రివ్యూ: జ్యో అచ్యుతానంద
రేటింగ్: 3/5
బ్యానర్: వారాహి చలనచిత్రం
తారాగణం: నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసాండ్రా, సీత, నాని (అతిథి పాత్రలో), తనికెళ్ల భరణి, శశాంక్, చైతన్య కృష్ణ తదితరులు
సంగీతం: శ్రీ కళ్యాణ్ రమణ
కూర్పు: కిరణ్ గంటి
ఛాయాగ్రహణం: వెంకట్ సి. దిలీప్
నిర్మాత: రజని కొర్రపాటి
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల
విడుదల తేదీ: సెప్టెంబరు 9, 2016
నవ్వించాలంటే ఏదైనా డబుల్ మీనింగ్ మాట మాట్లాడితేనో, ఎదుటివాడి లోపాన్ని చిన్నబుచ్చితేనో, లేదా అవతలి వాడిని అదే పనిగా తంతేనో, కొడితేనో, బఫూన్ని చేస్తేనో తప్ప సాధ్యం కాదని ఈమధ్య మన సినిమాలు చూస్తుంటే అనిపిస్తోంది. హ్యూమర్ అంటే ఇంతే అని అలవాటు పడిపోతున్నప్పుడు హాస్యానికి అసలు అర్థం చెప్పడానికా అన్నట్టు శ్రీనివాస్ అవసరాల దర్శకుడి అవతారమెత్తాడా అని 'జ్యో అచ్యుతానంద' చూస్తుండగా చాలాసార్లు అనిపించింది. అతను దర్శకుడిగా మారుతున్నాడంటే 'కమెడియన్‌కి ఇది అవసరమా?' అని చాలామంది అనుకుని ఉంటారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత 'అవసరాల 'అవసరం' తెలుగు సినిమాకి ఉంది' అని ఆ చాలామందిలో చాలామంది అనుకోకుండా ఉండరు.
హాయిగా నవ్వుకోడానికి వికృత చేష్టలు, వింత వింత పనులు, వెకిలి మాటలు అస్సలు అక్కర్లేదు, ఇదే కదా హాస్యమంటే అన్న రీతిలో శ్రీనివాస్ అవసరాల పండించిన క్లీన్ కామెడీని మాటల్లో చెప్పడం కష్టం కానీ… సినిమా చూసి మనసారా నవ్వుకుని రావాలంతే. 'ఊహలు గుసగుసలాడే'లోనే తన మార్కు చూపించిన అవసరాల ఈసారి కేవలం హాస్యంతోనే కాకుండా తనలోని సృజనాత్మక కోణాన్ని కూడా చూపించాడు. అన్నదమ్ములిద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో పడడం, అది బెడిసికొట్టడం, దాంతో ఇద్దరి మధ్య స్పర్ధలు రావడం, తర్వాత వాటిని జయించడం… నాలుగు ముక్కల్లో చెప్పుకుంటే 'జ్యో అచ్యుతానంద' కథ ఇదే. దానిని అవసరాల ఎంత తెలివిగా మొదలెట్టాడనేది ఇక్కడే చెప్పేస్తే మజా ఉండదు కానీ దానిని తెరమీదే చూడండి.
టైటిల్‌కీ, కథకీ చాలా సార్లు సంబంధం ఉండడం లేదీమధ్య. జ్యో అచ్యుతానంద అనే అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టడమే కాకుండా, దానికి పూర్తి జస్టిఫికేషన్ ఇచ్చేసాడు అవసరాల. జ్యో (జ్యోత్న్స – రెజీనా), అచ్యుత రామారావు (అచ్యుత్ – రోహిత్), ఆనంద వర్ధనరావుల (ఆనంద్ – శౌర్య) ముక్కోణ ప్రేమకథ ఇది. ఒకమ్మాయితో ప్రేమలో పడ్డ అన్నదమ్ములు ఆమె కోసం ఒకర్నొకరు మోసం చేసుకుంటారు, ఎలాగైనా ఆమెని దక్కించుకోవడానికి నానా జిత్తులు చేస్తారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. దానిని సరిదిద్దే బాధ్యతని ఆ అమ్మాయే తీసుకుంటుంది. అన్నదమ్ములిద్దరి మధ్య సంబంధాలు సరిలేకపోయినా కానీ ఎక్కడా చొక్కాలు పట్టుకుని కొట్టుకోవడం, ఒకరిపై ఒకరు అరుచుకోవడం కనిపించదు. కానీ వాళ్లిద్దరి మధ్య ఉన్న సంఘర్షణ మాత్రం తెలుస్తూనే ఉంటుంది. మొదట్లో సరదాగా మొదలైనది కాస్తా తర్వాత ముదురుతుంది. ఇదంతా శ్రీనివాస్ అవసరాల చాలా మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేసాడు. తనలో హాస్య చతురతే కాకుండా ఎమోషనల్ డెప్త్ కూడా చాలా ఉందని పలు సందర్భాల్లో చూపించాడు.
