ఎమ్బీయస్‌: YM: ఎకానమీ డ్రైవ్‌ – 4/2

డిసెంబరు 15 న జిమ్‌ శాఖలో సమావేశం జరిగింది. అప్పటికి రెండు వారాలుగా ఫ్రాంక్‌ ఊరంతా చెడతిరిగేసి, బోల్డు సమాచారం మోసుకొచ్చాడు.   అది పెట్టుకుని హంఫ్రీ తాట తీద్దామని ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాడు.…

డిసెంబరు 15 న జిమ్‌ శాఖలో సమావేశం జరిగింది. అప్పటికి రెండు వారాలుగా ఫ్రాంక్‌ ఊరంతా చెడతిరిగేసి, బోల్డు సమాచారం మోసుకొచ్చాడు.   అది పెట్టుకుని హంఫ్రీ తాట తీద్దామని ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాడు. సమావేశం మొదట్లోనే జిమ్‌ ''మన డిపార్టుమెంటులోనే పొదుపు చేయడానికి ఎంతో ఆస్కారం వుందని మా అధ్యయనంలో తేలింది.'' అన్నాడు హంఫ్రీ కేసి సూటిగా చూస్తూ. హంఫ్రీ ఆందోళన కనబరచాడు. జిమ్‌ విజయగర్వంతో ''ముందుగా బిల్డింగుల సంగతి చూద్దాం. …చాడ్విక్‌ హౌస్‌..'' అని మొదలుపెట్టాడు. 

''పేద్ద బిల్డింగు, ఉద్యోగులు చూడబోతే గుప్పెడు..'' అన్నాడు ఫ్రాంక్‌.

''ప్రస్తుతానికి చాలా ఖాళీగా వున్నమాట నిజమే. కానీ కొత్తగా పెట్టబోయే ఎన్వైర్‌మెంట్‌ కమిషన్‌కు అక్కడే చోటు చూపిద్దామనుకుంటున్నాం. అప్పుడు అది సరిపోతుందో లేదోని భయంగా వుంది.'' అన్నాడు హంఫ్రీ. 

అలాగే లేడీస్మిత్‌ బిల్డింగ్‌ ఖాళీగా వుందని ఒప్పుకుంటూనే అది దేశరక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మాట్లాడనన్నాడు. వెల్లింగ్టన్‌ హౌస్‌లో బీరువాలు తప్ప స్టాఫ్‌ ఎక్కువగా లేరన్నదానికి ఫైర్‌ ఎస్కేప్‌ లేదన్న కారణంగా ఉన్న స్టాఫ్‌కు మించి ఎక్కువమందిని అక్కడకు తరలించడం ప్రమాదకరం అన్నాడు. ''అగ్నిప్రమాదం జరిగితే పారిపోయే అవకాశం లేనివిధంగా కట్టిన బిల్డింగుకు మరమ్మత్తులు చేసి, ఆ ఏర్పాటు చేయవచ్చు కదా'' అని జిమ్‌ అడిగితే ''అది లిస్టెడ్‌ బిల్డింగ్‌. ఏదైనా మార్పులు చేయడానికి పర్యావరణ చట్టం ఒప్పుకోదు' అన్నాడు. ''పోనీ అమ్మేస్తే..?'' అంటే ''ఎవరూ కొనుక్కోరు'' అన్నాడు. మరో బిల్డింగ్‌ పేరు చెపితే 'దాన్ని బిల్డింగ్‌ పర్మిషన్‌ తీసుకోకుండా కట్టారు, అదీ ఎవరు కొనరు' అన్నాడు. 

ఏ బిల్డింగ్‌ పేరు చెప్పినా ఠక్కుఠక్కున హంఫ్రీ దాని గురించిన సమాచారం వల్లిస్తూండడంతో ఫ్రాంక్‌కు అనుమానం వచ్చేసింది. ''నేను ఎక్కడెక్కడికి వెళ్లి ఏయే బిల్డింగులను పరీక్షించి వచ్చానో యీయనకు తెలుసు.'' అని అరిచాడు.

