పవన్‌కళ్యాణ్ హీరోగా దాసరి నారాయణరావు నిర్మించనున్న సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది.? ఈ విషయమై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ లేకపోయినా, సినిమా అయితే ఖచ్చితంగా వుంటుందనే సంకేతాలు దాసరి క్యాంప్ నుంచి బయటకు వస్తున్నాయి. పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దాసరికి చెందిన తారక ప్రభు ఫిలింస్ శుభాకాంక్షలు తెలిపింది. అయితే, ఇది పరమ రొటీన్ వ్యవహారమే.
వాస్తవానికి పవన్‌కళ్యాణ్‌తో సినిమా అంటే అంత ఆషామాషీ కాదు. మామూలుగానే ఏడాదికి ఓ సినిమా చేయడం కనా కష్టం పవన్‌కళ్యాణ్ విషయంలో. అలాంటిది, రాజకీయాల్లోనూ ఓ అడుగు గట్టిగానే వెయ్యాలనుకుంటున్న పవన్‌కళ్యాణ్, వరుసగా మూడు సినిమాలు చేయడమంటే అంత వీజీ కాదు. ప్రస్తుతానికైతే కిషోర్‌కుమార్ పార్దసాని (డాలీ) దర్శకత్వంలో పవన్ 'కాటమరాయుడు' సినిమా చేస్తున్నాడు. అయితే, ఇంకా ఈ సినిమా షూటింగ్‌లో పవన్ పాల్గొనాల్సి వుంది.
ఇంకో పక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ ఓ సినిమా చేస్తాడు. ఆ తర్వాతే దాసరి నిర్మాణంలో పవన్ చేసే సినిమా పట్టాలెక్కే ఛాన్స్ వుంది. 'కాటమరాయుడు' పూర్తయ్యేసరికే పవన్‌కళ్యాణ్ పూర్తిగా పొలిటికల్ మూడ్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా అంటే అనుమానమే. ఆ లెక్కన, దాసరి నిర్మాణంలో సినిమా అంటే, అది పూర్తిగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లోనే అవ్వాలి.
దాసరి, పవన్ ఓ సామాజిక వర్గానికి చెందినవారే. ఆ సామాజిక వర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్ల కోసం పోరాడుతోంది. సో, సామాజిక వర్గ సమీకరణాలు ఒక్కటయి, పొలిటికల్‌గా పవన్ – దాసరి ఒకే ఒరలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అదే జరిగితే దాసరి నుంచి పవన్‌కళ్యాణ్ హీరోగా వచ్చేది పూర్తిస్థాయి పొలిటికల్ చిత్రమే అవుతుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో.!