కిట్టనివాళ్లు దీనిని ఆదిలోనే హంసపాదు అనుకోవచ్చు. లేదా, అభిమానులే అయితే.. వ్యవహారం ముదరక ముందే తీసుకుంటున్న ముందుజాగ్రత్త అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న 150 వ చిత్రానికి టైటిల్ మారే అవకాశం కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, వినాయక్ దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రానికి 'ఖైదీ నెంబర్ 150' టైటిల్ ఖరారు చేసి కొన్ని రోజుల కిందటే ప్రకటించారు.
అయితే అభిమాన ప్రపంచానికి ఆ టైటిల్ ఆశించినంత కిక్ ఇవ్వలేదని వెంటనే గుర్తించారు. అందుకే , చిరు చిత్రాన్ని చరిత్రలో నిలిచిపోయేంత పెద్ద హిట్ చేయాలనుకుంటున్న వాళ్లు… అవసరమైతే టైటిల్‌ను మారుద్దాం అని తలపోస్తున్నట్టుగా తెలుస్తోంది.
చిరు చిత్రానికి అభిమానులు చాలా పవర్‌ఫుల్ టైటిల్స్‌ను ఆశించారు. చిత్ర యూనిట్ కూడా దీనిని పవర్ ఫుల్ గానే భావించి ఉంటారు గనుకనే.. నాన్నకు బర్త్‌డే కానుకగా.. ముందురోజున నిర్మాత రాంచరణ్ విడుదల చేశారు. అయితే ఆ టైటిల్ జనానికి మాత్రం కిర్రెక్కించలేదు.
చిరు 150 చిత్రానికి సంబంధించి.. యూనిట్ ఎంత గొప్ప ప్రయత్నమైనా చేయవచ్చు గాక.. జనం ఇంకా ఏదో కోరుకుంటున్నారనడానికి ఇదొక నిదర్శనం అని పలువురు భావిస్తున్నారు. సినిమా విషయంలో కూడా ఈ జాగ్రత్త తప్పదని.. జనం ఎక్స్‌పెక్టేషన్స్‌ని అందుకోవాలంటే.. ఆషామాషీగా చేస్తే కుదరదని, అందుకే ఆషామాషీ టైటిల్‌ను మార్చేయాలని ఫ్యాన్స్‌నుంచి విన్నపాలు వస్తున్నాయిట.
మరీ చిరంజీవి బర్త్‌డే రోజునే నెగటివ్ ఎటాక్స్ ఎందుకని పట్టించుకోలేదు గానీ సోషల్ నెట్‌వర్క్ సైట్లలో కూడా చిరు 150 చిత్రం టైటిల్ పట్ల పెద్ద పాజిటివ్ స్పందన రాలేదు. అయితే యూనిట్ సేకరించిన ఫీడ్‌బ్యాక్ నెగటివ్‌గానే ఉందిట. ఖైదీనెంబర్ 150 అనగానే.. ఏదో పాతచిత్రం అనే ఫీలింగు కలుగుతోందని.. కొత్తదనం లేకుండా.. తమ మెగాస్టార్ పాతికేళ్ల వెనకబడి పోయి ఉన్నట్లుగా టైటిల్ దగ్గరినుంచే జనానికి ఓ దురభిప్రాయం కేరీ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారట.