ఆనందీబెన్ మార్పు తథ్యం అని జూన్‌లోనే వ్యాసం రాస్తూ చివర్లో అమిత్ షా సాటి జైన్-బనియా ఐన విజయ్ రూపాణీని ముఖ్యమంత్రిగా తెచ్చే అవకాశం వుందని రాశాను. కానీ ఆ మార్పు అంత సులభంగా జరగలేదు. పటేళ్లు బిజెపిపై కోపంతో వున్నారు కాబట్టి ఆనందీబెన్ స్థానంలో మరో పటేల్‌ను తెస్తే మంచిదని మొదట్లో అనుకోవడం జరిగింది. ఆమె రాజీనామా చేయగానే సమర్థుడిగా పేరు పొందిన నితిన్ పటేల్‌కే పగ్గాలు అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. బిజెపి ఆఫీసుకి అతను వచ్చినపుడు కార్యకర్తలందరూ కాబోయే ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పినట్లే చెప్పారు. కొన్ని టీవీ ఛానెల్స్ అతని భార్యను అప్పుడే యింటర్వ్యూ చేసేయసాగాయి. అయితే పటేళ్లు పార్టీకి ఎలాగూ దూరమయ్యారు కాబట్టి మరో పటేల్‌ను తెచ్చి ప్రయోజనం లేదని, అమిత్ ఆఖరి నిమిషంలో మోదీని ఒప్పించగలిగాడు. ఇన్నాళ్లూ పటేళ్లు బిజెపిలో ప్రముఖ పాత్ర వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పెత్తనం చలాయించారు. అది తక్కిన కులాల వారికి మంటగా వున్నా సహించారు. ఆర్థికంగా కూడా బలవంతులైన పటేళ్లు ఇప్పుడు తమకు రిజర్వేషన్ కూడా కావాలనడంతో ఆ సౌకర్యం అనుభవిస్త్తూన్న బిసిలు వారికి ఎదురు తిరిగారు – మన దగ్గర కాపులను బిసిలుగా గుర్తించి రిజర్వేషన్ యిస్తామంటే బిసిలు మండిపడుతున్నట్లే! పటేలేతర కులాలను సమీకృతం చేసుకుంటే మంచిదని అమిత్ యిచ్చిన సలహా మోదీకి నచ్చింది. గోరక్షకులు దళితులను దండించడంతో యిటీవల దళితులు కూడా బిజెపికి ఎదురు తిరుగుతున్నారు. పటేల్-దళిత సమస్య తమను పీడిస్తోందని బిజెపి నాయకులు అనుకుంటూన్న యీ తరుణంలో ఆ రెండు కులాలు కాని కులాలను సంఘటితం చేయడానికి విజయ్ రూపాణీకి పదవి యిస్తే మేలు అన్నాడు అమిత్.
అయితే రూపాణీకి పాలనానుభవం బొత్తిగా లేదు. అతనిది ఆరెస్సెస్ నేపథ్యం. కాలేజీ రోజుల్లో ఎబివిపి సభ్యుడు. ఎమర్జన్సీ కాలంలో జైలుకి వెళ్లాడు. సాటి ఆరెస్సెస్ కార్యకర్త అంజలీ బక్షీని పెళ్లాడాడు. బిజెపి పుట్టుక నుండి పార్టీలో వున్నాడు. పార్టీ కమిటీల్లో సభ్యుడిగా వుంటూ అప్పగించిన పనులన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తూ, మంచి ఆర్గనైజర్‌గా పేరు గడించాడు. గుజరాత్ టూరిజం బోర్డుకి చైర్మన్‌గా కొంతకాలం వున్నాడు. 2006 నుంచి ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా వున్నాడు. 2007 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు యిన్‌చార్జిగా పనిచేశాడు. ఆ ప్రాంతాలు బిజెపికి కంచుకోటలా వుంటూ వచ్చినా యీసారి పటేళ్లు బిజెపికి వ్యతిరేకంగా వున్నారని అందువలన ఎక్కువ సీట్లు రావని అందరూ అంటూంటే రూపాణీ ఒక పాత్రికేయుడితో మొత్తం 57 సీట్లలో 42 సీట్లు గెలుస్తాం, చూడండి అన్నాడు. 