ప్రభుత్వ సాయం అందని గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం పేరుతో క్రైస్తవ మిషనరీలు శతాబ్దాలుగా చొచ్చుకుపోయి వారిని క్రైస్తవంలోకి మారుస్తూండడం జరుగుతోంది. దానికి ప్రతిగా ఆరెస్సెస్ తన అనుబంధ సంస్థల ద్వారా గత కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతాల్లో స్కూళ్లను ఏర్పరచి, సహాయ కార్యక్రమాలను నిర్వహించి గిరిజనులను ఆకట్టుకుని వారిని హిందూత్వ శక్తులుగా మారుస్తోంది. ఇద్దరి మధ్య పోటీ పెరిగినకొద్దీ కొంతమందిని చిన్నవయసులోనే కుటుంబాలకు దూరంగా తీసుకుపోయి, వారిని సుశిక్షితులైన మత వాలంటీర్లగా మార్చడానికి చూస్తున్నారు. అసాం, మణిపూర్ నుంచి 76 మంది బాలబాలికలను క్రైస్తవ మిషనరీలు తమిళనాడుకు తీసుకుని పోయి క్రైస్తవులు నడిపే అనాథాశ్రమాలలో చేర్చడంతో విచారణ జరిగింది. కేసు పెట్టారు. దానిపై సుప్రీం కోర్టు 2010 సెప్టెంబరు 1న తీర్పు చెప్పి అసాం, మణిపూర్ రాష్ట్రాల ప్రభుత్వాలు 12 ఏళ్ల లోపు పిల్లలను, వయసుతో సంబంధం లేకుండా ప్రైమరీ స్కూల్లో చదివే పిల్లలను యితర రాష్ట్రాలలో చదువుకై పంపకుండా చూడాలంది. ఈ తీర్పు వచ్చాక కూడా 2012-15 మధ్య చదువు పేర మీద అసాం నుంచే 5 వేల మంది పిల్లలను తీసుకుపోయారని ఒక అధ్యయనంలో తేలింది.
2015 జూన్ 9 న ఆసాంలోని 5 జిల్లాల నుంచి బోడో, సంతాల్ జాతులకు చెందిన 3 నుంచి 11 సం||ల వయసులో వున్న 31 మంది గిరిజన బాలికలను సంఘ్ పరివార్‌కు చెందిన రాష్ట్ర సేవికా సమితి, సేవాభారతి సంస్థల నాయకురాళ్లు కొరోబీ బసుమతారీ, సంధ్యాబెన్ తిక్డేలు పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు ఢిల్లీ ద్వారా తీసుకెళ్లడానికై పూర్వోత్తర్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలెక్కించారు. ఈ విషయాన్ని ఒక అజ్ఞాత వ్యక్తి 1098కు ఫోన్ చేసి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వం కింద పనిచేసే చైల్డ్‌లైన్ ఇండియా ఫౌండేషన్, ఢిల్లీ శాఖకు ఫోన్ ద్వారా తెలియపరిచాడు. సమాచారం అందగానే వారు రైల్వే పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సహాయంతో న్యూ ఢిల్లీలో పిల్లలను రక్షించి నాయకురాళ్లను పహాడ్‌గంజ్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. 2000 నాటి సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగానే కాక జువెనైల్ జస్టిస్ చట్టం (2000) ప్రకారం వుండవలసిన సర్టిఫికెట్లు లేవేమని నిలదీశారు.
ఆ చట్టప్రకారం దేశంలోని ప్రతి జిల్లా స్థాయిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి)లు నెలకొల్పి వాటికి ఫస్ట్‌క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ అధికారాలిచ్చారు. అనాథలైన లేదా తప్పిపోయి దొరికిన చిన్నపిల్లల విషయంలో వారి నేపథ్యాన్ని తెలుసుకుని, సమాచారం సేకరించి ఏ కుటుంబానికి అప్పగించాలి, వారి సంరక్షణకు ఏయే చర్యలు తీసుకోవాలి అనే విషయాల్లో వారి తీర్పులిచ్చే అధికారం కమిటీలదే. జిల్లాలోని చిన్నపిల్లలను తరలించాలంటే వారిని ఆ జిల్లా కమిటీల ముందు ప్రవేశపెట్టి, కమిటీల నుంచి నిరభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్టు) తీసుకోవాల్సి వుంది. కానీ యీ ఆపరేషన్‌లో పాలు పంచుకున్న రాష్ట్ర సేవికా సమితి, సేవాభారతి, విద్యాభారతి సంస్థలు అలాటిదేదీ చేయకపోవడం వలన చట్టవిరుద్ధ చర్య అయింది. ఆ విషయమై ఢిల్లీ పోలీసులు అడుగుతూండగానే మర్నాటి కల్లా సురేంద్రనగర్ సిడబ్ల్యుసి వారిని విడిచిపెట్టమని, 20 మంది పిల్లలను గుజరాత్‌కు, 11 మందిని పటియాలాకు పంపమని ఢిల్లీ పోలీసులకు ఆదేశమిచ్చింది. వారి ఆదేశాలను ఢిల్లీ పోలీసులు అమలు చేసేట్లా ఎవరు ఒత్తిడి చేశారో ప్రస్తుతానికి తెలియదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారిని విడిచిపెట్టేసినా చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ సుష్మా విజ్ ఢిల్లీలోని మయూర్ విహార్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి విషయమంతా తెలియపరుస్తూ ''అసాంలోని ఐదు జిల్లాల సిడబ్ల్యుసిల నుండి సమాచారం తెప్పించుకుని తగురీతిగా వ్యవహరించండి'' అని రాశారు. అయితే వాళ్లూ ఉలుకూ, పలుకూ లేకుండా కూర్చున్నారు.
