నందమూరి బాలకృష్ణ, తన సోదరుడు హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మొదటి నుంచీ కాస్త 'డిఫరెంట్'గానే వ్యవహరిస్తున్నాడు. మధ్యలో బాబాయ్, అబ్బాయ్ కలిసిపోయినట్లుగా కన్పించారుగానీ, ఆ కలయిక వెనుక 'రాజకీయ అవసరాలు' వున్నాయనే గుసగుసలు విన్పించాయి అప్పట్లో. ఆ తర్వాత బాబాయ్, అబ్బాయ్‌ని పూర్తిగా పక్కన పెట్టేశాడు.
'జనతా గ్యారేజ్' సినిమా విడుదల సమయంలో, 'బాబాయ్‌తో నాకెలాంటి విభేదాల్లేవు. టీడీపీతోనే వుంటానని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు..' అంటూ టీడీపీపైనా, బాబాయ్‌పైనా ఎన్టీఆర్ ప్రేమాభిమానాల్ని చాటుకున్నాడుగానీ, ప్చ్.. బాబాయ్ బాలయ్య మాత్రం, అబ్బాయ్ ఎన్టీఆర్‌ని లైట్ తీసుకున్నాడు. 'జనతా గ్యారేజ్'ని పట్టించుకోకుండా నారా రోహిత్ కొత్త సినిమా 'జ్యో అచ్యుతానంద' గురించి బాలకృష్ణ స్పందించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
ఇందులో ఆశ్చర్యపడటానికి ఏమీ లేదనీ, చాలాకాలంగా 'బాబాయ్ – అబ్బాయ్' మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనీ, ఈ వార్ బాబాయ్ నుంచే గట్టిగా వుందనే వాదనలు సర్వత్రా విన్పిస్తున్నాయి. ఏమో, ఇందులో నిజమెంతోగానీ, 'జూ.ఎన్టీఆర్ మనోడు కాదు..' అంటూ కొందరు నందమూరి దురభిమానులు, ఎన్టీఆర్ గత చిత్రాల విడుదల సమయంలో ఎస్ఎంఎస్ల యుద్ధం నడిపారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేశారు.
మరిప్పుడు, బాలకృష్ణ 'జనతా గ్యారేజ్'ని వదిలేసి, 'జ్యో అచ్యుతానంద'ని స్పెషల్‌గా ట్రీట్ చేయడాన్ని ఏమనుకోవాలి.?