సెప్టెంబర్ 9..మంచి డేట్ ల్లో ఒకటి. అయితే ఈ డేట్ కు నిన్న మొన్నటి వరకు చాలా సినిమాలు వినిపించాయి. కానీ ఇప్పుడు చూస్తుంటే అన్నీ పక్కకు తప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది. జనతా గ్యారేజ్ విడుదలయిన తరువాతి వారం ఇది. మరి అంత పెద్ద సినిమా మీద వెంటనే ఎందుకనో? థియేటర్లు దొరకవనో పక్కకు తప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది.
అన్నింటికన్నా ముందు నాగ్ చైతన్య ప్రేమమ్ ఈ డేట్ మీద ఆశలు పెట్టుకుంది. కానీ ఉన్నట్లుండి ఏకంగా నెల రోజులకు పైగా వెనక్కు వెళ్లిపోయింది. ఫస్ట్ కాపీ రెడీగా వుంది కూడా. అయినా ఎందుకు వెళ్లినట్లో కారణం తెలియదు.
నాని-విరించి వర్మ కాంబినేషన్ లోని మజ్నును ఇదే డేట్ కు విడుదల చేయాలని లోలొపల ప్లాన్ చేసుకున్నారు. కానీ మళ్లీ వాళ్లు వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. సునీల్-వీరు పోట్ల కాంబినేషన్ లోని వీడు గోల్డ్ ఎహె సినిమా ఈ డేట్ కు ఫిక్స్ అన్నారు. నిజానికి ఈ సినిమాను బాబు బంగారం మీద ఆగస్టు 12 కే వదిలేస్తామన్నారు.
అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదన్నది. ఇంకా ఒకటో రెండో పాటలు, మూడు నాలుగు రోజుల టాకీ బకాయి వుంది. అప్పటికీ సునీల్ ను రాత్రి పగలు రఫ్పాడించేసి, పూర్తి చేసే ప్రయత్నంలో వున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలానే వున్నాయి. ఇవన్నీ కలిపి 9 వేళకు సినిమాను రెడీ చేయడం అంటే అనుమానంగానే వుంది.
సో, ఇక మిగిలిన సినిమా ఒకటే. అవసరాల శ్రీనివాస్-నాగశౌర్య-నారా రోహిత్ కాంబినేషన్ లోని జ్యోఅచ్యుతానంద. ఇప్పటికి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక్కటే 9న బరిలో మిగిలేలా వుంది. ఇంకా ఫస్ట్ కాపీలు రెడీ అయినవి ఏవీ కనుచూపుమేరలో కనిపించడం లేదు మరి.