హంఫ్రీ నిర్మొగమాటంగా ఒప్పుకున్నాడు. ''నిజమే, ఏం? ఈయనేమైనా గూఢచర్యం చేస్తున్నాడా? మేం తెలుసుకోకూడదా? పైగా జిమ్‌గారి ఆదర్శం పాలనలో పారదర్శకత కదా'' అని అడిగాడు. 

జిమ్‌ ఏమీ అనలేక ''సరే మాన్‌పవర్‌ విషయంలో జరుగుతున్న వృథావ్యయం గురించి చూద్దాం. సండర్‌లాండ్‌లో వున్న 90 మంది ఉద్యోగులు వైట్‌హాల్‌లో వున్న 90 మంది ఉద్యోగుల పనే చేస్తున్నారు. ఈ డూప్లికేషన్‌ వేస్టు.'' అన్నాడు.

హంఫ్రీ నిస్సంకోచంగా ఒప్పుకున్నాడు. ''కానీ అది మంత్రివర్గ నిర్ణయం. ఈశాన్యప్రాంతాల్లో ఉద్యోగాలకల్పన పథకంలో భాగంగా యిచ్చారు.''

హంఫ్రీ ఒప్పుకోవడంతో జిమ్‌ ఉత్సాహంగా ''అది పాత కాబినెట్‌ నిర్ణయం. మనం ఒక్క స్ట్రోక్‌తో 90 ఉద్యోగాలు తీసేద్దాం'' అని అరిచాడు.

''..ఒక్క స్ట్రయిక్‌తో అంటే కరక్టుగా వుంటుందేమో'' అని సవరించాడు హంఫ్రీ.

''అదేం?'' తెల్లబోయాడు జిమ్‌.

''ఒక వెనకబడిన ప్రాంతంలో, రాజకీయంగా సున్నితమైన నియోజకవర్గంలో ఉద్యోగకల్పన పథకం కింద యిచ్చిన ఉద్యోగాలను వెనక్కి లాక్కుంటే సమ్మె ఖాయం. దాన్ని ఎదుర్కోవాలంటే చాలా ధైర్యమే వుండాలి.'' అని హంఫ్రీ వూరుకున్నాడు.

జిమ్‌కి ఏం చేయాలో పాలుపోలేదు. దాంతో కాస్సేపు మౌనం రాజ్యమేలింది. కాస్సేపు పోయాక హంఫ్రీ నెమ్మదిగా ''మనం బిల్డింగుల వంటి భారీ వాటి గురించి ఆలోచించే బదులు చిన్నచిన్న ఖర్చులు తగ్గిస్తూ పోతే కనబడకుండానే చాలానే ఆదా అవుతుంది. ఉదాహరణకి, కార్లు, ఫర్నిచర్‌, వ్యక్తిగత సిబ్బంది, జిరాక్సు మెషిన్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌..'' అంటూ ఏదో గుర్తుకు తెచ్చుకుంటున్నట్లు ఒక్కొక్కటి ఉచ్చరించాడు.

జిమ్‌కు ఉత్సాహం తిరిగి వచ్చింది. ''ఇదేదో బాగున్నట్లుంది.'' అని ప్రోత్సహించాడు.

''కానీ మనం ఆచరించి చూపకుండా యితరులను ఆదా చేయమంటే బాగుండదేమో'' అని హంఫ్రీ సందేహించాడు. 

జిమ్‌ గాలానికి చిక్కుకున్నాడు. ''మనమే చేసి చూపిద్దాం. రేపణ్నుంచి నాకు కారు వద్దు, డ్రైవర్ని కూడా తీసేయండి. మన ఆఫీసులో స్టాఫ్‌ సగానికి సగం మందిని తీసేయండి.'' అని ఆదేశాలు జారీ చేసేశాడు.

