'జీఎస్టీ అమల్లోకి వస్తోంది కదా.. ప్రత్యేక హోదాతో ఉపయోగం లేదు.. ఆ ప్రత్యేక హోదాకి మించి, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వబోతున్నాం.. పేరు మార్పు మాత్రమే..'
– ఇదీ కేంద్రం మాట. టీడీపీ మాట కూడా దాదాపు ఇదే. 'కోడలు మగబిడ్డను కనిస్తానంటే ఏ అత్త అయినా ఒప్పుకోకుండా వుంటుందా.?' అని గతంలో చంద్రబాబు సెలవిచ్చారు. ఆడ బిడ్డ, మగ బిడ్డ మీద.. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారికి ఇంత గొప్ప అభిప్రాయం వుంది మరి.
ప్రత్యేక ప్యాకేజీ ఏమీ సంజీవని కాదు.. అంటూ కేంద్రాన్ని దాదాపు రెండున్నరేళ్ళు చంద్రబాబే కాపాడారు. చంద్రబాబు ఇంతలా సన్నాయి నొక్కులు నొక్కుతోంటే కేంద్రమెందుకు దిగొస్తుంది.? పవన్‌కళ్యాణ్ ప్రశ్నించాడనో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందనో, జాతీయ స్థాయిలో అన్ని పార్టీల్నీ ఏకం చేసి, కాంగ్రెస్ తమపై తిరగబడ్తుందనో.. కారణం ఏదైతేనేం, కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రత్యేక ప్యాకేజీ పల్లవి అందుకుంది.
మరి కాస్సేపట్లో ఈ ప్యాకేజీ సంగతేంటో తేలుతుందట. ఈలోగా 'పచ్చ' ప్యాకేజీ ఒకటి తెరపైకొచ్చింది. ఆ ప్యాకేజీ ఎలా వుందంటే, 'బిచ్చమేస్తున్నాం.. మీకు ఇష్టమున్నా, లేకపోయినా తీసుకోవాల్సిందే..' అన్నట్లుగానే వుందది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోక ముందునుంచీ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తోంది ఉత్తరాంధ్ర. అప్పటి కేంద్ర మంత్రి పురంధరీశ్వరిపై అప్పట్లో తీవ్రస్థాయిలో ఒత్తిడి కూడా పెరిగింది.
రాష్ట్ర విభజన జరిగితే తప్ప, రైల్వే జోన్ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కాలేదు. విభజన చట్టంలో రైల్వే జోన్ అంశాన్ని ఎలాగైతేనేం ప్రస్తావించారు. దాన్నిప్పుడు, విజయవాడకి కట్టబెట్టాలని కేంద్రం భావిస్తోంది. కాదు కాదు, అధికార తెలుగుదేశం పార్టీ, వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని చంపేస్తోంది. అవును నిజం, విశాఖలో కాదు.. విజయవాడలో రైల్వే జోన్ కావాలంటూ తొలుత నినదించింది (రాష్ట్ర విభజన తర్వాత) తెలుగుదేశం పార్టీ నేతలే.
విజయవాడ రైల్వే జోన్‌కి కారణాలేంటో తెలుసా.? ఒరిస్సా ఒప్పుకోవడంలేదట. నాన్సెన్స్ కాకపోతే ఏంటిది.? 13 జిల్లాల సీమాంధ్ర ఒప్పుకుంటేనే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందా.? ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని దేశమంతా నినదిస్తోంది. రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశాయి మరి.
హోదా వేరు, ప్యాకేజీ వేరు. హోదాకి మించిన ప్యాకేజీ.. అనడమే ఓ భూటకం. ప్రత్యేక హోదా అనేది ఓ హక్కు. దానికి చట్టబద్ధత వుంటుంది. ప్యాకేజీకి చట్టబద్ధత అనేది వుండదు. కేంద్రంలో నిధుల లభ్యతను బట్టి.. అనే ముక్తాయింపు ఎలాగూ వుంటుంది. హోదాతోపాటు రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, రాజధాని.. ఇవన్నీ విభజన హామీలు. ప్యాకేజీ విషయానికొస్తే అన్నీ అందులో కలిపేస్తారు. అదీ తేడా. ప్యాకేజీ పేరు చెబితే లక్షల కోట్ల ఫిగర్ కన్పిస్తుంది. రాజకీయంగా అది కలిసొస్తుంది. అదీ కేంద్రం కుట్ర. ప్యాకేజీ తీసుకుంటే బొక్కేయొచ్చు.. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ కుట్ర.
షరామామూలుగానే పచ్చ మీడియా ప్యాకేజీకి వంత పాడుతున్నాయి.. ఆ పాపంలో, పచ్చ మీడియా వాటా ఎంతో మరి.!