బాబు జమానా కు ఎన్టీఆర్ దూరం దూరం

మొత్తానికి ఎన్టీఆర్ వాస్తవం గ్రహించినట్లున్నారు. ఇప్పటికిప్పుడు అనవసరంగా చంద్రబాబు ను కెలుక్కోవడం తనకు కానీ, తన కెరీర్ కు కానీ అంత మంచిది కాదన్న సత్యాన్ని వంట పట్టించుకున్నారు. జనతాగ్యారేజ్ సినిమా విజయోత్సవాన్ని ఆంధ్రలో…

మొత్తానికి ఎన్టీఆర్ వాస్తవం గ్రహించినట్లున్నారు. ఇప్పటికిప్పుడు అనవసరంగా చంద్రబాబు ను కెలుక్కోవడం తనకు కానీ, తన కెరీర్ కు కానీ అంత మంచిది కాదన్న సత్యాన్ని వంట పట్టించుకున్నారు. జనతాగ్యారేజ్ సినిమా విజయోత్సవాన్ని ఆంధ్రలో జరిపే ఆలోచనను ఆయన విరమించుకున్నారు.

జనతాగ్యారేజ్ సినిమా విజయం సాధించిన అనంతరం విశాఖలో ఓ సమావేశం జరపాలని అనుకున్నారు. అందుకోసం వినాయకచవితి తరువాత అయిదో రోజును ఎంచుకున్నారు. కానీ ఆ రోజు విశాఖ బీచ్ లో విగ్రహాల నిమజ్జన సందడి ఎక్కువగా వుంటుందని, సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెప్పేసారు. 

నిజానికి విశాఖలో లేదా విజయవాడలో విజయోత్సవం జరపడం అన్నది తెలుగు సినిమాలకు కామన్ అయిపోయింది. అందువల్ల జనతా గ్యారేజ్ కూడా ఆ తరువాత అయినా విజయోత్సవం విశాఖలో జరుపుతుందనుకున్నారు. నిర్మాతలు కూడా అలాగే ఇరవై అయిదు రోజుల విజయోత్సవం అయినా జరపాలని అనుకున్నారు ఇప్పటికీ. 

కానీ ఎన్టీఆర్ మాత్రం అందుకు అంత సుముఖంగా లేరని తెలుస్తోంది.

ఇప్పటికే గ్యారేజ్ సక్సెస్ మీట్ ఒకటి హైదరాబాద్ లో మీడియా సమక్షంలో జరిపేసారు. మరొకటి ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ లోనే మంగళవారం నిర్వహిస్తున్నారు. జనతాగ్యారేజ్ సందడి బాక్సాఫీస్ దగ్గర మూడు, నాలుగు రోజుల క్రితమే ముగిసిపోయింది. ఏదో విధంగా 70 కోట్ల మేరకు షేర్ సాధించేసాం అని పించేసుకున్నారు. ఇక దాన్ని పెంచడం అన్నది సాధ్యమయ్యే పనికాదు. ఇలాంటి నేపథ్యంలో విశాఖలో లేదా ఆంధ్రలో విజయోత్సవం అన్నది కేవలం ఎన్టీఆర్ సరదా కోసం చేయాలి అంతే. 

మరి హైదరాబాద్ లో ఫ్యాన్స్ మీట్ చేస్తున్నారు అంటే, మళ్లీ మరోసారి విశాఖలో చేయాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పేసినట్లే. విశాఖలో పర్మిషన్ అడగడం, ఏదైనా సాకు చూపి, పోలీసులు నో అంటే, అవమాన పడడం, అనవసరంగా రకరకాల గ్యాసిప్ లు ఇవన్నీ అనవసరం అని, అందుకే హైదరాబాద్ ఫ్యాన్స్ మీట్ తో సరిపెట్టేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.