హంఫ్రీ మెచ్చుకోలుగా చూశాడు. ''మీ చిత్తశుద్ధికి జోహారు. తక్కినవాటి మాట ఎలా వున్నా దీనికి చాలా పబ్లిసిటీ వస్తుంది. 'ఆచరించి ప్రవచిస్తున్న జిమ్‌' అనే కాప్షన్‌తో పేపర్లో హెడ్‌లైన్స్‌ కూడా రావచ్చు.'' అన్నాడు.

 ********
ఆచరణకు వచ్చేసరికి ఆదా చేయడంలో కష్టాలు జిమ్‌కు తెలిసి వచ్చాయి. కారు వద్దన్నాడు కాబట్టి రైలు పట్టుకుని ఎప్పుడో అర్ధరాత్రి యిల్లు చేరాడు. టాక్సీ కోసం ప్రయత్నించాడు కానీ వర్షం వలన ఏదీ దొరకలేదు. చదవడానికి యిచ్చిన మూడు ఎఱ్ఱ బాక్సులు మోసుకుని ట్యూబ్‌లో ఎక్కడం కష్టమై పోయింది. రెండు రైళ్లు మిస్సయితే కానీ ఏదీ దొరకలేదు. ఇల్లు చేరేటప్పటికి చచ్చేచావైంది. భార్య పడుక్కుని నిద్రపోతోంది. ఆలస్యం ఎందుకైందో చెప్తో మండిపడింది. ''ఈ సౌఖ్యాల కోసం 20 ఏళ్లపాటు కలవరించి, అవి చేతికి అందినప్పుడు యీ తిక్క వేషాలేమిటి? మంత్రి అయితే ట్యూబ్‌లో వస్తున్నారు. కొంపదేసి రేపు ప్రధాని అయినప్పుడు ఏం చేస్తారు? ఎవణ్నయినా లిఫ్ట్‌ అడిగి వస్తారా?'' అని దులిపేసింది. 

కారు లేకపోతే కష్టాల మాట ఎలా వున్నా ఆఫీసులో సిబ్బంది సగానికి సగం తగ్గించేయడంతో పెద్ద ఉపద్రవం వచ్చిపడింది. ఒక్కోళ్లు రెండేసి బాధ్యతలు ఒకేసారి చేయవలసి వస్తోంది. జిమ్‌ ఎపాయింట్‌మెంట్స్‌ చూడవలసిన బెర్నార్డ్‌ ఓ రోజు వేరే చోటకి వెళ్లవలసి వచ్చింది. ఆ సమయంలో నార్త్‌ ఈస్ట్‌ ప్రాంతపు మ్యాన్‌పవర్‌ ప్లానింగ్‌ శాఖకు చెందిన మ్యాక్‌ అనే అధికారి ఎపాయింట్‌మెంట్‌ తీసుకున్నాడు. అతనూ పొదుపు చర్యల్లో భాగంగా రైలు ఎక్కబోయి, అది మిస్సయి, ఎపాయింట్‌మెంట్‌ టైముకి రాలేకపోయాడు. 

సరిగ్గా అదే సమయానికి రాన్‌ వాట్సన్‌ అనే అతను ఎపాయింట్‌మెంట్‌ లేకుండా వచ్చాడు. బెర్నార్డ్‌ అయితే వచ్చినవాడు మ్యాక్‌ కాదని గుర్తించగలిగేవాడు. కానీ అతను ఎపాయింట్‌మెంట్లు చూసే పని టైపిస్టుకి అప్పగించి వెళ్లిపోయాడు. టైపిస్టుకి అతనెవరో తెలియదు కాబట్టి ఎపాయింట్‌మెంట్‌ అడిగినవాడు యితనే అయి వుంటాడనుకుని వాట్సన్‌ను లోపలకి పంపించేసింది. జిమ్‌ అంతకుముందు మ్యాక్‌ను చూడకపోవడం చేత వచ్చినవాడు మ్యాన్‌పవర్‌ ప్లానింగ్‌ మనిషే అనుకుని ఉత్సాహంగా 'సిబ్బంది తగ్గించేందుకు నేను కొన్ని ఉపాయాలు చెప్తాను, విను' అంటూ చెప్పుకుపోసాగాడు.

