డబ్బులిచ్చి, సన్మానించి.. అవమానించారు.!

రాజకీయ నాయకులంటేనే అంత. నోటికొచ్చింది మాట్లాడతారంతే. ఇదే మన దేశ దౌర్భాగ్యం. నానా పాట్లూ పడి ఒలింపిక్స్‌కి వెళ్ళి పతకాలు పట్టుకొస్తే, మన రాజకీయ నాయకుల మాటలెలా వున్నాయో తెలుసా.? 'గోల్డ్‌ మెడల్‌ తీసుకొచ్చేలా…

రాజకీయ నాయకులంటేనే అంత. నోటికొచ్చింది మాట్లాడతారంతే. ఇదే మన దేశ దౌర్భాగ్యం. నానా పాట్లూ పడి ఒలింపిక్స్‌కి వెళ్ళి పతకాలు పట్టుకొస్తే, మన రాజకీయ నాయకుల మాటలెలా వున్నాయో తెలుసా.? 'గోల్డ్‌ మెడల్‌ తీసుకొచ్చేలా మంచి కోచ్‌ని సింధుకి ఏర్పాటు చేస్తాం..' అనేంతలా. నాన్సెన్స్‌కి పరాకాష్ట ఇది. క్రీడలంటే కనీస అవగాహన లేని రాజకీయ నాయకులు, మనకు మంత్రులుగా పనిచేస్తోంటే, పరిస్థితులు ఇలానే వుంటాయ్‌ మరి. 

'నా గెలుపుకి కారణం గోపీచంద్‌.. గోపీచంద్‌ లేకపోతే నేను లేను..' అంటూ ఓ పక్క ఒలింపిక్‌ రజత పతక విజేత సింధు నెత్తీనోరూ బాదుకుంటున్నా, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీకి అవేమీ పట్టలేదు. ఆయన చుట్టాలో, ఇంకొకరో కోచ్‌ రేసులో వున్నారేమో.! అందుకే, ఇంకా మంచి కోచ్‌ని సింధు కోసం ఏర్పాటు చేస్తామని సెలవిచ్చారు. గోపీచంద్‌ కూడా మంచి కోచేనట. ఇదో ముక్తాయింపు మరి.! 

సింధుకి ఐదు కోట్లు, వెయ్యి గజాల స్థలం, కోరితే ప్రభుత్వ ఉద్యోగం.. ఇవీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్లు. కోచ్‌ గోపీచంద్‌కి కూడా కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఏం లాభం.? గోపీచంద్‌ని ఇంత దారుణంగా అవమానించారు ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ. తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఇప్పటికిప్పుడు స్పందించాల్సి వుంది. 

పుల్లెల గోపీచంద్‌ అంటే ఆషామాషీ వ్యక్తి ఏమీ కాదు. బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టించిన ఒకప్పటి ఆటగాడు. 'గురువు' అంటే ఎలా వుండాలో నిరూపించిన వ్యక్తి. కాస్తలో తప్పిపోయిందిగానీ, లేదంటే సింధు బంగారు పతకాన్ని రియో ఒలింపిక్స్‌లో సొంతం చేసుకునేదే. ఆ విషయంలో సింధు కన్నా ఎక్కువ డిజప్పాయింట్‌ అయ్యింది బహుశా గోపీచందేనేమో.! 

ఏదిఏమైనా మహమూద్‌ అలీ వ్యాఖ్యలతో, గోపీచంద్‌ – సింధులకు జరిగిన సన్మానం నీరుగారిపోయింది. డ్యామేజీ కంట్రోల్‌ చర్యలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగుతారా.? దిగగలరా.? వేచి చూడాల్సిందే.