బాహుబలి సినిమా విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రముఖంగా వినిపించిన ప్రశ్న – కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఇంత ఆసక్తి కలిగించిన ప్రశ్న ఇటీవలి కాలంలో మరొకటి లేదేమో? ఇక ఈ ఫ్రశ్నకు సమాధానం దొరికేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎందుకంటే, బాహబలిని కట్టప్ప చంపిన సీన్ ను బాహుబలి 2 కోసం చిత్రీకరించక తప్పదు. అప్పుడు సినిమా క్రూ అంతా దాన్ని చూడక తప్పదు. అతి రహస్యం కాస్తా బట్ట బయలు కాక తప్పదు. అయితే రాజమౌళి సామాన్యుడు కాదు. బాహుబలి 2 బిజినెస్ పాయింట్ లో, ప్రచారంలో కట్టప్ప పాయింట్ ఎంత కీలకమో అతనికి తెలియంది కాదు.
అందుకే ఈ సీన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ రహస్యం ముగ్గురికే తెలుసంట. ఒకరు బాహుబలి కర్త కర్మ క్రియ అయిన రాజమౌళి, కథకుడు విజయేంద్ర ప్రసాద్, హీరో ప్రభాస్. రాజమౌళి చాలా తెలివిగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ముందుగా వీలయినంత తక్కువ మంది సిబ్బంది వుండేలా చూసుకున్నారట.
తీస్తున్న సీన్ కట్టప్ప బాహుబలిని చంపేది అని హింట్ ఇవ్వకుండా, ముక్కలు ముక్కలుగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సిబ్బందికి కూడా వీలయినంత వరకు హింట్ దొరక్కుండా రాజమౌళి జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. కాస్త అర్థమైనా ఇంత కీలకమైన పాయింట్ ను ఎవరు మాత్రం బయటపెడతారు? వందల కోట్లతో ముడిపడిన వ్యాపారం కదా?