ఎవరెక్కువ డబ్బిస్తే వారికి పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని మాయావతిపై ఆరోపణ చేస్తూ ఆమెను వేశ్యతో పోల్చి వివాదాన్ని నెత్తికి తెచ్చుకున్న యుపి బిజెపి నాయకుడు దయాశంకర్ సింగ్ పేరు వినే వుంటారు. అతని కథలో కొత్త ట్విస్టు ఏమిటంటే అనుకోకుండా అతని భార్య నాయకురాలై పోయింది. మాయావతి పార్టీ టిక్కెట్లు 4-5 కోట్లకు అమ్ముకుంటోందని ఆమె పార్టీలోంచి వెళ్లిపోయిన స్వామి ప్రసాద్ మౌర్య, ఆర్కె చౌధురి కూడా ఆరోపించారు. మామూలుగా అమ్ముకోవడం కదాని వేలం వేసి మరీ అమ్ముతోందని, అందువలన ఆమెను 'దళిత్ కే బేటీ' అనడం కంటె 'దౌలత్ (సంపద)కి బేటీ' అనడం సబబని వారు చమత్కరించారు కూడా. దాన్నే దయాశంకర్ యింకా ఘాటుగా, రసవత్తరంగా చెప్పబోతూ వేశ్యతో పోల్చాడు. దాంతో కొంప మునిగింది. మాయావతి పార్లమెంటులో మండిపడుతూ 'నన్ను కాదు అతనన్నది, అతని యింట్లోవాళ్లని, తల్లిని, భార్యను, అక్కచెల్లెళ్లను, కూతుర్ని అన్నాడు' అంటూ కుటుంబసభ్యులను తెరపైకి తెచ్చింది. దయాశంకర్ చేసిన పోలిక అశ్లీలంగా, అసభ్యంగా వుంది కాబట్టి 'కావాలంటే అతన్ని అను, మధ్యలో అతని కుటుంబసభ్యులెందుకు?' అని ఏ పార్టీ నాయకుడూ వారించలేకపోయాడు. బిజెపి క్షమాపణ చెప్పడమే కాక దయాశంకర్ను యుపి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించడమే కాక, గొడవ యింకా ముదరడంతో పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది కూడా. 2017 ఎన్నికలలో యుపిలో దళిత ఓట్లు చాలా ముఖ్యం. గుజరాత్లో గోరక్షకుల కారణంగా బిజెపిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నవేళ పార్టీ నాయకుడు యిలాటి వ్యాఖ్య చేయడం మరింత యిబ్బందికరమనుకుని అతనికి ఆ దండన విధించింది.
అయితే యీ అవకాశాన్ని ప్రతిపక్షాలు వదులుకోదలచుకోలేదు. సమాజ్వాదీ పార్టీ అతనిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసు పెట్టి అరెస్టు చేయబోయింది. అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇక మాయావతి పార్టీ బియస్పీ యిదే అదనని దీన్ని మరింత పెద్దది చేయసాగింది. దయాశంకర్ వంటి దుష్టుణ్ని చేరదీసినందుకు బిజెపిని, యింకా అరెస్టు చేయకుండా కాపాడుతున్నందుకు ఎస్పీని నిందిస్తూ రాజధానిలో నిరసన ప్రదర్శనలు చేయసాగింది. వాటికి మాయావతి కుడిభుజంగా వున్న నసీముద్దీన్ సిద్దిఖి నాయకత్వం వహించాడు. జులై 21 నాటి ప్రదర్శనలో దయాశంకర్ని దూషిస్తూ నినాదాలివ్వడంతో ఆగకుండా 'దయాశంకర్ భార్యను, కూతుర్ని తీసుకురండి (పేష్ కియా జాయ్)' అని అరుపులు అరిచారు. ఆ విధంగా వాళ్లు దయాశంకర్ తరహాలోనే వాచాలత్వం ప్రదర్శించారు. కానీ వాటిని ఖండించే ధైర్యం బిజెపి చేయలేకపోయింది. పక్కనే బిజెపి ఆఫీసు వున్నా ఎవరూ వచ్చి అభ్యంతర పెట్టలేదు. అసలే దళిత వ్యతిరేకి అంటున్నారు, యిప్పుడు ఏం మాట్లాడినా తప్పుగానే వుంటుందనుకున్నారు. వాళ్ల ఆగ్రహం ఎలాగోలా తగ్గితే అదే చాలనుకున్నారు.
