వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. చెరగని చిరునవ్వుకి కేరాఫ్ అడ్రస్.. అచ్చమైన తెలుగుదనానికి నిండైన పంచెకట్టులో కనిపించే వైఎస్ రాజశేఖర్‌రెడ్డే బ్రాండ్ అంబాసిడర్. కాస్సేపు రాజకీయాల్ని పక్కన పెడితే, పేదోడు ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రిలో అడుగుపెట్టి, ఖరీదైన వైద్యం చేయించుకోగలుగుతున్నాడంటే, దానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డే కారణం. ఇంజనీరింగ్, మెడిసిన్ అంటే ఒకప్పుడు డబ్బున్నోళ్ళకి మాత్రమే దొరికే చదువు. కానీ, ఇప్పుడది అందరిదీ. దానికి కారణం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే. 'కుయ్.. కుయ్.. కుయ్..' అంటే అది వెటకారం కాదు.. ప్రాణాల్ని నిలిపే అంబులెన్స్. ఎన్ని వేల, లక్షల ప్రాణాల్ని 108 అంబులెన్సులు కాపాడాయో.. ఆ ప్రాణాలన్నీ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని దైవంలా కొలుస్తాయి. చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి.
కానీ, ఇప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లేరు. ఆయన మరణించి ఏడేళ్ళు పూర్తయ్యింది. అంతా కలలా జరిగిపోయిందంతే. అసెంబ్లీ సమావేశాల్ని ముగించుకుని, హెలికాప్టర్‌లో ఆయన చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి బయల్దేరం.. అంతలోనే, ఆ హెలికాప్టర్ కుప్పకూలిపోవడం.. ఇదంతా ఇప్పటికీ ఎవరూ నమ్మలేని నిజం. అయితే, ఇది కేవలం ప్రమాదం మాత్రమేనా.? కుట్ర కోణం ఏమైనా వుందా.? ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడంలేదు.
చనిపోయింది సాధారణ వ్యక్తి కాదు. అదేమీ రోడ్ యాక్సిడెంట్ కాదు. హెలికాప్టర్ ప్రమాదం. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందంటే, దాన్ని చిన్న విషయంగా ఎలా లైట్ తీసుకోగలం.? అత్యాధునిక హంగులున్న మరో హెలికాప్టర్ అందుబాటులో వుండగా, దాన్ని పక్కన పెట్టి, పాత హెలికాప్టర్‌ని ఎందుకు వినియోగించారు.? పోనీ, సీఎం హెలికాప్టర్ ఆచూకీ గల్లంతయ్యాక.. యుద్ధ ప్రాతిపదికన ఆచూకీ కనుక్కొనే చర్యలు చేపట్టారా.. అంటే అదీ లేదు. ఎందుకిలా.?
'హెలికాప్టర్ ఎక్కడో సేఫ్ ల్యాండ్ అయ్యింది..' అనే మాట అప్పటి సీనియర్ మంత్రి కొణిజేటి రోశయ్య చెప్పుకొచ్చారు. అధికారులు చెప్పారు.. ఆయన అదే మాట మీడియాకి అధికారికంగా ప్రకటించారు. అప్పటి హోంమంత్రి, డీజేపీ.. అందరూ తాపీగానే వ్యవహరించారు.. ఏదో కాస్త మీడియా కోసం హడావిడి చేశారంతే. ముఖ్యమంత్రి హెలికాప్టర్ మిస్సయ్యిందనగానే, కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఇక్కడా 'అలసత్వమే' కనిపించింది.
నో డౌట్.. విమానం అదుపు తప్పగానే, కుప్పకూలిపోయింది. క్షణాల్లోనే అంతా జరిగిపోయింది. ఏమాత్రం అందులో ప్రయాణించినవారు బతికే అవకాశాలున్నా, ఈ అలసత్వం వారి ప్రాణాల్ని బలిగొనేదే. కూలిపోయి, పేలిపోయిందో.. పేలిపోయి కూలిపోయిందో.. అసలు ఈ ప్రమాదంపై వచ్చిన నివేదికలేమిటో.. అంతా గందరగోళమే. కానీ, నిర్లక్ష్యం గురించి మాత్రం ఎక్కడా ఎవరూ ప్రస్తావించలేదు.
చాలా చాలా ఆరోపణలొచ్చాయి.. వైఎస్ రాజకీయంగా ఎదగడం ఇష్టం లేక, కాంగ్రెస్ పార్టీనే అత్యున్నత స్థాయిలో 'ఆ పని' చేయించింది.. అనే ఆరోపణలు అప్పటికీ ఇప్పటికీ వినిపిస్తూనే వున్నాయి. 'వైఎస్ మరణంపై మాకు అనుమానాలున్నాయి..' అని సాక్షాత్తూ వైఎస్ కుటుంబం ఆరోపించినా, కుట్ర కోణంలో దర్యాప్తు జరిగిన దాఖలాలే లేవు. అందుకే, అప్పటికీ ఇప్పటికీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డెత్ మిస్టరీ అలానే కొనసాగుతోంది. ఒక్కటి మాత్రం నిజం.. వైఎస్ బతికి వుంటే, తెలుగునాట రాజకీయాలు ఇలా వుండేవి కాదు.