ఈ విషయం తమ దృష్టికి రాగానే అసాం స్టేట్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారు జూన్ 16 న ఈ చట్టవిరుద్ధమైన తరలింపు (ఇది 'చైల్డ్ ట్రాఫికింగ్' అన్నారు వారు, నిజానికి అది చాలా పెద్ద పదం, నేరాలు చేయించడానికి పిల్లలను దొంగతనంగా రవాణా చేయడాన్ని ట్రాఫికింగ్‌గా వ్యవహరిస్తారు) గురించి ఏ చర్య తీసుకున్నారో ఐదు రోజుల్లో తెలపమని అసాం పోలీసులో సిఐడి విభాగంలో ఎడిజిపికి లేఖ రాశారు. దాని కాపీని నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్‌కి పంపారు. అసాం పోలీసు ఏ చర్యా తీసుకోలేదు. అదేమని నేషనల్ కమిషన్ అడగలేదు. కానీ కోక్రఝార్ జిల్లాలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యులు ఆ 31 మంది బాలికల యిళ్లకు వెళ్లి వాకబులు చేయసాగారు. అందువలన కోక్రఝార్ సిడబ్ల్యుసి చైర్మన్ అయిన మలయా డేకా జూన్ 22న సురేంద్రనగర్ జిల్లా సిడబ్ల్యుసికి 'మీ జిల్లాలోని హల్వాడ్ పట్టణంలో వున్న సరస్వతీ శిశు మందిరంలోని అసాం పిల్లలను వెనక్కి పంపించే ఏర్పాట్లు చూడ'మని ఉత్తరం రాశారు. కానీ వారు ఉలకలేదు, పలకలేదు.
పిల్లల్లో 20 మందిని గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు తీసుకెళ్లారు. వారిని ఆ జిల్లా సిడబ్ల్యుసి ముందు ప్రదర్శించలేదు. కొండప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు పూర్తి భిన్నమైన గుజరాత్ యిసుక ప్రాంతాలలో ఎలా యిమడగలరో సిడబ్ల్యుసి అంచనా వేయనేలేదు. హల్వాడ్‌లోని విద్యాభారతి ట్రస్టుకు చెందిన సరస్వతీ శిశు మందిర్‌కు పంపమని ఆదేశాలు జారీ చేసింది. ఇదేదో ఘనకార్యం అన్నట్లు జూన్ 17 నాటి ''గుజరాత్ సమాచార్''లో ''అసాంలో యిటీవల వచ్చిన వరదల కారణంగా అనాథలైన 5 నుంచి 8 సం||ల లోపు 20 మంది ఆడపిల్లలను హల్వాడ్‌లోని సరస్వతీ శిశు మందిర్ ఆదుకుని తమ దగ్గర పెట్టుకుని విద్యాబుద్ధులు చెప్పించడానికి ముందుకు వచ్చింది. ఈ ఔదార్యం వలన గుజరాత్ ప్రతిష్ఠ మరింత పెరిగింది.'' అని వార్త వేయించారు కూడా. దాని ప్రకారం -వీరి ప్రచారం కోసం ఆ పిల్లల తలిదండ్రులను చంపేశారన్నమాట! ఈ వార్త వచ్చిన మర్నాడు అసాం స్టేట్ చైల్డ్ ప్రొటక్షన్ సొసైటీకి మెంబర్-సెక్రటరీగా వున్న కుదుమ్ కాలితా అనే ఐయేయస్ అధికారిణి కోక్రఝార్, గోసాల్గావ్ జిల్లాలలోని సిడబ్ల్యుసిలకు లేఖ రాస్తూ, '31 మంది పిల్లలను ఢిల్లీలో రక్షించినా, రాజకీయ శక్తుల జోక్యంతో వారిని గుజరాత్, పటియాలాలకు తరలించుకుపోయారని, సురేంద్రనగర్ సిడబ్ల్యుసి ఆదేశాలు జారీ చేయడానికి ముందు, పిల్లల స్వస్థలాలలో వున్న సిడబ్ల్యుసిలను సంప్రదించి వుండాలని, ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారో తెలిసింది కాబట్టి వారిని వెనక్కి రప్పించి, వారివారి తలిదండ్రులకు అప్పగించాలని' చెప్పింది. అసాంలోని సిడబ్ల్యుసిలన్నిటికీ యిదే విధమైన హెచ్చరిక చేసింది. ఆ లేఖ అందుకున్నాక కోక్రఝార్‌లోని సిడబ్ల్యుసి సురేంద్రనగర్ సిడబ్ల్యుసికి పిల్లలను వెనక్కి పంపివేయమని అడుగుతూ లేఖ రాసింది. సురేంద్రనగర్ సిడబ్ల్యుసి యిప్పటిదాకా సమాధానం యివ్వలేదు. సరి కదా, గుజరాత్ రాష్ట్రపు మహిళా, శిశు శాఖ మంత్రిణి వసుబెన్ త్రివేది సురేంద్రనగర్ సిడబ్ల్యుసి చేసిన పనిని హర్షించింది. హల్వాడ్ శిశు మందిర్ పిల్లలకు 'ఆశ్రయం' కల్పించి గుజరాత్ సంప్రదాయానికి వన్నె తెచ్చిందని ప్రకటించింది.
