన్ లాయర్లు భయపడ్డారు. చివరకు వారిని సంప్రదించి వివరాలు బయటపెట్టడానికే నిశ్చయించుకున్నారు. ఆ సినిమా ఎల్లుండి శుక్రవారం అమెరికాలో, ఆ పై గురువారం జర్మనీలో రిలీజు కాబోతోంది. ఆ తర్వాత స్నోడెన్, డైరక్టరు స్టోన్ వీడియో లింకు ద్వారా ప్రేక్షకులతో చర్చలో పాల్గొంటారు. సినిమా ప్రజాదరణ పొందిందంటే స్నోడెన్ పట్ల అమెరికన్లకు సానుభూతి కలిగినట్లే. ఇదే అదనుగా పదవి విడిచి వెళ్లేలోగా తనకు క్షమాభిక్ష పెట్టమని అతను ఒబామాను కోరుతున్నాడు. అతని కుటుంబం అమెరికాలో వుంది, అప్పుడప్పుడు రష్యా వచ్చి అతన్ని కలుస్తోంది. అయినా అతను అమెరికాకు తిరిగి వద్దామనుకుంటున్నాడు. ''నా చర్యల వలన ఎంతో నష్టం నివారింపబడి, అమెరికాలోని సామాన్య పౌరుడికి లాభం కలిగిందన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని నన్ను క్షమించండి. నేను నేను బయటపెట్టిన విషయాల వలన 2013కు, యిప్పటికి మధ్య చట్టాలు కూడా మార్చారు. పాత చట్టాల ప్రకారం పెట్టిన ఆ కేసులు ఎత్తివేయండి.'' అని అతను అడుగుతున్నాడు. ఒబామా లాయరుగా వుండే రోజుల్లో యిలాటి స్వేచ్ఛ కోసం వాదించినవాడే. కానీ స్నోడెన్ చైనా గూఢచారి అని, రష్యా గూఢచారి అని కొన్ని వర్గాల్లో ప్రచారం జరుగుతున్న యీ రోజుల్లో ఎంతవరకు సాయపడతాడో తెలియదు. అతని మాజీ అటార్నీ జనరల్ మాత్రం స్నోడెన్‌ను క్షమించాలని అంటున్నాడు.
ఎలాగోలా తనపై కేసులు ఎత్తివేస్తారని, అందువలన తనకు ఆశ్రయం యిచ్చినవారికి ముప్పు కలగదని స్నోడెన్, అతని లాయర్లు అనుకున్నారు కాబోలు, సినిమా డైరక్టరుకి ఆనాటి వివరాలు చెప్పేశారు. జరిగిందేమిటంటే – జర్నలిస్టులతో మాట్లాడాక స్నోడెన్‌ను టిబ్బో, మ్యాన్‌లు హాంగ్‌కాంగ్‌లోని యుఎన్ ఆఫీసుకి తీసుకెళ్లారు. అక్కడ అతను శరణార్థి హోదాకై అప్లయి చేశాడు. అది వస్తే అమెరికా అతన్ని పట్టుకుని పోలేదు. ఆ హోదా వచ్చాకనే అతను రష్యా పారిపోగలడు. అప్పటిదాకా ఎక్కడ దాక్కోవాలి? లాయర్లు అతన్ని ఏదైనా గొడౌన్‌లో దాచుదామా అనుకున్నారు. కానీ తన క్లయింట్లయిన శరణార్థుల సాయం అడుగుదామని టిబ్బోకు ఐడియా వచ్చింది. స్నోడెన్ వంటి హై ప్రొఫైల్ మనిషి అలాటి దిక్కుమాలిన యిళ్లల్లో వుంటాడని అమెరికా, హాంగ్‌కాంగ్ పోలీసులు వూహించలేరని అంచనా వేశాడు. అదే జరిగింది. మొదట శ్రీలంక నుంచి వచ్చి హాంగ్‌కాంగ్ ఆశ్రయం కోరుతున్న సుపున్ కెల్లాపతా, నదీకాల యింటికి తీసుకెళ్లారు. అక్కణ్నుంచి రాడెల్ యింటికి. మళ్లీ అక్కణ్నుంచి మరో శ్రీలంక శరణార్థి అజిత్ పుష్పకుమారా వద్దకు వెళ్లారు. వీరెవరూ లాయర్ల మాట కాదనలేదు. అమ్మో, నాకు భయం, మా యింట్లో కుదరదు అనలేదు. అలాటి ధీమంతులు సినిమా కారణంగా వివరాలు బయటకు వచ్చి యిక్కట్లపాలవుతారన్న శంక స్నోడెన్‌కు కూడా వుంది. వాటిలోంచి బయట పడాలంటే డబ్బు కావాలి. గతంలోనే వాళ్లకు అతను తలా వెయ్యేసి అమెరికన్ డాలర్లు పంపి వున్నాడు. ఇప్పుడు వారిని ఆదుకోమని తన సమర్థకులకు పిలుపు నిచ్చాడు. వారి స్పందన ఎలా వుంటుందో చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2016)