మా హీరో రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 15 కోట్లు. ఓసోస్, మా హీరో రెమ్యునరేషన్ అయితే 20 కోట్లు. ఆగవోయ్, మా హీరో ఓ సినిమాకి అందుకునే రెమ్యునరేషన్ 25 కోట్లు. ఇలా ఆయా హీరోలు చెప్పుకవడం ఓ ఎత్తు, సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్ల గురించి బయట జరుగుతున్న ప్రచారం ఇంకో ఎత్తు. అసలు సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్ల తీరు మరో ఎత్తు.
నిప్పు లేకుండా పొగ అయితే రాదు. ఇది నిజం. మరీ, జరుగుతున్న ప్రచారం స్థాయిలో కాకపోయినా, కాస్త అటూ ఇటూగా అంతే లెక్కల్లో రెమ్యునరేషన్లని కొందరు పెద్ద హీరోలు అందుకున్న మాట వాస్తవం. హీరోలు మాత్రమే కాదు, దర్శకులూ హీరోలతో పోటీ పడి కోట్లు వెనకేసుకుంటున్నారు. నిర్మాతల్ని హీరోలు ముంచేయడం మాటెలా వున్నా, దర్శకులు కూడా ముంచేస్తున్న వైనం గురించి ఇటీవల టాలీవుడ్‌లో జరిగిన గొడవలే ప్రత్యక్ష నిదర్శనం.
'ఫలానా నిర్మాత నాకు డబ్బులివ్వలేదు..' అని ఓ దర్శకుడు రచ్చకెక్కడం, 'నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చి, మీ తదుపరి సినిమా షూటింగ్ చేసుకోగలరు..' అంటూ ఓ హీరో, నిర్మాతకి అల్టిమేటం జారీ చేయడం.. ఇలాంటివి ఈ మధ్యకాలంలో బాగానే తెరపైకొస్తున్న సంఘటనలు. బాలీవుడ్‌లో అయితే, నటీనటుల రెమ్యునరేషన్‌కి ఆకాశమే హద్దు. అందుకే, విదేశీ సంస్థలు.. భారత సినీ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుని, ఇప్పుడు మొహం చాటేస్తున్నాయి. తాజాగా డిస్నీ ఇండియా, సినిమాల్ని ఇకపై నిర్మించబోమంటూ తేల్చి చెప్పింది.
బాలీవుడ్‌లో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించాడు. 'హీరోలు వారి రేంజ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అందుకే ఇండియన్ సినిమా ఇకపై తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది..' అని నిర్మొహమాటంగా వ్యాఖ్యానించాడాయన. కోలీవుడ్‌లోనూ ఈ తరహా ట్రెండ్ వున్నా అక్కడ కాస్త బెటర్. టాలీవుడ్‌లోనే పరిస్థితి రోజురోజుకీ ముదిరి పాకాన పడ్తోంది.
50 కోట్లతో సినిమా తెరకెక్కించడం వరకూ బాగానే వున్నా, నిర్మాతకి ఏమాత్రం 'మిగులు' కన్పించడంలేదు. హీరోల స్థాయిలో కాకపోయినా, నిర్మాతల్ని హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్‌తో బాగానే వేపుకు తింటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద నిర్మాతలు ఈ రెమ్యునరేషన్ల గోల భరించలేక, సినిమాలు తీయడం మానేసుకుంటున్నారు కూడా. తమ బ్యానర్ వాల్యూ నేపథ్యంలో కొత్త నిర్మాతలతో కలిసి జాయింట్ వెంచర్స్ చేసుకుంటున్నారంతే.
కొత్తగా సినీ నిర్మాణంలో హీరోలు భాగం పంచుకోవడం వరకూ కాస్త బెటర్. ఇక్కడా, నిర్మాతలే బాధితులుగా మారుతున్నారనీ, హీరోలు ముందస్తుగా జాగ్రత్తపడిపోతున్నారనీ గుసగుసలు విన్పిస్తున్నాయి. ఏమో, ఈ రెమ్యునరేషన్ల మాయేంటోగానీ, భవిష్యత్తులో తెలుగు సినిమా అనే కాదు.. మొత్తం భారతీయ సినిమానే ఈ రెమ్యునరేషన్ల పుణ్యమా అని వెలవెలబోయే పరిస్థితులొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.