ఈ పిల్లలలో 20 మంది గుజరాత్‌కు చేరగా 11 మంది పటియాలాకు చేరారు. ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు నడుపుతున్న మాతా గుజరీ కన్యా ఛాత్రవాస్ అనే చోట వాళ్లను వుంచారు. చైల్డ్‌లైన్ ఢిల్లీ వారి సూచన మేరకు పటియాలా చైల్డ్‌లైన్ శాఖ సభ్యులు, పటియాలా సిడబ్ల్యుసి సభ్యులతో కలిసి అక్కడకు వెళ్లి పిల్లలను చూడబోయారు. సొసైటీగా రిజిస్టర్ చేసిన ఆ సంస్థకు జువినైల్ జస్టిస్ యాక్ట్ కింద హాస్టల్‌గా అనుమతి లేదు. అక్కడ యీ 11 మందితో పాటు వున్న 20 మంది స్కూలుకి వెళుతున్నారు. మంచాలు లేవు, పరుపులు అధ్వాన్నంగా వున్నాయి. పిల్లలకు సంబంధించిన దస్తావేజులు చూపమంటే, ఏమీ చూపలేకపోయారు. ఇంకా లోతుగా విచారిస్తూ వుంటే ఆరెస్సెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కమిటీ సభ్యుల్లో శిఖ్కు ఆయన గట్టిగా మాట్లాడుతూంటే సేవికా సమితి వాళ్లు వచ్చి ''నువ్వు హిందువువి కాదు కాబట్టి, యిలా చేస్తున్నావు'' అంటూ నిందించారు.
దీని గురించి యింత రచ్చ జరిగాక సేవాభారతి, రాష్ట్ర సేవికా సమితి పిల్లల్ని వెనక్కి తెచ్చేసి చేతులు దులుపుకుంటే పోయేది. గుజరాత్లో బిజెపి ప్రభుత్వం వుంది. పంజాబ్‌లో బిజెపి-అకాలీదళ్ ప్రభుత్వం వుంది. ప్రభుత్వం మద్దతు తమకుండడంతో యిలాటి నిరసనలు పట్టించుకోవడం అనవసరం అనుకుని వేరే మార్గం పట్టారు. ఆ పిల్లల తలిదండ్రుల నుంచి తమ యిష్టప్రకారమే పిల్లలను పంపామని అఫిడవిట్లు సంతకాలు చేయించి జులై 13 న నోటరీ వద్ద నోటిఫై చేయించి దగ్గర పెట్టుకున్నారు. ఇలా అఫిడవిట్లు దాఖలు చేసే వీలు – పైగా పిల్లల్ని పంపేసిన నెల తర్వాత – చట్టంలో కల్పించలేదు. ఇంగ్లీషులో ఒకే రకమైన మేటరుతో వున్న యీ అఫిడవిట్లపై సంతకాలు చేసిన తలిదండ్రులెవరికీ యింగ్లీషు రాదు. వారిలో కొందరికి చదువే రాదు. వాటిలో రాసినదేమిటంటే – 'నేను రైతును. 2014 జనవరి 25 న జరిగిన కలహాల్లో మా యిల్లు నాశనమైంది. నేను శరణార్థి శిబిరంలో వుంటున్నాను. నాకు ఆదాయం లేదు. మా అమ్మాయి స్కూలు ఫీజు చెల్లించలేకపోతున్నాను. అందువలన నా యిష్టప్రకారం గుజరాత్‌లోని ఫలానా శిశు మందిరానికి చదువు నిమిత్తమై పంపిస్తున్నాను.' అని. విచారణలో తేలిందేమిటంటే – ఈ పిల్లల తలిదండ్రులెవరూ కలహాల బాధితులు కారు. ఎవరూ శరణార్థి శిబిరాల్లో లేరు. అందరికీ చిన్నదో, పెద్దదో యిల్లుంది, ఆదాయముంది. కొందరికి భూములు కూడా వున్నాయి. సేవాభారతి యిలా ఏదో గోల్మాల్ చేసి, ప్రభుత్వం మద్దతుతో వ్యవహారాన్ని అణగదొక్కి వుంచింది.
