ఓ కన్నడ సినిమా తెలుగులో.. అత్యంత భారీ స్థాయిలో.. ఇంతకు ముందెన్నడూ లేనంత రేంజ్లో.. హంగామా చేయనుంది. అదే 'జాగ్వార్'. కన్నడ రాజకీయ ప్రముఖుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన కుమారుడు నిఖిల్ కుమార్ గౌడ హీరోగా తెరకెక్కిస్తున్న 'జాగ్వార్' సినిమాకి తెలుగులోనూ హైప్ తెచ్చేందుకు పడ్తున్న పాట్లు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. పది కాదు, పాతిక కాదు.. ఏకంగా 75 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కిందట.
సినిమా ఎన్ని కోట్లతో తెరకెక్కింది కాదన్నయ్యా.. ఎన్ని కోట్లతో పబ్లిసిటీ చేశామన్నదే ముఖ్యం.. అన్నట్లుగా, సినిమాకి పబ్లిసిటీ చేయనున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక కోసం కూడా కనీ వినీ ఎరుగని స్థాయిలో ఖర్చు చేయనున్నారట. తమిళ, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులే కాకుండా, రాజకీయ ప్రముఖులూ ఈ వేడుకలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే, కుమారస్వామి – పవన్‌కళ్యాణ్ ఆశీస్సుల కోసం హైద్రాబాద్‌కి వచ్చి, ఏకంగా పవన్ సోదరుడిగా తన కుమారుడ నిఖిల్‌ని ప్రకటించేసిన విషయం విదితమే. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తదితరులతోనూ త్వరలో సమావేశం కానున్నారట కుమారస్వామి. అదే సమయంలో, పలువురు తమిళ సినీ ప్రముఖులతోనూ కుమారస్వామి మంతనాలు జరుపుతున్నారు.
కుమారస్వామి కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. కుమారస్వామి తండ్రి, హెచ్డి దేవెగౌడ, భారత ప్రధానిగా పనిచేసిన విషయం విదితమే. రాజకీయాల్లో అపారమైన అనుభవం, పరిచయాలు.. ఇవన్నీ కలగలిపి, తన కుమారుడి తెరంగేట్రం, పొలిటికల్ తెరంగేట్రంలా అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నది కుమారస్వామి ఆలోచన. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మన రాజమౌళి శిష్యుడు మహదేవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం గమనార్హం.