హీరోలకు సినిమాల హిట్ కన్నా రికార్డులు బద్దలు కొట్టడం కీలకం అయిపోయింది ఇప్పుడు. తమ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది..అన్ని రికార్డులు బద్దలు కొట్టింది అని చెప్పుకోవడం ఫ్యాషన్ గా మారింది. మొన్నటికి మొన్న సరైనోడు సినిమా అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. అదిగో ఫిగర్ అంటే ఇదిగో రికార్డు అనేస్తున్నారు. అంతే కానీ అసలు ఫిగర్లు ఎవరికీ తెలియవు. ఎందుకంటే ఆ లెక్కలు కేవలం డిస్ట్రిబ్యూటర్ల దగ్గర, నిర్మాత దగ్గర పదిలంగా వుంటాయి.
సరైనోడు వ్యవహారాలు అన్నీ గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో పదిలంగా వుంటాయి. వాళ్లు ఏవీ ఇవీ ఫిగర్లు అని అఫిషియల్ గా ప్రకటిస్తారా? వారే కాదు ఎవరు ప్రకటించరు. ఏటా బ్యాలెన్స్ షీట్ లో చూపించే ఫిగర్లు వేరుగా వుంటాయి. థియేటర్ల డిసిఆర్ ల ఆధారంగా వచ్చే ఫిగర్లు వేరుగా వుంటాయి. సో, గీతా కాంపౌండ్ అన్నది ఇతరులకు విషయాలు తెలియకుండా దాచడంలో నెంబర్ వన్ కాబట్టి ఎవరికీ అసలు లెక్కలు తెలియవు.
ఇక ఇప్పడు జనతా గ్యారేజ్ విడుదలయింది. ఈ సినిమా బయ్యర్లు దాదాపుగా అందరూ ఎన్టీఆర్ లేదా కొరటాల శివ లాయలిస్టులే. అందువల్ల వారు ఏ ఫిగర్లు అంటే ఆ ఫిగర్లే కన్ ఫర్మ్. అలా అని కలెక్షన్లు అని కాదు. ఉన్నాయి. కానీ ఇస్తున్న ఫిగర్లు అన్నీ కరెక్టేనా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంఫుల్ కృష్ణ, గుంటూరు కొన్న సుధాకర్ నేరుగా దర్శకుడు కొరటాల శివకు మంచి మిత్రుడు. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ తో సినిమా తీయాలని ఫిక్స్ అయినవాడు.
అలాగే ఈస్ట్ కొన్న భరత్ ఎన్టీఆర్ కు సన్నిహితుడు. ఇంకా మిగిలిన చాలా మంది ఇలాంటి వాళ్లే. అందువల్ల ఓ కోటి ఇటు అయినా అటు అయినా ఓకె. సో. రికార్డులు బద్దలు కొట్టడానికి ఓ కొత్త మార్గం దొరికింది. అందుకే చిరంజీవి 150 వ సినిమా విషయంలో కూడా ఇదే స్ట్రాటజీ అమలు చేయాలని అనుకుంటున్నారట.
సినిమాను అమ్మకుండా నేరుగా గీతా ద్వారా విడుదల చేయిస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నారట. లేదా కనీసం నైజాం, కృష్ణా, ఈస్ట్, వైజాగ్ లాంటి కీలక ఏరియాలు గీతా లేదా గీతాకు సన్నిహితమైన డిస్ట్రిబ్యూటర్లకే ఇవ్వాలని చూస్తున్నారట. అంటే ముందుగానే ఎంతకు అమ్మారు అంటే అంతకే అమ్మారు అని చెప్పొచ్చు. అమ్మకాల్లోనే ముందు రికార్డు కొట్టేయచ్చు. ఆపైన కలెక్షన్ల కూడా అంతే. ఎంత విడుదల చేస్తే అంతే అని చెప్పుకోవచ్చు.
నిజానికి ఇది బన్నీ, లేదా ఎన్టీఆర్ లేదా చిరు సినిమాల సమస్య కాదు. దాదాపు పెద్ద సినిమాలు, పెద్ద హీరోల అందరి సమస్య. అభిమానుల కోసమైనా, ఇలా ఏదో ఒకటి చేసి రికార్డులు సృష్టించక తప్పడం లేదని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. ఒక్క ఓవర్ సీస్ దగ్గర మాత్రమే లెక్కలు పక్కాగా బయటకు వస్తున్నాయి. మిగిలినవి ఎవరుఎంత చెబితే అంతే.