అఖిల్‌.. ఇది మరీ టూ మచ్‌.!

అభిమానుల్ని వెయిట్‌ చేయించాలని అనుకుంటున్నాడో.. కెరీర్‌లో తదుపరి సినిమా ఏం చేయాలో తెలియక డైలమాలో వున్నాడోగానీ.. ప్రస్తుతానికైతే అక్కినేని అఖిల్‌ ఖాళీగా.. జాలీ జాలీగా గడిపేస్తున్నాడు. ఖాళీగా వుంటే జనం మర్చిపోతారు కదా.. అందుకే…

అభిమానుల్ని వెయిట్‌ చేయించాలని అనుకుంటున్నాడో.. కెరీర్‌లో తదుపరి సినిమా ఏం చేయాలో తెలియక డైలమాలో వున్నాడోగానీ.. ప్రస్తుతానికైతే అక్కినేని అఖిల్‌ ఖాళీగా.. జాలీ జాలీగా గడిపేస్తున్నాడు. ఖాళీగా వుంటే జనం మర్చిపోతారు కదా.. అందుకే ఆ ఖాళీలోనూ కాస్తంత 'ఎంటర్‌టైన్‌మెంట్‌' కోరుకుంటున్నాడు. ఏదో ఒక రకంగా మీడియాలో కన్పించేందుకు తాపత్రయ పడ్తున్నాడు. అందునా, సినీ కార్యక్రమాలతో సినీ అభిమానులకి అఖిల్‌ టచ్‌లోనే వుంటున్నాడు. ఇదో కొత్త రకం స్ట్రాటజీ అనుకోవాలేమో.! 

సుశాంత్‌ హీరోగా వచ్చిన 'ఆటాడుకుందాం రా' సినిమా కోసం టైటిల్‌ సాంగ్‌లో అఖిల్‌ చిందులేసిన విషయం విదితమే. ఆ సినిమా ఆన్‌ సెట్స్‌లో మీడియాతో ముచ్చటించాడు అఖిల్‌. ఆ తరువాత 'పెళ్ళి చూపులు' సినిమా ప్రమోషన్‌ కోసం వచ్చాడు. తాజాగా, మలయాళం నుంచి తెలుగులోకి వచ్చిన '100 డేస్‌ ఆఫ్‌ లవ్‌' సినిమా కోసం మీడియా ముందుకొచ్చాడు అఖిల్‌. ఏదో సినిమా ఫంక్షన్‌కి హాజరవడం వేరు, ఆ సినిమా పేరుతో.. మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం వేరు. 

అయితే, ఎక్కడా తన తదుపరి సినిమా గురించి ఎవరూ ప్రశ్నించకుండా జాగ్రత్తపడుతున్నాడు అఖిల్‌. దాదాపు డజను మంది డైరెక్టర్ల పేర్లను పరిశీలించినా, అఖిల్‌కి ఒక్కరూ నచ్చకపోవడంతో అఖిల్‌ తదుపరి సినిమాపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. తన సినిమా విషయంలో అఖిల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడుగానీ, ఇతర సినిమాల విషయంలో మాత్రం అఖిల్‌ చూపుతున్న అత్యుత్సాహం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అభిమానులు అందుకే 'అఖిల్‌ ఇది మరీ టూ మచ్‌..' అంటూ వాపోతున్నారు.