43 గెలిచారు. అలాగే 2012 ఎన్నికలలో మళ్లీ అవే ప్రాంతాలు అతనికి అప్పగించారు. పటేల్ నాయకుడు, మోదీకి గురువు అయిన కేశూభాయ్ పటేల్ బిజెపి నుంచి రాజీనామా చేసి గుజరాత్ పరివర్తన్ పార్టీ ఏర్పాటు చేసి గోదాలోకి దిగాడు. అందరూ భయపడ్డారు. కానీ రూపాణీ మోదీతో కేశూభాయ్ గురించి పట్టించుకోవద్దని చెప్పాడు. చివరకు 35 సీట్లు వచ్చాయి. రూపాణీలో వున్న ఘనత ఏమిటంటే కలహించుకునే వర్గాలను ఒక దగ్గర కూర్చోబెట్టి, యిరువురికి నచ్చచెప్పి, కలుపుకుని వెళ్లగలగడం. మంత్రి కావడం కంటె పార్టీ నాయకుడిగా వుండటానికే ఎక్కువ యిష్టపడ్డాడు. రాజ్‌కోట (పశ్చిమ) నియోజకవర్గం నుంచి ఎన్నికైన వజూభాయ్ వాలా చేత రాజీనామా చేయించి కర్ణాటక గవర్నరుగా పంపాక ఆ స్థానంలో రూపాణీని నిలబడమన్నారు. నిలబడి, గెలిచాడు. మంత్రిగా తీసుకున్నారు. 2015 ఫిబ్రవరికి అతన్ని బిజెపి రాష్ట్రాధ్యక్షుణ్ని చేశారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని చేశారు.
రూపాణీ ఆనందీ బెన్ కాబినెట్‌లోని 9 మందిని వదిలించుకున్నాడు. 25 మంది వున్న తన కాబినెట్లో 8 మంది కొత్త మొహాలకు అవకాశం యిచ్చాడు. ముఖ్యమంత్రి కాగలిగిన నితిన్ పటేల్‌కు ఉపముఖ్యమంత్రి పదవి యిచ్చాడు. తీసేసిన వాళ్లలో ప్రముఖుడు – ఆర్థిక, విద్యుత్ శాఖలు నిర్వహించిన సౌరభ్ పటేల్. సౌరభ్ మోదీకి అత్యంత ఆత్మీయుడు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి అతనెంతో కృషి చేశాడు. పెట్టుబడిదారులు అతనితో ఎంతో సన్నిహితంగా మెలగుతారు. అతను లేకుండా ''వైబ్రంట్ గుజరాత్'' సదస్సును ఊహించుకోవడం కష్టం. మరి అలాటతన్ని ఎందుకు తీసేశారు అంటే ఆనంది బెన్ను తృప్తి పరచడానికట. పదవిలో వున్నంతకాలం అతను తనకు సహకరించటం లేదని ఆమె ఫిర్యాదు చేస్తూ వుండేది. మోదీ అతన్ని ఢిల్లీకి రప్పించుకుని ఏదైనా ముఖ్యపదవి యివ్వవచ్చని అనుకుంటున్నారు. బిజెపిపై పటేల్, దళిత వర్గాలతో పాటు మరి కొన్ని వర్గాలు కోపంగా వున్నాయి. వారందరితో అనునయంగా మాట్లాడి, పార్టీ వైపుకి తిప్పుకుంటాడనే రూపాణీకి యీ అవకాశం యిచ్చారట. అలా యివ్వడం అసలే కోపం మీద వున్న పటేళ్లకు మరింత కోపం తెప్పించింది. ''నితిన్ పటేల్‌ను ముఖ్యమంత్రి చేస్తామని మభ్యపెడుతూ వచ్చి, చివరిలో అతన్ని కరివేపాకులా తీసిపారేసి రూపాణీని తెచ్చారు. నిరసనగా నితిన్ రాజీనామా చేయాలి'' అంటూ ప్రకటించాడు హార్దిక్ పటేల్. రూపాణీ పాత కాబినెట్‌లోని ముగ్గురు పటేళ్లకు ఉద్వాసన చెప్పినా, కొత్తగా నలుగుర్ని తీసుకున్నాడు. అయినా తృప్తి పడక పటేళ్లు ఒకవేళ రూపాణీని వ్యతిరేకిస్తే ఆ మేరకు తక్కిన కులాలు అతన్ని సమర్థిస్తాయని బిజెపి ఆశ.
