పవన్‌కళ్యాణ్ 'బాబా' అవతారమెత్తేశాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడ్ని పదే పదే దర్శించేసుకుంటున్నాడు. ఒకసారి కాదు.. ఒకటికి రెండు సార్లు.. మళ్ళీ మళ్ళీ వెంకన్నను దర్శించుకుంటున్న పవన్‌కళ్యాణ్, ఈ క్రమంలో తనదైన వస్త్రధారణతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. పవన్‌కళ్యాణ్‌లో ఈ యాంగిల్ అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
భక్తి సంగతి పక్కన పెడదాం. వున్నపళంగా పవన్‌కళ్యాణ్ జనసేన అధినేత అయిపోయాడు. అవునండీ, ఆయనకి ప్రజలు గుర్తుకొచ్చారు. ఇది మరీ ప్రమాదకరం. 2009లో పవన్‌కళ్యాణ్‌కి జనం గుర్తుకొచ్చి, కాంగ్రెసోళ్ళని పంచెలూడేలా తరిమికొట్టమన్నాడు.. జనమేమో అన్నదమ్ములిద్దరికీ ఆ సన్మానం చేశారు. ఆ దెబ్బకి, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని కలిపేస్తే, తమ్ముడు రాజకీయాల్లోంచి మాయమైపోయాడు.
రాజకీయాల్లో ఇలాంటి గాయాలు తేలిగ్గానే మానిపోతాయి. జనం మర్చిపోతారనుకున్నాడేమో, పవన్ ఈసారి వేషం మార్చాడు. జెండా మార్చేశాడు. జనసేన పార్టీ జెండా పట్టుకుని వచ్చాడు. ఎన్నికల్లో బీజేపీ – టీడీపీలకు 'అండగా' నిలబడ్డాడు. ఆ తర్వాత జనసేన జెండానీ పక్కన పారేశాడు. మళ్ళీ ఇప్పుడు జెండా పట్టుకున్నాడు. వెంకన్న సేవలో పవన్‌కళ్యాణ్ తరించడానికి కారణం జనసేన పార్టీనే. తిరుపతిలో జనసేన బహిరంగ సభ నిర్వహిస్తోంది. అదీ అసలు కథ.
ఇంతకీ, జనసేన పార్టీ ఇప్పుడన్నా 'గబ్బర్‌సింగ్'లా సూపర్ హిట్ అవుతుందా.? 'సర్దార్ గబ్బర్‌సింగ్'లా డిజాస్టర్ అవుతుందా.? ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే ఇది. అంతకన్నా ముందే, ఈ రోజు పవన్ ప్రసంగం హిట్టవుతుందా.? ఫట్టవుతుందా.? అనేదాని గురించి మాట్లాడుకోవాలి. జనసేన రంగులు బహిరంగ సభకు అద్దారు గనుక, పవన్‌కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడాలి. రాజకీయాలంటే ముందుగా ప్రత్యేక హోదా గురించే స్పందించాలి. లేదూ, సొల్లు పురాణం చెప్పి.. జనాన్ని కన్‌ఫ్యూజ్ చెయ్యాలనుకుంటే, షరామామూలుగానే పవన్‌కళ్యాణ్‌ని జనం పక్కనెట్టేస్తారు.
ఎప్పుడో ఎన్నికల్లో రాజకీయ ప్రసంగాలు చేశాడు.. ఆ తర్వాత ఆర్నెళ్ళకో, ఏడాదికో ఓ సారి మీడియా ముందుకు రావడం, కాస్త ఆవేశపడ్డం మామూలే. చాలాకాలం క్రితం పవన్ ట్విట్టర్ పిట్ట కూతపెట్టింది, దాని గొంతుపోయింది కూడా. ఇప్పుడు మళ్ళీ ఇదిగో.. పవన్ బాబా తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడు సరే, మాయమాటలు చెప్పి.. మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోకుండా వుంటాడా.? వేచి చూడాల్సిందే.