అయితే వచ్చిన వాట్సన్‌ 'సివిల్‌ సర్వీసెస్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ అసోసియేటెడ్‌ గవర్నమెంట్‌ వర్కర్స్‌ యూనియన్‌'కు జనరల్‌ సెక్రటరీ. జిమ్‌ శాఖలో డ్రైవర్లను తీసివేయడం గురించి నిరసన తెలపడానికి వచ్చాడు. కానీ అతను నోరెత్తకుండానే జిమ్‌ తను యింకా ఎంతమంది డ్రైవర్లను తీసేయబోతున్నాడో చెప్పసాగాడు. ఈ ముక్క యూనియన్‌ వాళ్లకు పొక్కకుండా చూడమన్నాడు. 

అంతా విని వాట్సన్‌ 'మరి యూనియన్‌ వాళ్లతో చర్చించకుండానే యింత తీవ్రమైన చర్యలు చేపడతారా?' అని అడిగాడు.

'చర్చలు జరుపుతాం. జస్ట్‌ కంటితుడుపుకే. ఉత్తుత్తినే. నీకు తెలుసుకదా యూనియన్‌ లీడర్లవి మట్టిబుర్రలు, ఆవేశం తప్ప ఆలోచన వుండదు. మన ఉద్దేశాలు పసిగట్టలేరు.'' అంటూ యింకా అవాకులు చవాకులు మాట్లాడాడు. 

''మరి డ్రైవర్ల మాటేమిటి?'' అడిగాడు వాట్సన్‌.

''అందరి కంటె ముందు పీకేసేది వాళ్లనే! ఇప్పటికే సగం పీకేశాం. కార్లు, డ్రైవర్ల మీద ఎంత తగలేస్తున్నామో తెలుసా?'' అన్నాడు జిమ్‌.

ఆ దశలో వాట్సన్‌ చెప్పాడు – తనెవరో! ''డ్రైవర్లను తీసేస్తారన్న పుకారు ఎంతవరకు నిజమో కనుక్కుందామని వచ్చాను. మీరు కావలసినదాని కంటె ఎక్కువ సమాచారమే యిచ్చారు'' అని వెళ్లిపోయాడు.

వెళ్లి ఓ పత్రికకు యింటర్వ్యూ యిచ్చి యిదంతా బయటపెట్టాడు. వెంటనే డ్రైవర్ల సమ్మె ప్రారంభమైంది.

 **********
క్రిస్‌మస్‌ నాడు ఫ్రెంచ్‌ ఎంబసీలో పార్టీకి భార్యను తీసుకెళ్లవలసిన జిమ్‌కు యీ సమ్మెతో మహా అవస్థ వచ్చిపడింది. భార్య కారుకి మరమ్మత్తు చేయించవలసి వుంది. కానీ దానికి టైము లేదు. ఏదో కాస్త రిపేరు చేసి యిద్దరూ బయలు దేరారు. దారిలో విపరీతమైన ట్రాఫిక్‌. కుండపోతగా వర్షం. కారు ఆగిపోయింది. జిమ్‌ దిగి మరమ్మత్తు చేయబోయాడు. భార్యకు ఒళ్లు మండిపోయింది. 'నువ్వూ నీ పొదుపూ' అని తిట్టి, ఉన్న ఒక్క గొడుగూ తను వేసుకుని పార్టీకి వెళ్లి పోయింది. కారుతో తంటాలు పడి, ఎలాగోలా స్టార్ట్‌ చేయించుకుని జిమ్‌ పార్టీకి లేటుగా చేరాడు – అదీ తడిసి ముద్దయి! 