కులం మాట ఎలా వున్నా పాలన బాగుంటే అందరూ సమర్థిస్తారు. ఆనంది వైఫల్యాలలో ప్రధానమైనది అధికారగణంపై పట్టు లేకపోవడం. ఆమె హయాంలో అవినీతి హద్దులు దాటిందని పేరు వచ్చింది. ఆనంది ఎందుకు వైఫల్యం చెందిందో గమనించి, ఆ లోపాలు సవరించే ప్రయత్నం రూపాణీ చేయాలి. ఆమెలో ప్రధానమైన లోపం పటేల్ ఆందోళనను సరిగ్గా హేండిల్ చేయలేకపోవడం. మొదట్లో ఉదాసీనంగా వుంది, తర్వాత మరీ కఠినంగా వ్యవహరించింది. హార్దిక్ పటేల్‌పై దేశద్రోహం నేరం మోపారు, అతన్ని 9 నెలల పాటు జైలు శిక్ష అనుభవింపచేశారు, తర్వాత కూడా గుజరాత్‌కు రాకుండా బహిష్కరింప చేశారు. ఈ నిందంతా ఆనంది మోయవలసి వచ్చింది. చివరకు పటేళ్లను సంతృప్తి పరచడానికి ఇబిసి (ఆర్థికంగా వెనకబడినవారు)ల కోసం 10% కోటా ప్రకటిస్తానన్నపుడు ఆమె అభ్యంతర పెట్టింది. చివరకు ఆ ప్రకటన చేసినపుడు అమిత్ షా, విజయ్ రూపాణీ ఆనంది పక్కన కూర్చున్నారు. ఆ కేటాయింపును హైకోర్టు కొట్టి వేసేందుకు ముందు రోజే ఆమె రాజీనామా చేసింది. నిజానికి స్థానిక ఎన్నికలలో ఓటమి తర్వాత ఆమెకు తను దిగిపోవాల్సి వస్తుందని ముందే తెలుసు. నవంబరు 21న తనకు 75 నిండుతాయి కాబట్టి, వయోవృద్ధులు రాజకీయాల నుంచి రిటైరు కావాలనే సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ హుందాగా రాజీనామా చేసే అవకాశం యివ్వాలని ఆమె మోదీని మేలో కోరింది. ఆమెపై అభిమానంతో మోదీ సరేనన్నాడు.
కానీ జులైలో ఊనాలో శివసైనికులు గోరక్షాదళం పేరుతో దళితులను చావగొట్టడంతో గుజరాత్ ప్రభుత్వం అప్రతిష్ఠపాలైంది. దళితులపై అత్యాచారాల విషయంలో గుజరాత్ రికార్డు ఎప్పుడూ బాగా లేదు. కానీ 2014లో 1130 కేసులుంటే 2015లో అది ఆరు రెట్లు పెరిగి 6655 అయింది. ఇక ఆనందిని వెంటనే దిగమని చెప్పక తప్పలేదు. జులై 28 న ఆ కబురు వెళ్లింది. ఆమె కాస్త గడువు అడిగి, దిగిపోయే ముందు ప్రజలను సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది. రాష్ట్ర రహదారులపై టోల్ టాక్సు రద్దు చేసింది, రాష్ట్రప్రభుత్వోద్యోగులకు ఏడవ పే కమిషన్ సిఫార్సులు అమలు చేసింది. పటేల్ ఆందోళనకారులపై మోపిన 430 కేసుల్లో 391టిని ఎత్తివేసింది. దారిద్య్రరేఖకు దిగువ నున్న యిళ్లలోని బాలికలకు మెడికల్, డెంటల్ కాలేజీలలో ఉచిత విద్య కల్పిస్తామని ప్రకటించింది. చివరికి ఆగస్టు 3న తన రాజీనామాను ఫేస్బుక్లో పోస్టు చేసింది. ఇలా చేసిన ముఖ్యమంత్రి ఆమె ఒక్కరే కాబోలు.
