టీచర్ అంటే ఎవరో తెలుసా.?

ఏం చేసినా అది సంచలనమయ్యేది ఒకప్పుడు. కానీ, ఇప్పుడు సంచలనాలకోసం పాకులాడుతున్నాడాయన. పరిచయం అక్కర్లేని పేరు అది. తెలుగు సినిమాకి, ఆ మాటకొస్తే ఇండియన్‌ సినిమాకి కొత్త ట్రెండ్‌ నేర్పిన దర్శకుల్లో ఖచ్చితంగా ఆయనకీ…

ఏం చేసినా అది సంచలనమయ్యేది ఒకప్పుడు. కానీ, ఇప్పుడు సంచలనాలకోసం పాకులాడుతున్నాడాయన. పరిచయం అక్కర్లేని పేరు అది. తెలుగు సినిమాకి, ఆ మాటకొస్తే ఇండియన్‌ సినిమాకి కొత్త ట్రెండ్‌ నేర్పిన దర్శకుల్లో ఖచ్చితంగా ఆయనకీ స్థానం వుంటుంది. కానీ, ఏం లాభం.? గతం ఘనం. ఇప్పుడు మాత్రం సంచలనాలకోసమే తాపత్రయం. ఇదీ ఆయన కథ. 

అవును, అతనే రామ్‌గోపాల్‌ వర్మ. దేవుళ్ళ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వర్మకి మామూలే. ఏ విషయమ్మీద అయినాసరే, తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేస్తాడు. కానీ, అన్ని సందర్భాల్లోనూ ఇది మంచిది కాదు కదా.! గురుపూజోత్సవం.. అదేనండీ 'టీచర్స్‌ డే'ని కూడా వర్మ సంచలనాలకోసం వాడేసుకున్నాడు. వర్మ వాడకం మరీ ఇంత దారుణంగా వుంటుందా.? అని సోషల్‌ మీడియానే ఆశ్చర్యపోయేలా ఆయన తనదైన పోస్టింగులతో హల్‌చల్‌ చేసేశాడు. 

టీచర్స్‌కీ.. టీచర్స్‌ చాయిస్‌కీ.. పాపం వర్మకి తేడా తెలియలేదాయె. కొత్త జనరేషన్‌ టీచర్లను నమ్ముకోవద్దనీ, గూగుల్‌ని నమ్ముకోవడం బెటరని ఉచిత సలహా ఇచ్చాడు. టీచర్‌ – గురువు అన్న ప్రస్తావనకు వెకిలి అర్థం చెప్పాడు. ఆయనగారు స్కూల్లో టీచర్లు చెప్పిన పాఠాలు నేర్చుకోలేదట, చదువుకోలేదట. నవలలు చదవాడట.. ఇంకేవేవో చదివి తెలుసుకున్నాడట. 

వర్మకి అర్థం కాని విషయమేంటంటే, గురువు అంటే స్కూల్లో పాఠాలు చెప్పేవాడు మాత్రమే కాదు. జీవితంలో ఎలా ముందడుగు వేయాలో నేర్పేవాడు. సమాజంలో మనిషిలా ఎలా బతకాలో తెలియజేసేవాడు. చదువు.. ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదు, సంస్కారవంతమైన జీవితాన్ని గడపడానికి కూడా. అది చెప్పేవాడే గురువు. ప్చ్‌, వర్మ ఏదేదో అనుకుంటున్నాడుగానీ.. సినీ రంగంలో నాకు ఫలానా వాళ్ళు రోల్‌ మోడల్‌.. అని ఆయన చెప్పుకునేవాళ్ళు కూడా గురువులే. 

ఇక, వర్మ షాకింగ్‌ పోస్టింగ్‌పై 'గురువులు' గుస్సా అయ్యారు. తమ మనోభావాల్ని కించపర్చేలా వర్మ వ్యవహరించాడంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.. కోర్టులను ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నారు. యస్‌.. వర్మకి కావాల్సింది ఇదే.!