మన దగ్గర వివాహ వేదికలు ఎలా నడుస్తున్నాయో చూస్తున్నాం. ఫలానా కులం వారి వివాహ వేదిక అని పత్రికలో యాడ్ వస్తుంది. అక్కడకు ఆడ, మగ పిల్లల తలిదండ్రులు చేరతారు. తమ పిల్లల వివరాలు ప్రకటిస్తారు. నచ్చితే సంప్రదింపులు జరుపుతారు. కొన్ని సందర్భాల్లో అది పెళ్లి చూపులకు, పెళ్లికి కూడా దారి తీస్తుంది. ఇటీవలి కాలంలో యీ వేదికలకు వచ్చేవారిలో మగపిల్లల తలిదండ్రులు ఎక్కువగా వుంటున్నారు. ఆడపిల్లలు 'ఇప్పుడే కాదు' అనడం, సంబంధం తెచ్చి చూపినా ఎటూ తేల్చకపోవడం వలన వాళ్ల అమ్మానాన్నా ఏం చేయాలో, ఎలా చెప్పాలో పాలుపోని పరిస్థితుల్లో పడుతున్నారు. మంచి సంబంధం చూపిస్తే ఔనంటుందేమోనన్న ఆశతో వేదికలకు వచ్చి, మగపిల్లల అమ్మానాన్నలకు ఏం చెప్పి తప్పించుకోవాలో తెలియక యిబ్బంది పడుతున్నారు. చైనాలో కూడా యించుమించు యిదే పరిస్థితిట. బీజింగులోని ఝాంగ్షాన్ పార్కులో ఆదివారమయ్యేసరికి మూడు వేల మంది ఆడ, మగ పిల్లల తలిదండ్రులు ఓ ఎ4 కాగితం మీద అబ్బాయి లేదా అమ్మాయి వివరాలు ఆరేడు లైన్లలో రాసి తమ ఎదురుగా పెట్టుకుని కూర్చుంటున్నారు. పుట్టిన సంవత్సరం, చదువు, ఉద్యోగం, పొడుగు, శరీరపు రంగు, అలవాట్లు, హాబీలు, ఇల్లు వుందా లేదా అన్న విషయం దానిలో వుంటాయి. వాళ్లకు కులం, మతం పట్టింపు లేదు కాబట్టి వాటి ప్రస్తావన వుండదు. అయితే వాళ్లకు జాతకాల పట్టింపు వుంది. ఒక్కో సంవత్సరం పుట్టినవారి లక్షణాలు ఒక్కోలా వుంటాయని వారి నమ్మకం. ఆ సంవత్సరానికి ప్రతీకగా ఓ జంతువో, పక్షో వుంటుంది. అవతలివాళ్లు పుట్టిన సంవత్సరపు జంతువుతో యిది మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూస్తారు. అంటే మన దగ్గరున్న 'యోనిపొంతన'లా అన్నమాట! 1989లో పుట్టినవాళ్ల రాశి పాము. 1990లో పుడితే గుఱ్ఱం. 1991 ఐతే గొఱ్ఱె. పాము రాశి వాళ్లు గుఱ్ఱం, గొఱ్ఱె రాశివాళ్లను చేసుకోరు. మన దగ్గర షష్టాష్టకాల పట్టింపు వున్నట్లు, అక్కడ కూడా ఆరేళ్ల గ్యాప్ వుంటే పెళ్లి విఫలమవుతుందని నమ్ముతారు. ఐదేళ్ల లేదా ఏడేళ్ల గ్యాప్ అయితే ఫర్వాలేదట.