మోదీ వారసురాలిగా ఆమె నిలదొక్కుకోలేక పోయిందంటే మోదీ ఎంపికలో కూడా లోపం వున్నట్లే లెక్క. ఆనందిలో కొంత మంచి వుంది, కొంత చెడు వుంది. చాలా కష్టపడే స్వభావం ఆమెది. 74 ఏళ్ల వయసులో కూడా రాష్ట్రంలో 60 వేల కి.మీ.లు తిరిగింది. 33 జిల్లాలలను అయిదేసి సార్లు పర్యటించింది. మోదీ లాగా వర్క్‌హాలిక్. మోదీ ఆర్థికాభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెడితే యీమె మానవ సూచిక (హ్యూమన్ యిండిసీస్)పై శ్రద్ధ చూపింది. స్వచ్ఛభారత్, మహిళా సాధికారత, పౌష్టికాహారం సమకూర్చడం వంటి అంశాల్లో ఫలితాలు సాధించింది. స్వచ్ఛభారత్ పథకం కింద లక్షకు పైగా స్కూళ్లల్లో టాయిలెట్లు కట్టించింది, సివిక్ బాడీ ఎన్నికలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి, పోలీసు నియామకాల్లో 33% రిజర్వ్ చేసింది. 2014లో 45 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 2015 వచ్చేసరికి అది 3కు తగ్గింది. చిన్న పరిశ్రమలు మార్చి 2014లో 2.62 లక్షలుంటే ఏడాదిన్నర తర్వాత అది 3.75 లక్షలైంది.
నెగటివ్ పాయింట్ల కొస్తే మోదీలా ఆమె వక్త కాదు, కలుపుగోరు వ్యక్తి కాదు, ఎవరితోను ఆమె సన్నిహితంగా మెలగలేదు, కాబినెట్ సహచరులు, సీనియర్ నాయకులు ఆమెకు దూరంగానే వున్నారు. రాష్ట్ర జిడిపి 2012-13లో 10.8%, 2013-14లో 8.3% కాగా 2015 వచ్చేసరికి అది 7.7% అయింది. ఇవే సంవత్సరాల్లో ఆహారధాన్యాల ఉత్పత్తి 93.82 లక్షల టన్నుల నుంచి 61.92 లక్షల కోట్లకు తగ్గింది. అధికారులు ఆనందిని పెద్దగా లక్ష్యపెట్టలేదు. వారి అవినీతి ఆమె ఆపలేకపోయింది. ఇవన్నీ చాలనట్లు ఆమెకు తన కూతురి విషయంలో అవినీతి మచ్చ పడింది. 2012లో మోదీ మూడో సారి ఎన్నిక కావడానికి నాలుగు నెలల పాటు విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది. అయినా గతంలో కంటె తక్కువగా 182 సీట్లకు 115 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెసు నిర్జీవంగా వుండటం వలననే తాము గెలుస్తూ వస్తున్నామని బిజెపి నాయకులకు తెలుసు. ఎన్నికలకు 16 నెలలు మాత్రమే మిగిలింది. ప్రజల్లో అసంతృప్తి బలంగా వుందన్న విషయం 2015 డిసెంబరులో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలలో (బిజెపి ఆరు మునిసిపాలిటీల్లో గెలిచినా, గ్రామీణ ప్రాంతాల్లో ఓడిపోయింది. 31 జిల్లా పంచాయితీల్లో 23 పోగొట్టుకుంది. సరైన నాయకత్వం లేక, నిర్జీవంగా పడివున్న గుజరాత్ కాంగ్రెసు 18 ఏళ్ల తర్వాత ఊపిరి పోసుకుని 31 జిల్లా పంచాయితీల్లో 21, 230 తాలూకా పంచాయితీల్లో 110 గెలిచింది) మార్చి-ఏప్రిల్‌లలో పార్టీ నాయకుల చేత చేయించిన సర్వేలో (182కు 65 మాత్రమే వస్తాయన్నారట) బయటకు వచ్చింది. ఆమె ఎంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగితే కాంగ్రెసుకు అంత లాభం అని వాళ్ల సలహాదారు ప్రశాంత్ కిశోర్ చెప్పాడట. పొరపాట్లకు ఆనందిని బాధ్యురాల్ని చేసి పంపివేయకపోతే పార్టీకే ముప్పు అని బిజెపి గ్రహించింది. అయితే పాలనానుభవం లేని ఆమె వారసుడు కేవలం చాకచక్యంతో ఏ మేరకు బిజెపి ప్రతిష్ఠ పెంచుతాడు, పటేళ్లను ఎలా హ్యేండిల్ చేస్తాడు అనేది చూడాలి. ఆనంది వున్నంత కాలం అమిత్ షా ఆమెకు వ్యతిరేకంగా వ్యహరించాడు. రూపాణీకి ఆ చింత లేదు. అందువలన కొద్దో, గొప్పో చేయవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)