అయితే కోక్రఝార్ సిడబ్ల్యుసి వదిలిపెట్ట దలచుకోలేదు. 2016 ఫిబ్రవరిలో ఒక అధికారిని తలిదండ్రుల వద్దకు పంపి విచారించి యీ వాస్తవాలు పైకి లాగింది. తరలింపులో పాల్గొన్న కార్యకర్తలు విచారణ జరుపుతున్న అధికారులను బెదిరించారు. దాంతో మలయా డేకా దొంగ అఫిడవిట్లు యిప్పించినవారిపై, బెదిరించినవారిపై చర్య తీసుకోమని గువాహతి హైకోర్టుకు, కోక్రఝార్ జిల్లా జడ్జికి ఫిర్యాదు చేశారు. కానీ వారి నుంచి స్పందన కరువైంది. ఇక విసిగి వేసారి, వారు పత్రికల వాళ్లను పిలిచి కేసు పూర్వాపరాలు వాళ్లకు చెప్పేశారు. వాళ్లు మూణ్నెళ్లపాటు అన్ని చోట్లకూ వెళ్లి కూపీలు లాగి, పిల్లలు తరలి వెళ్లి ఏడాది దాటిన సందర్భంగా కథనాలు వేయసాగారు. పిల్లలను యిష్టపూర్వకంగా పంపిన తలిదండ్రులు యీ లోగా తము చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నారు. ఎందుకంటే వాళ్ల పిల్లలు ఎక్కడున్నారో వాళ్లకు తెలియదు. చూడడానికి లేదు, ఫోన్లో మాట్లాడడానికి లేదు. వాళ్ల చదువు ఎలా సాగుతోందో వాళ్లకు ప్రోగ్రెసు రిపోర్టులు పంపినవారు లేరు. వీళ్లకు నచ్చచెప్పి తమ కూతుళ్లను కూడా తోడుగా పంపిన కార్యకర్తలు తమ పిల్లలతో ఫోన్లో మాట్లాడుతున్నాడు కానీ వీళ్లకు ఆ సౌకర్యం లేదు. అది వీళ్లలో కడుపుమంట కలిగించింది. మొదట్లో ఏడాది పాటే విడిగా వుంటుంది అని చెప్పి ఒప్పించారు. ఇప్పుడు నాలుగైదేళ్ల దాకా రాదంటున్నారు. ఎందుకు పంపామా అని వాళ్లు బాధపడుతున్న తరుణంలో పత్రికల వాళ్లు వెళ్లడంతో వాళ్లు నోళ్లు విప్పి అన్నీ చెప్పసాగారు. దాంతో సేవాభారతి వాళ్లు ఉలిక్కిపడ్డారు. తమ కార్యకర్తలను పంపించి, పిల్లల తాలూకు డాక్యుమెంట్లు, ఫోటోలు అన్నీ తమ వద్దకు తెప్పించేసుకున్నారు. ఎవరితో మాట్లాడడానికి వీల్లేదని కట్టడి చేశారు.
అయినా ''ఔట్లుక్'' పత్రిక తన ఆగస్టు 8 సంచికలో పూర్తి కథనం వేసింది. దానిపై బిజెపి వర్గాలు మండిపడ్డాయి. ఆ పత్రికను హిందూ వ్యతిరేకిగా తిట్టిపోశాయి. 'మేం చెప్పిన వాస్తవాలను ఖండించలేక పోయారు కదా' అని పత్రిక నిలదీస్తోంది. గతంలో క్రైస్తవ సంస్థలు కావచ్చు, యిప్పుడు హిందూ సంస్థలు కావచ్చు – ఆ పిల్లలను యిన్ని చట్టాలతిక్రమించి వేరే రాష్ట్రానికి తీసుకెళ్లే బదులు అసాంలోనే వుంచి తామనుకున్న శిక్షణ గరిపితే నష్టమేముందో మన కర్థం కాదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)