ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అడ్డంగా బుక్కయిపోయారన్నది నిర్వివాదాంశం. టెక్నికల్‌గా చట్టాల నుంచి చంద్రబాబు తప్పించుకోవచ్చుగాక. కానీ, ఓటుకు నోటు కేసుకు సంబంధించి ప్రజాక్షేత్రంలో ఆయనే మొదటి ముద్దాయి. వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. రాజకీయాల్లో చంద్రబాబు తనను తాను నిప్పుతో పోల్చుకుంటారు. నిజమే, ఆ నిప్పే.. వ్యవస్థల్ని తగలబెట్టేసింది.
టీడీపీకి ఆ సమయంలో ఎంత బలం వుంది.? అప్పుడు తెలంగాణలోని అధికార పార్టీ ఏం చేసింది.? అనే విషయాల్ని పక్కన పెడితే, గెలవడమే ముఖ్యం.. గెలవడానికి ఏ గడ్డి తిన్నా కాదు పాపం.. అన్నట్లు వ్యవహరించింది తెలుగుదేశం పార్టీ. రెడ్ హ్యాండెడ్‌గా అనాలా.? ఇంకేమన్నా అనాలా.? టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దొరికేశాడన్నది జగమెరిగిన సత్యం. కానీ, 'బ్రీఫ్' చేసి తప్పించుకున్న చంద్రబాబు మాటేమిటి.!
ఇప్పుడీ కేసులో పునర్విచారణ దిశగా వైఎస్సార్సీపీ చేసిన ప్రయత్నం ఫలించింది. ఆ పార్టీ నేత, న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో మళ్ళీ ఒక్కసారిగా టీడీపీ శ్రేణుల్లో కలకలం బయల్దేరింది. అయితే, వాయిస్ టెస్ట్‌లో చంద్రబాబు దొరికిపోయినా, ఆయన తప్పించుకోవడానికి సవాలక్ష మార్గాలున్నాయి. 'ఆ సమయంలో నేను మాట్లాడుతున్నది ఫలానా వ్యక్తితో అని తెలియదు.. ఇంకెవరో అనుకుని, ఇంకోదో మాట్లాడేశాను..' అని సింపుల్‌గా చంద్రబాబు తప్పించుకోడానికి వీలుంది.
అన్నిటికీ మించి, ఫోన్ ట్యాపింగ్ దెబ్బకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైలెంటయిపోయారు. అలా కేసీఆర్ – చంద్రబాబు మధ్య మంచి అండర్‌స్టాండింగ్ వుంది. ఒకర్ని బుక్ చెయ్యాలనుకుంటే ఇంకొకరు బుక్ అయిపోతారు.. ఎందుకంటే, ఓటుకు నోటు కేసు – ఫోన్ ట్యాపింగ్ కేసు.. రెండూ కవల పిల్లల్లాంటివి.. ఒకదానితో ఇంకొకటి సంబంధం వున్నవీ. ఇదే కాదు, కేంద్రం వద్ద ఎలా సాగిలాపడాలో చంద్రబాబుకి బాగా తెలుసు. ఇకనేం, ఈ కేసులో చంద్రబాబు ఇరుక్కుపోయే అవకాశాలే లేవు.
చట్టం నుంచి తప్పించుకోవచ్చుగాక.. ప్రజాక్షేత్రం నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. ఇప్పటికిప్పుడు చంద్రబాబుకి వచ్చే నష్టమేమీ లేకపోయినా.. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకే కాదు, చంద్రబాబు వారసుడు నారా లోకేష్‌పైనా ఎప్పటికీ ఓటుకు నోటు కేసు ప్రభావం మాత్రం అలాగే వుంటుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలూ అనవసరం.