అయితే యీ నినాదాలకు అభ్యంతరం తెల్పడానికి ఒక మహిళ ముందుకు వచ్చింది. ఆమె వేరెవరో కాదు, దయాశంకర్ భార్య స్వాతి సింగ్. ఆమె సాధారణ గృహిణి. రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయ కలహాల్లో తన పేరు, 13 ఏళ్ల తన కూతురు పేరు బయటకు రావడం ఆమె సహించలేకపోయింది. వెళ్లి పోలీసుల వద్ద బియస్పీ నాయకులపై, ముఖ్యంగా మాయావతి, సిద్దిఖీపై ఫిర్యాదు చేసింది. ఆమె క్షత్రియ కులానికి చెందినది కాబట్టి ఠాకూర్ వనితలందరి మానమర్యాదలకు యిది సవాల్ అని ఆమె చిత్రీకరించింది. ''మాయావతి 'దళిత్ కీ బేటీ' అయితే నేను 'ఇన్సాన్ కీ బేటీ'' అని చెప్పుకోసాగింది. ఇది ఠాకూర్లందరికీ మనసు కెక్కింది. వాళ్లంతా అఖిల భారతీయ క్షత్రియ మహాసభ ద్వారా స్వాతీ సింగ్కు మద్దతు తెలపసాగారు. ఇది గ్రహించగానే మాయావతి కంగారు పడింది. దయాశంకర్ అరెస్టు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాలన్నీ రద్దు చేసింది. దయాశంకర్ భార్య, కూతుళ్లను తెరపై తెచ్చినందుకు అనుచరులను మందలించిందట కూడా. బిజెపికి క్రమంగా కళ్లు తెరుచుకున్నాయి. దయాశంకర్ను దిక్కుమాలినవాడిగా వదిలేస్తే ఠాకూర్లు కూడా తమపై కోపం పెంచుకుంటారని గ్రహించుకుంది. పోయిన దళితులు ఎలాగూ పోయారు, ఠాకూర్ల నెందుకు వదులుకోవాలి? అనుకుని స్వాతీ సింగ్కు లోపాయికారీగా మద్దతు యివ్వసాగింది. జులై 29 న దయాశంకర్ బిహార్లో పోలీసులకు పట్టుబడ్డాడు. అరెస్టయి, వెంటనే బెయిలు పొంది బయటకు వచ్చాడు. శ్రావణ పౌర్ణమి రోజున ఆరెస్సెస్ వారు నిర్వహించిన రాఖీ ఉత్సవంలో పాల్గొన్నాడు.