ప్రథమార్ధం కొత్త కొత్తగా అనిపిస్తూ, ఆద్యంతం నవ్విస్తూ అసలు సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలీకుండా పరుగులు తీస్తుంది. ద్వితీయార్ధానికి వచ్చేసరికి బ్రేకులు పడ్డాయి. లీడ్ క్యారెక్టర్ల వయసుతో పాటు బాధ్యతలు పెరుగుతాయి కనుక కుర్రతనం చూపించడానికి కుదరదు. అది ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. కానీ ఒక్కసారి కథలోకి మళ్లీ జ్యోత్న్స రిఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడేం జరుగుతుందో అనే కుతూహలం కలుగుతుంది. తన వల్ల ఏర్పడ్డ దూరాన్ని అన్నదమ్ముల మధ్య తగ్గించడానికి జ్యో ఒక ప్లాన్ చేస్తుంది. అదంతా అంత బలంగా లేదు. ముగించడానికి ఏదో ఒక సాకులా అనిపించే ఆ పాయింట్ వల్ల కథకి వెయిట్ రాలేదు. ఆ పాయింటే వీక్‌గా ఉండడం వల్ల అక్కడ రాసుకున్న సీన్లు కూడా బలహీనపడ్డాయి. దాంతో అంతవరకు అనిపించిన ఫ్రెష్‌నెస్ పోయి కథలోకి ఒక రకమైన నిర్లిప్తత ప్రవేశించింది. అన్నదమ్ముల మధ్య స్పర్ధలు తొలగించే సీన్లని మళ్లీ అవసరాల చాలా బాగా డీల్ చేసాడు. పతాక సన్నివేశంలో భావోద్వేగాలు కదిలిస్తాయి. నవ్వించి, నవ్వించి చివర్లో ఏడిపించి పంపించడం ఒక మంచి సినిమా లక్షణమని అంటుంటారు. ఆ రెండు విషయాల్లోను 'జ్యో అచ్యుతానంద' సక్సెస్ అయింది. అయితే కథని రసకందాయంలో పడేయాల్సిన ఘట్టంలో దర్శకుడి ఉదాసీనత వల్ల ఒక గొప్ప సినిమా కావాల్సినది కాస్తా 'బాగుంది సినిమా' అని మాత్రం అనిపించుకోగలిగింది.
స్క్రీన్‌ప్లే రైటర్‌గా ఫస్ట్‌హాఫ్‌ని అంత బాగా రాణించిన అవసరాల శ్రీనివాస్ కీలకమైన 'థర్డ్ యాక్ట్' విషయంలో పట్టు తప్పడం ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇంటర్వెల్‌కే కథ ముగిసినప్పుడు అటుపై దానిని ముందుకి నడిపించడం అంత తేలిక కాదు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త తేలిపోయినట్టనిపించినా కానీ అదేమంత పెద్ద కంప్లయింట్ కాదు. సమస్యలున్నప్పటికీ కూడా ఓవరాల్‌గా ఈ చిత్రం ఒక మంచి సినిమా చూసి వచ్చిన అనుభూతిని అయితే గ్యారెంటీగా ఇస్తుంది. ఇక్కడ నిర్మాత గురించొక మాట. వరుసగా అన్నీ మంచి కథలే ఎంపిక చేసుకుంటూ, దర్శకులని నమ్మి వారి ఆలోచనల మీద పెట్టుబడి పెడుతోన్న సాయి కొర్రపాటి అభినందనీయుడు.
ఇది ఇద్దరు అన్నదమ్ముల కథలానే అనిపిస్తుంది తప్ప ఎక్కడా ఇద్దరు హీరోల సినిమా అనే భావన కలగదు. పాత్రలని, సన్నివేశాలని అంత సహజంగా తీర్చిదిద్దాడు అవసరాల శ్రీనివాస్. ఆ పాత్రల్లోకి రోహిత్, శౌర్య ఇద్దరూ ఒదిగిపోయారు. వీళ్లిద్దరూ నిజంగా అన్నదమ్ములే అని నమ్మేసే రీతిన వారి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. జ్యోగా రెజీనా చుట్టే కథ నడుస్తుంది కానీ ఆమెకి ఇందులో బలమైన పాత్ర లేదు. ఉన్నంతలో తన ప్రెజెన్స్ తెలిసేట్టు బాగానే చేసింది. మిగిలిన పాత్రధారులంతా సహకారం బాగా అందించారు. సంగీతం కథలో భాగమైంది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ చక్కగా కుదిరాయి. ఫస్ట్ హాఫ్‌లో ఎడిటింగ్ చాలా బాగుంది.
అవసరాల మాట విరుపులు, అతని సెన్సాఫ్ హ్యూమర్ ఈ చిత్రానికి కొండంత బలమయ్యాయి. పొట్ట పగిలేలా నవ్వుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ద్వితీయార్థంలో కథని కంచికి చేర్చే క్రమంలో తడబడినప్పటికీ వినోదాన్ని అందించడంలో ఏ లోటు చేయలేదు. నవ్వించి పంపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. తన తదుపరి చిత్రం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే అభిమానుల్ని పొందాడు. దర్శకుడిగా తనని సీరియస్‌గా తీసుకుని తీరాల్సిన గౌరవాన్ని సంపాదించుకున్నాడు.
బోటమ్ లైన్: అవసరాల మార్కు క్లాస్ కామెడీ!
– గణేష్ రావూరి