విపరీతంగా తడిసిపోవడంతో కాస్త వేడిగా వుంటుందని షాంపేన్‌ కాస్త బాగానే పుచ్చుకున్నాడు. పార్టీ తర్వాత బయటకు వచ్చి కోటు జేబులోంచి కారు తాళంచెవులు తీస్తూంటే జారి పక్కన మురికినీరు పోయే చట్రం ద్వారా లోపల పడిపోయింది. ఇక తప్పక బోర్లా పడుక్కుని దానిలోంచి తాళం చెవికోసం వెతకసాగాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ప్రెస్‌ ఫోటోగ్రాఫరు టక్కున ఫోటో తీసేసి మర్నాటి పేపర్లో వేసేశాడు – పైన 'మిస్టర్‌ ఎకానమీ ఫాల్స్‌ డౌన్‌ యిన్‌ గట్టర్‌ ఆఫ్టర్‌ షాంపేన్‌ పార్టీ' (మందు పార్టీ తర్వాత మురికిగుంటలో పడ్డ పొదుపుశ్రీ) అని శీర్షిక పెట్టాడు. 

మర్నాటి పేపర్లో యిది చూసి బెంగ పెట్టుకున్న జిమ్‌కు యింకో పేపర్లో మరో వార్త చూసి యింకా బెంగపడ్డాడు. ''హ్యాకర్‌ తన శాఖలో 400 మంది కొత్త ఉద్యోగులను వేసుకుంటున్నాడు' అనే వార్త అది. అది డ్రైవర్లను మరీ మండించింది. ఆదా పేర ఓ పక్క మమ్మల్ని బయటకు పంపేస్తూ కొత్తవాళ్లని ఎలా వేసుకుంటున్నారు? అని వాళ్లు ప్రశ్నలు సంధించారు. జిమ్‌ ఆఫీసుకి వస్తూనే హంఫ్రీని పిలిచి 'ఈ నాలుగు వందలమందిని ఎవరు వేశారు?' అని అడిగాడు.

హంఫ్రీ అమాయకంగా మొహం పెట్టి 'మీ ఆదేశాల మేరకే వేశామండి' అన్నాడు.

'నేనెక్కడ చెప్పాను?'

'ఆదా చేసే విధానాలపై అధ్యయనం చేయించమన్నారు కదా, చేయడానికి మనుష్యులు కావద్దా?'

అప్పటికే రకరకాలుగా మతి పోయి వున్న జిమ్‌కి మరీ మతిపోయింది. 'ఇప్పుడేం చేద్దామంటావ్‌? అని అడిగాడు.

''మీరు పొదుపు కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని, అధ్యయనం మాట ఎత్తకపోతే యీ నాలుగు వందల వుద్యోగాలూ ఆదా చేయవచ్చు. ఆ వాచ్‌డాగ్‌ డిపార్టుమెంటు మూసేస్తే యింకో నాలుగు వందల మందిని యింటికి పంపవచ్చు. మన శాఖలో మొత్తం 800 మందిని తగ్గించి పొదుపు చేసినట్లు రేపు పేపర్లో వచ్చేట్లు చూడవచ్చు.''

ఉద్యోగాలు వేయకుండానే తీసేసి, పొదుపు చేసినట్లు చెప్పుకోవడమా? అని జిమ్‌ సంకోచించలేదు. అలాగే చేద్దాం అంటూనే 'నా అత్మతృప్తికి నిజంగా కొంతైనా ఆదా చేయాలి' అన్నాడు కాస్త ప్రాధేయపడుతున్న స్వరంతో.

హంఫ్రీ చాలా ఉదారంగా ''టీలు అందించే ఒకళ్లిద్దరు అమ్మాయిలను తీసేయవచ్చు, మినిస్టర్‌'' అన్నాడు. (నాల్గవ కథ సమాప్తం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2016) 

mbsprasad@gmail,com

Click Here For Archives