జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్' ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. సినిమా షూటింగ్‌తోనూ, ప్రమోషన్‌తోనూ, అభిమానులతో మీటింగులతోనూ ఇన్నాళ్ళూ బిజీగా గడిపేసిన ఎన్టీఆర్, కొన్నాళ్ళపాటు రెస్ట్ తీసుకోనున్నాడు. రెస్ట్ అంటే మరీ, రెండు మూడు నెలలు అనుకోకండి. జస్ట్ ఓ ఇరవై రోజులు మాత్రమేనట. ఆ తర్వాత మళ్ళీ తదుపరి సినిమా పనుల్లో బిజీ అయిపోతాడట ఎన్టీఆర్.
అయితే, జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమా ఏంటి.? ఇదే ఇప్పుడు సస్పెన్స్. చేతిలో వక్కంతం వంశీ స్క్రిప్ట్ రెడీగా వుంది. కానీ, ఎన్టీఆర్‌కి ఆ స్క్రిప్ట్ విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. మరోపక్క 'టెంపర్' తర్వాత పూరితో ఇంకో సినిమా చేయాలని అప్పట్లోనే అనుకున్నాడు ఎన్టీఆర్. 'ఇజం' తర్వాత పూరి ఎలాగూ ఖాళీ అయిపోతాడు. దాంతో, ఇప్పటికే ఎన్టీఆర్‌తో కథ రెడీ చేసేసుకున్న పూరి, ఆ సినిమాని అతి త్వరలో లాంఛనంగా ప్రారంభించేసి, వీలైనంత త్వరగా పట్టాలెక్కించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మరోపక్క, ఎన్టీఆర్ పలువురు యంగ్ డైరెక్టర్స్ గురించి కూడా వాకబు చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న సినిమాలతో హిట్లు కొడ్తున్న దర్శకుల నుంచి కొత్త కొత్త కథలు వస్తుండడం ఎన్టీఆర్‌ని కూడా ఆకట్టుకుందట. అయితే, తనకున్న స్టార్‌డమ్ నేపథ్యంలో ఎన్టీఆర్ రిస్క్ చేసే అవకాశాలు తక్కువే.
ఏదిఏమైనా, సెప్టెంబర్ నెలాఖరుకో, అక్టోబర్ తొలి వారంలోనో ఎన్టీఆర్ తదుపరి సినిమాపై పూర్తిస్థాయి క్లారిటీ రానుందని ఫిక్సయిపోవచ్చు. క్లారిటీ రావడమేంటే, అప్పటికి సినిమా లాంఛనంగా ప్రారంభమైపోవచ్చు కూడా. ఎందుకంటే, పూరి అయినా వంశీ అయినా.. ఇద్దరూ తన కోసం రెడీగానే వున్నారు కదా.!