చైనాలో ఆర్థిక సంస్కరణలు మొదలై యువతీయువకులు నగరాల బాట పట్టాకనే యీ వివాహ వేదికల సంస్కృతి వచ్చింది. నగరానికి వచ్చి, సొంతంగా సంపాదించడం మొదలుపెట్టాక అమ్మాయిలు తలిదండ్రులు చెప్పిన అబ్బాయిని గుడ్డిగా చేసుకోవడానికి సిద్ధపడటం లేరు. వారికి నచ్చినవారిని వెతికి తెచ్చే బాధ్యత కుటుంబంపై పడింది. సాంస్కృతిక విప్లవం తర్వాత ఒకరే బిడ్డ వుండాలి అని ఆంక్షలుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మగపిల్లవాళ్లనే కన్నారు. గర్భంలో వున్నది అమ్మాయి అని తెలియగానే అబార్షన్లు చేయించుకోవడం వలన యిప్పుడు అమ్మాయిలకు కరువు వచ్చింది. 20-45 వయసు గ్రూపులో 2020 నాటికి ఆడవాళ్ల కంటె మగవాళ్లు 2.40 కోట్ల మంది ఎక్కువ వుంటారని అంచనా. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రూ. 15 లక్షల దాకా కన్యాశుల్కం యిచ్చుకోవలసి వస్తోంది. అందువలన అమ్మాయిలు తమకు కావలసినది ముక్కు గుద్ది అడగగలుగుతున్నారు. పెళ్లి నాటికే అబ్బాయికి యిల్లు వుండి తీరాలని చెపుతున్నారు. బీజింగులో 60 చ.మీ.ల ఫ్లాటు అంటే కోటి నుంచి రెండు కోట్ల రూ.ల దాకా వుంటుంది. 30 ఏళ్ల వయసు లోపల అంత గడించడం అందరి వలనా సాధ్యపడే విషయం కాదు. అబ్బాయి నచ్చితే ఇల్లు లేకపోయినా చేసుకోమని అమ్మాయిని అమ్మానాన్నా పోరుతూ వుంటారు.
మావో విధానాల వలన చైనా మహిళలు విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం విషయంలో భారతీయ మహిళల కంటె చాలా ముందుకు దూసుకుపోయారు. తమ కంటె తక్కువ సంపాదించేవాణ్ని, తమ కంటికి పెద్దగా ఆననివాణ్ని పెళ్లి చేసుకోవడానికి వాళ్లు సుముఖంగా లేరు. పార్కుకి వెళ్లి సంబంధాలు చూస్తామని తల్లి అంటే ఔనని, కాదని ఏమీ అనటం లేదు. మౌనం అర్ధాంగీకారం అనుకుని వీళ్లు పార్కుకి వచ్చి వేటాడుతున్నారు. ఎవరైనా కంటికి నదురుగా కనబడితే కూతుర్ని ఒప్పించవచ్చని ఆశ. అమ్మాయిలు పెళ్లిళ్లు వాయిదా వేయడం సమాజానికి మంచిది కాదని అక్కడి మీడియా కూడా భావిస్తోంది. అందువలన పాతికేళ్లు దాటగానే పెళ్లి చేసుకోవాలని ఉద్బోధిస్తూ, 30 ఏళ్లు వచ్చేసిన అమ్మాయిలను 'మిగిలిపోయినవాళ్లు' (లెఫ్టోవరు)గా వర్ణిస్తున్నారు. అక్కడ సాధారణంగా అయిదారేళ్ల వ్యత్యాసంతో పెళ్లి చేసుకుంటున్నారు. తెల్లగా వున్నవారికి గిరాకీ ఎక్కువ. మాట్రిమోనియల్ సైట్లలో దొంగ ఐడిలు పెట్టడమూ ఎక్కువే. అందువలన యిలా పార్కులకు వెళ్లి అబ్బాయి లేదా అమ్మాయి కుటుంబాన్ని ప్రత్యక్షంగా కలవడం మంచిదే అనే అభిప్రాయంలో అందరూ వున్నారు. ఇలాటి పార్కులు బీజింగులోనే చాలా వున్నాయి. తక్కిన వూళ్లల్లో కూడా వున్నాయి. అక్కడ కనబడే జాబితాలలో చాలా ఉన్నతపదవుల్లో వున్న వధూవరులూ కనబడతారు, 40 ఏళ్లయినా పెళ్లికాని అబ్బాయిలూ కనబడతారు. చైనాకూ, మనకూ అనేక విషయాల్లో పోలికలున్నాయి. వాటిలో యిదీ వచ్చి చేరింది. (ఫోటో – బీజింగులో ఝాంగ్షాన్ పార్కులో ఓ ఆదివారం ఉదయం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)