తెలివైన నిర్మాతలు ఏ స్టెప్ వేసినా, దాని వెనుక ఏదో అర్థం, పరమార్థం వుంటాయి. అనిల్ రావిపూడి డైరక్షన్ లో రామ్ తో చేసే సినిమాను నిర్మాత దిల్ రాజు క్యాన్సిల్ చేసుకున్నారు. దీనికి కారణం రామ్ అయిదుకోట్లకు పైగా రెమ్యూనిరేషన్ అడగడమే అని గ్యాసిప్ బయటకు వచ్చింది. కాదు, స్రవంతి రవికిషోర్ తో తేడా వచ్చిందని మరో గ్యాసిప్. ఈ రెంటింటి కన్నా అసలు సిసలు కారణం ఇంకొకటి వుందని ఇప్పుడు తెలుస్తోంది.
అదేంటంటే, అనిల్ రావిపూడి తన తరువాతి సినిమాను దిల్ రాజుకు చేయాలి. అందుకే రామ్ తో చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలో జనతాగ్యారేజ్ వచ్చింది. హిట్ అయింది. నాచురల్ గా దీని తరువాత ఎన్టీఆర్ సినిమాపై ఆ ప్రభావం వుంటుంది. మరోపక్క సరైన డైరక్టర్ లేక ఎన్టీఆర్ వెదుకులాడుతున్నారు. అనిల్ రావిపూడి రెండు సినిమాలతో ప్రూవ్ చేసుకుని వున్నారు. నిజానికి తన తరువాతి సినిమాను స్వంత బ్యానర్ లో చేయాలని ఎన్టీఆర్ అనుకుంటున్నారు.
అయితే అనిల్ రావిపూడి అయితే కనుక దిల్ రాజుకు భాగస్వామ్యం ఇవ్వడానికి కూడా ఎన్టీఆర్ ఓకె. అంటే అనిల్ రావిపూడిని రామ్ కు వాడేస్తే, దిల్ రాజుకు ఎన్టీఆర్ సినిమా వుండదు. రామ్ సినిమా అంటే ఇరవై, పాతిక కోట్లు. అదే గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ సినిమా అంటే డెభై కోట్లు. సో, అందుకే దిల్ రాజు ఎన్టీఆర్ వైపే మొగ్గినట్లు తెలుస్తోంది. ఏదో విధంగా రామ్ తో సినిమాకు బై కోట్టేసారు అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ కహానీ. ఎంతయినా దిల్ రాజు తెలివైన నిర్మాత.