భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో అద్భుత విజయం వచ్చి చేరింది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-5 రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది ఇస్రో. ఈ ప్రయోగం ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ఇన్‌శాట్ 3డిఆర్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టగలిగింది. ఇస్రో చరిత్రలోనే ఇదో అద్భుత విజయంగా ఇస్రో శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్తున్నారు.
పీఎస్‌ఎల్‌వీ రాకెట్.. ఇస్రోకి అత్యంత నమ్మదగ్గది. అయినాసరే, జీఎస్‌ఎల్‌వీతో ఉపగ్రహాల ప్రయోగం మరింత తేలికవుతుందనే కోణంలో.. ఎప్పటినుంచో ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి. ఆ ప్రయోగాల్లో కొన్ని సఫలం కాగా, కొన్ని విఫలమయ్యాయి. భారత అణు ప్రయోగాలు – అమెరికా ఆంక్షల నేపథ్యంలో.. జీఎస్‌ఎల్‌వీ రాకెట్ – అందులో వాడే క్రయోజనిక్ ఇంజన్ల అభివృద్ధి ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది. లేదంటే, ఈపాటికే జీఎస్‌ఎల్‌వీ నుంచి లెక్కకు మిక్కిలిగా ప్రయోగాలు జరిగి వుండేవే.
ఎలాగైతేనేం, తాజా ప్రయోగంతో మరోమారు జీఎస్‌ఎల్‌వీ తన సత్తాని చాటుకుంది. ఇప్పటికీ ఇస్రో దృష్టిలో జీఎస్‌ఎల్‌వీ రాకెట్ 'నాటీ బాయ్'గానే కీర్తింపబడ్తోంది. చిన్న చిన్న సమస్యల నుంచి, ప్రయోగాలు విఫలమయ్యేదాకా 'నాటీబాయ్' చుట్టూ అనేక అనుమానాలైతే ఇంకా అలాగే వున్నాయి. అనుమానాలతోపాటే విజయాలూ జీఎస్‌ఎల్‌వీ ప్రత్యేకతను చాటి చెబుతున్నాయి.
2211 కిలోల బరువైన ఇన్‌సాట్ 3డిఆర్ శాటిలైట్ తాజాగా నేడు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా దూసుకుపోయింది. ప్రయోగానికి ముందు చిన్నపాటి సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా ప్రయోగంపై అనుమానాలు తలెత్తాయి. 'నాటీబాయ్' ఇబ్బంది పెడతాడేమోనని ఆందోళపడిన శాస్త్రవేత్తలు, విజయవంతంగా ఆ సమస్యను అధిగమించగలిగారు. దాంతో, నిర్ణీత సమయంలో, నిర్ధారిత కక్ష్యలోకి ఉపగ్రహం చేరుకోవడంతో ఇస్రో వర్గాలు ఆనందోత్సాహాల్లో మునిగితేలాయి. ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పలువురు రాజకీయ ప్రముఖులు ఈ సందర్భంగా ఇస్రోని ప్రశంసలతో ముంచెత్తారు.
అతి బరువైన ఉపగ్రహాల్ని అవలీలగా నింగిలోకి తీసుకెళ్ళే జీఎస్‌ఎల్‌వీ ముందు ముందు మరిన్ని విజయాల్ని అందుకోవాలనీ, అంతరిక్ష రంగంలో ఇస్రో మరింతగా దూసుకుపోవాలని ఆశిద్దాం.