ఇప్పుడు దయాశంకర్, అతని భార్య స్వాతి కలిసి క్షత్రియులు ఎక్కువగా వున్న గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆ సభలను పార్టీ బ్యానర్లు లేకుండా, తన మిత్రపక్షమైన అప్నాదళ్ పేర, క్షత్రియసభ పేర బిజెపి నాయకులు నిర్వహిస్తున్నారు. ఎందుకైనా మంచిదని కొన్ని చోట్ల సమాజ్వాదీ పార్టీ వారు కూడా వచ్చి చేరుతున్నారు. ఇప్పటిదాకా యింట్లోనే వున్న స్వాతీ సింగ్ యిప్పుడు మంచి వక్తగా మారి తనను, తన కూతుర్ని అవమానించిన మాయావతిపై కాని, సిద్ధిఖీపై కాని, యితర బియస్పీ నాయకులపై కానీ రాష్ట్రప్రభుత్వం చర్య తీసుకోలేదని, మరి ఎఫ్ఐఆర్కు విలువేముందని ఝాడించి పడేస్తోంది. మహిళలను అవమానించిన బియస్పీకి ఎవరూ ఓటేయకూడదని పిలుపు నిచ్చింది. ఆ సభలోనే దయాశంకర్ మాట్లాడుతూ 'ఇది స్వాతి చేస్తున్న పోరాటం. రాజకీయాలతో సంబంధం లేదు. కూతురు కోసం ఒక తల్లి పడే ఆవేదన యిది. మాయావతి తన పార్టీ సహచరులపై చర్య తీసుకుని వుంటే బాగుండేది. కానీ ఆమె అలా చేయలేదు. పోలీసులు పట్టించుకోవటం లేదు. క్షత్రియులను ఏం చేసినా ఫర్వాలేదని వారి అభిప్రాయం కాబోలు. ఏదైనా జనరల్ సీటు నుంచి మాయావతి పోటీ చేసే సాహసం చేస్తే స్వాతి ఆమెకు వ్యతిరేకంగా నిలబడుతుంది. మాయావతి టిక్కెట్లు అమ్మిన మాట వాస్తవం. సిబిఐచే విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయి. అది చెప్పే క్రమంలో నా నోట తప్పుమాట దొర్లింది. నేను వెంటనే క్షమాపణ చెప్పాను కూడా. నన్ను పార్టీ వెలివేసింది. కానీ నేను ఆరెస్సెస్, బిజెపిలలోనే పెరిగాను. అవి నా రక్తంలోనే వున్నాయి.' అన్నాడు. సభలోని తక్కిన క్షత్రియ వక్తలందరూ యిది తమ కులవనితలకు జరిగిన అవమానంగానే భావిస్తున్నామన్నారు. 'సర్వజన హితాయ, సర్వజన సుఖాయ' పేరుతో తను ఒక ఉద్యమం నడుపుతానని స్వాతి ప్రకటించింది.
ఇవన్నీ మాయావతికి దడ పుట్టిస్తున్నాయి. కేవలం దళితుల ఓట్లతో ఆమె నెగ్గలేదు. దానికి అగ్రకులాల ఓట్లు, ముస్లిముల ఓట్లు కూడా తోడవ్వాలి. గతంలో బ్రాహ్మణులతో చేతులు కలిపి ఆమె నెగ్గింది. ఇప్పుడు బ్రాహ్మణులు ఆమెకు దూరమయ్యారు. గతంలో బ్రాహ్మణులను బిజెపికి చేజార్చుకున్న కాంగ్రెసు యిప్పుడు వారిని దువ్వుతోంది. మాయావతి పార్టీ నుంచి బ్రాహ్మణ నాయకులు బయటకు వచ్చేసి బిజెపిలో కలుస్తున్నారు. వారికి తోడు యిప్పుడీ క్షత్రియులతో కూడా వైరం తెచ్చుకుంటే, అగ్రకుల వ్యతిరేక ముద్ర పడితే బిస్పీ గెలుపు కష్టం. ఎందుకంటే బిసిలకు దళితులకు మధ్య వున్న వైరం చేత బిసిలు ఎక్కువభాగం మంది ఎస్పీవైపు మళ్లుతున్నారు. ముస్లిములు, దళితులు తప్ప తక్కిన వర్గాలన్నిటినీ హిందూత్వ పేరుతో సంఘటితం చేద్దామని బిజెపి చూస్తోంది. ఇలాటి పరిస్థితుల్లో స్వాతి అనే క్షత్రియ వనిత బిజెపికి అంది వచ్చింది. ఆమెకు టిక్కెట్టు యిచ్చినా యివ్వవచ్చు. ఆమె భర్త వదరుబోతుతనంతో నోరు పారేసుకోవడం వలననే స్వాతికి యీ నాడు యింత గుర్తింపు వచ్చిందన్నది వాస్తవం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2016)